Heat Stroke: సూర్యుడు రెచ్చిపోతున్నాడు. మండే ఎండతో మాడు పగలగొట్టేస్తున్నాడు. బయటకు వెళ్తే భరించలేని వేడి, ఇంట్లో ఉంటే తట్టుకోలేనంత ఉక్కపోత. ఫ్యాన్ వేసుకుంటే నిప్పుల కొలిమి కింద ఉన్నట్టు ఉంటున్నది. ఏసీ వేసుకుంటే ఉపశమనం ఆ కొద్దిసేపే ఉంటోంది. దీంతో ఒంట్లో వేడి పెరిగిపోయి రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విపరీతమైన స్వేదం, చర్మం పొడిబారడం, తలనొప్పి, మగత, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు కూడా తోడవుతున్నాయి. లక్షణాలన్నీ ఒంట్లో వేడి పెరగడం వల్ల కలిగేవే. స్థూలంగా చెప్పాలంటే ఇవి వడదెబ్బ తాలూకూ లక్షణాలు. మనలో చాలామంది ఈ లక్షణాలు కల్పించినప్పటికీ పెద్దగా లెక్క చేయరు. కానీ వీటిని విస్మరిస్తే ప్రాణపాయానికి దారితీస్తుంది.
ఎండ వేడిమికి శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఎండదెబ్బ బారిన శరీరం పడుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలకు గురయినా లేక వేడి వాతావరణంలో శారీరక శ్రమ వల్ల శరీర ఉష్ణోగ్రత ఆ మేరకు చేరుకున్నా ఎండదెబ్బ తగులుతుంది. ఎక్కువ సమయంపాటు ఎండలో గడపడం వల్ల శరీర కేంద్ర ఉష్ణోగ్రత (కోర్ టెంపరేచర్) పెరుగుతుంది. ఇలాంటి స్థితి వేడిగా, తేమగా ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయంపాటు గడపడం వల్ల సంభవిస్తుంది. వేడి వాతావరణంలో అత్యధిక శారరీక శ్రమకు గురయినా శరీర కేంద్ర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి ఎండదెబ్బకు గురవుతాం. ఆ స్థితిలో అయోమయం, స్పృహ కోల్పోవడం, వాంతులు, ఒళ్లు వేడిగా మారడం, శ్వాస, గుండె కొట్టుకునే వేగం నెమ్మదించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు
ఎలాంటి ఎండదెబ్బకు గురయినా అందుకు పలు కారణాలు ఉంటాయి. గాలి ధారాళంగా చొరబడని దుస్తులు, చమటను పీల్చుకునే వీలు లేని దుస్తులు ధరించడం. వేడిని గ్రహించే వీలున్న నల్ల దుస్తులు ధరించడం. మద్యం తీసుకోవడం. మద్యం తాగడం వల్ల ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేసే శక్తి శరీరం కోల్పోతుంది. స్వేదం ద్వారా శరీరం కోల్పోయిన నీటిని భర్తీ చేయకపోవడం.
ఎండదెబ్బకు గురయి బాధ పడేకంటే, ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడడం మేలు. వేసవి వేడి, ఎండల ప్రభావానికి గురవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి. ధరించే దుస్తులు తేలికగా, గాలి చొరబడేలా, చమట పీల్చేలా సౌకర్యంగా ఉండాలి. వీలైనంతవరకూ తెల్లని దుస్తులే ధరించాలి. సూర్యరశ్మి నేరుగా సోకితే, శరీరం తనంతట తాను చల్లబడే స్వభావాన్ని కోల్పోతుంది. కాబట్టి ఎండలో బయటకు వెళ్లవలసివస్తే తలకు టోపీ, కళ్లకు చలువ కళ్లద్దాలు, గొడుగు తప్పనిసరిగా వాడాలి. వైద్యులు సూచించే సన్‌స్ర్కీన్ వాడడం వల్ల చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా ఉంటుంది. దాహం వేసేవరకూ ఆగకుండా గంటకొకసారి నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లతోపాటు కొబ్బరినీరు, మజ్జిగ కూడా తరచుగా తాగుతూ ఉండాలి. ఇలా ఒంట్లో నీటి పరిమాణాన్ని సక్రమంగా ఉంచుకుంటే ఎండ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండ తీవ్రత ఎక్కువ. కాబట్టి ఆ సమయాల్లో నీడ పట్టున గడపాలి. వ్యాయామానికి ఎండ లేని సమయాలను కేటాయించాలి. వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఏం చేయాలో అర్థం కాదు. వేసవిలో కొందరి పరిస్థితి ఇది. ఇలా మీకూ అనిపిస్తూ ఉంటే, గ్లాసుడు నీళ్లలో ఒక స్పూను తేనె కలుపుకుని తాగి చూడండి. ఆ తర్వాత తాగే నీళ్లతో మీ దాహం తీరడం ఖాయం. అన్నట్టు, చల్ల నీళ్లతో దాహం తీరదు. ఫ్రిజ్‌లో నుంచి గడ్డకట్టిన నీళ్ల బాటిల్ తీసి తాగటం వృథా. అతి చల్లని నీళ్లు జీర్ణమై రక్తంలో కలవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆలోగా ఒంట్లోని ప్రతి కణం దాహార్తితో అల్లాడిపోతుంది. కాబట్టి జీర్ణాశయం ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా గోరు వెచ్చని నీళ్లు తాగితే దాహం తీరుతుంది.