మనలో చాలామంది జుట్టు సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోవడం, చిట్లిపోవడం, చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావడం లాంటి సమస్యలు ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటాయి. అయితే చాలావరకు జుట్టు సమస్యలకు మనం చేసే తప్పులే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో జుట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువగా వేధించే అవకాశం ఉంటుంది.
చలికాలంలో తేమ తక్కువగా ఉండటం వల్ల జుట్టు పొడిబారే అవకాశం ఉంటుంది. వారానికి ఒకసారైనా తలకు నూనె రాసి మర్ధనా చేసుకుని కొన్ని గంటల తరువాత తలస్నానం చేస్తే మంచిది. చలికాలంలో పీహెచ్ 5.5 ఉన్న షాంపులను వాడితే షాంపూల వల్ల ఎలాంటి జుట్టు సంబంధిత సమస్యలు రావు. జుట్టును ఆరబెట్టుకోవడానికి హెయిర్ డ్రయ్యర్, రోలర్స్ లాంటి హీట్ పరికరాలను అస్సలు వాడకూడదు.
వారానికి రెండు రోజుల కంటే ఎక్కువసార్లు తలస్నానం చేయకూడదు. కెమికల్ షాంపూలను ఎక్కువగా వినియోగిస్తే జుట్టు పొడిబారే సమస్య వేధించే అవకాశం ఉంటుంది. జుట్టు చలికాలం త్వరగా చిక్కుబడుతుంది. తడిజుట్టును దువ్వటానికి ప్రయత్నిస్తే జుట్టు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుఫల్ల జుట్టు పూర్తిగా ఆరిన తరువాత మాత్రమే చిక్కు వదిలించుకుంటే మంచిది. చలికాలంలో స్నానానికి వినియోగించే నీరు మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
జుట్టుకు జెల్ రాసే అలవాటు ఉన్నవాళ్లు జుట్టు పూర్తిగా ఆరిన తరువాతే జెల్ రాయడం మంచిది. కెమికల్స్ తో తయారైన జెల్స్ ను వినియోగించక పోవడమే మంచిది. తలస్నానం చేసిన తరువాత వీలైతే కండీషనర్ ను కచ్చితంగా వినియోగించాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కండీషనర్ సహాయపడుతుంది.