Sleep : మనిషి జీవనశైలిలో వచ్చిన మార్పులు వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంటి నిండా నిద్ర కడుపునిండా తిండి కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా నిద్ర విషయంలో అయితే దారుణమైన పరిస్థితులు బయట కనిపిస్తున్నాయి. ఈ స్మార్ట్ యుగంలో నిద్ర విషయంలో సమయం అంటూ లేకుండా పోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం.. తొమ్మిది, పది గంటలకు నిద్రలేచి హడావిడిగా ఉద్యోగాలకు, వ్యాపకాలకు వెళ్లడం అలవాటుగా మారిపోయింది. ఇది అనేక సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ, ముఖ్యంగా నిద్ర విషయంలో అలసత్వం పనికిరాదని, సమయపాలన పాటించాలని సూచిస్తున్నారు.
ఒకప్పుడు నిద్రకు వేలంటూ ఒకట ఉండేది. రాత్రి 9 గంటలకు పడుకుంటే తెల్లవారుజాము ఐదు, ఆరు గంటలకి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకునేవారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యేవారు. కాలంతోపాటు మనిషి జీవన విధానంలోనూ మార్పులు వచ్చాయి. బిజీ లైఫ్ లో పడి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేస్తున్నారు. అయితే, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఏ సమయంలో నిద్ర పోవాలి.. ఎప్పుడూ నిద్ర లేవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కనీసం ఏడు గంటల నిద్ర అవసరం..
సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకు అనుగుణంగా సమయాన్ని నిద్రకు వెచ్చించడం అవసరం. కానీ, జీవన శైలిలో వచ్చిన మార్పులు వల్ల ప్రజలు అర్ధరాత్రి వరకు మెలుకువగా ఉంటున్నారు. దీంతో చాలామంది కంటి నిండా నిద్ర పోవడం మానేస్తున్నారు. వాస్తవానికి వ్యక్తి వయసు, పనిచేసే విధానం వంటివి నిద్ర సమయాన్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా చాలాసార్లు నిద్రపోయే, లేచే సమయం ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. కానీ నిద్రించడానికి సరైన సమయం ఏది అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
ఆ సమయంలో నిద్ర చాలా మంచిది..
ప్రతిరోజు కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి. వయసును బట్టి నిద్రపోయే వేళలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యువకులకు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య సమయం సరైనది. ఉదయం 5-6 మధ్య లేవాలి. పెద్దలు నిద్రించడానికి ఉత్తమమైన సమయం రాత్రి పది నుంచి 11 గంటల మధ్య పరిగణించబడుతుంది. వీళ్ళు కూడా ఆరు గంటలకు లేవాలి. పిల్లలు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోయేలా చేయాలి. ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య లేవడం మంచిది. మంచి నిద్ర కోసం వారాంతంలో కూడా నిద్ర, మేల్కొనే సరైన సమయాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. శిశువులకు అయితే 12 నుండి 15 గంటల నిద్ర అవసరం. పసిబిడ్డలకు రోజుకు 11 నుంచి 14 గంటలు వరకు, స్కూలుకు వెళ్ళని చిన్నారులకు 10 గంటల వరకు, పాఠశాలకు వెళ్లే చిన్నారులకు అయితే తొమ్మిది నుంచి పది గంటల నిద్ర అవసరం. టీనేజ్ యువత ఎనిమిది నుంచి పది గంటల నిద్ర పొందడం మంచిది. యువత ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్ర చేయాలి. వృద్ధులు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు.
నిద్రలేమితో అనేక ఇబ్బందులు..
జీవన శైలిలో వచ్చిన మార్పులు, రాత్రి వరకు ఉద్యోగాలు చేయాల్సిన రావడం, పెరిగిన పట్టణీకరణ వంటి అనేక అంశాలు నిద్రపోయే సమయంలో మార్పులకు కారణమయ్యాయి. సాధారణంగా పట్టణాల్లో, నగరాల్లో అర్ధరాత్రి తరువాత గాని నిద్రించడం లేదు. గ్రామాల్లో ఒకప్పుడు రాత్రి 8 గంటల దాటితే ముసుగు తన్ని పడుకునే వాళ్ళు. ప్రస్తుతం గ్రామాల్లో కూడా 10 నుంచి 11 గంటల వరకు నిద్రపోవడం లేదు. కంటి నిండా నిద్ర పోకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరసంగా ఉండడం, బద్ధకం ఆవరించడం, చికాకు, కోపం వంటివి పెరగడంతోపాటు ఇతర సమస్యలు నిద్రలేమితో కనిపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కంటినిండా నిద్రపోవాలని అందుకు సమయాన్ని కేటాయించడం మంచిది సూచిస్తున్నారు..