
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభించి ఏడాది దాటింది. మహమ్మారి ఉధృతి తగ్గుతున్నా సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో శాస్త్రవేత్తలు వైరస్ పై, వ్యాక్సిన్ పై పరిశోధనలు చేసి వ్యాక్సిన్ ను వేగంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ధర 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల మధ్య ఉండవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆధార్ పూనావాలా మాత్రం కరోనా వ్యాక్సిన్ ధరకు సంబంధించి శుభవార్త చెప్పారు. 2021 సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలలలో ప్రజలకు సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ప్రతి ఒక్కరికి రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ అవసరమని ఒక్కో డోసు ధర 500 రూపాయల నుంచి 600 రూపాయల మధ్యలో ఉంటుందని ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్ అవసరం కాబట్టి 1,000 రూపాయల నుంచి 1,200 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. భారత్ లో జనవరి నాటికి వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తుది దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి వ్యాక్సిన్ విడుదల తేదీ ఉంటుందని తెలిపారు.
భారత్ లోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందించడమే తన ముందు ఉన్న లక్ష్యమని పేద దేశాలతో తప్ప ఇతర దేశాలతో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకోవడం లేదని ఆధార్ పూనావాలా వెల్లడించారు.