H3n2 Virus On India: కరోనా పూర్వ పరిస్థితులు ఏర్పడ్డాక రకరకాల వైరస్ లు మళ్ళీ పంజా విసురుతున్నాయి. జనాలపై పదేపదే దాడి చేస్తున్నాయి. దాంతో చాలామంది తరచుగా జ్వరం, జలుబు, దగ్గువంటివాటి బారిన పడడం సాధారణంగా మారింది. మందులు వాడితే తగ్గిపోవడం.. మళ్లీ పది-పదిహేను రోజులకోసారో, నెలకొకసారో.. అనారోగ్య సమస్యలు తలెత్తడం. ఇదీ పరిస్థితి. గతంలో ఏడాదికొకమారు కూడా ఆస్పత్రి ముఖం చూడని వాళ్లుసైతం ఇప్పుడు తరచుగా వైద్యుల వద్దకు పరుగెత్తాల్సి వస్తోంది. ఒకవైపు వైరస్ లు, మరోవైపు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ విజృంభణతో జనం అల్లాడిపోతున్నారు. చిన్నారుల్లో స్వైన్‌ప్లూ కేసులు పెరుగుతున్నాయి.
అరుదైన సందర్భాల్లో
వైర్‌సలలో మ్యుటేషన్లు (జన్యుమార్పులు) సహజం. సాధారణంగా మ్యుటేషన్ల వల్ల అవి బలహీనపడతాయి. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే బలాన్ని సంతరించుకుని మరింత ప్రమాదకరంగా తయారవుతాయి. కరోనానే ఉదాహరణగా తీసుకుంటే.. దానిలో చైనాలో పుట్టిన వూహాన్ (మూల) వేరియంట్, దాని తర్వాత అల్ఫా, గామా, డెల్టా వంటివి బలమైన వేరియంట్లు కాగా.. ఒమైక్రాన్ బలహీనపడ్డ వేరియంట్. ఏ వైరస్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారుల దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావారణంలో మార్పులు, పట్టణీకరణ, ప్రజల్లో ఊబకాయం పెరగడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం, ఆహారపుటలవాట్లు, నిద్రలేమి.. ఇలా రకరకాల కారణాలవల్ల ప్రజల్లో రోగ నిరోధకశక్తి తగ్గిపోతోందని, కాబట్టి వైర్‌సల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
చుక్కలు చూపిస్తున్నాయి
గతంలో ఫ్లూ వస్తే లక్షణాలు తెలిసేవని.. ఇప్పుడు రకరకాల లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ఫ్లూ బారిన పడితే గతంలో ఎగువ శ్వాసకోశ సమస్యలతోపాటు, జలుబు, పొడిదగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్లూ వస్తే విరేచనాల వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి 2-3 రకాల వైరస్ లతో పాటు బ్యాక్టీరియాలు కూడా దాడి చేయడం వల్ల వ్యాధి లక్షణాలను వెంటనే నిర్ధారించలేకపోతున్నామని డాక్టర్స్ అంటున్నారు. గతంలో 90 శాతం వ్యాధిలక్షణాల ఆధారంగా జబ్బేంటో గుర్తించి చికిత్స అందించేవారు. తగ్గకపోతే ఆ తర్వాత మాత్రమే టెస్టులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు.
ఇలా చేయాలి
వైద్యులు చెబుతున్నదాని ప్రకారం.. 3 నుంచి 5 సంవత్సరాలకొకసారి ఫ్లూ తీవ్రత పెరుగుతుంది. వాతావారణం మారినప్పుడు.. అంటే చలి కాలం ముగిసి ఎండాకాలం వచ్చే సమయంలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది. దాన్ని దీటుగా ఎదుర్కోవాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. క్రమపద్ధతి లేని జీవనశైలి వల్ల ఇమ్యూనిటీ స్థాయులు తగ్గుతాయని.. అప్పుడు చిన్నపాటి వైర్‌సలు, బ్యాక్టీరియా దాడి చేసినా జబ్బుపడే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఫ్లూ బారిన పడ్డవారు విధిగా మాస్క్ వాడాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అందరూ మాస్క్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. జపాన్‌లో ఫ్లూ సీజన్ వస్తే విధిగా అంతా మాస్కులు ధరిస్తారని.. కొవిడ్ రాకముందు నుంచే అక్కడ ఈ అలవాటు ఉండేదని గుర్తుచేస్తున్నారు.