Homeలైఫ్ స్టైల్TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త..!

TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త..!

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కొంత కాలంగా ఈ మార్గంలో వచ్చే భక్తులకు దర్శన టోకెన్ల జారీపై పలు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. తాజాగా టీటీడీ ఈవో వీరికి దర్శనానికి సంబంధించిన టోకెన్ల జారీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కరోనా ముందు కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసేది. ఇప్పుడు నడకదారిలో వచ్చే భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో ఉగాది.. శ్రీరామ నవమి పర్వదినాల నిర్వహణ.. బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ తాజాగా నిర్ణయాలు తీసుకుంది.

కాలినడక భక్తులకూ టైంస్లాట్‌ టోకెన్లు
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు దర్శనం టోకెన్లు ఇవ్వాలనే అంశంపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. ఈవో ధర్మారెడ్డిని పలువురు భక్తులు ఇదే అంశం పైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో, నడకదారిన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీపైన కసరత్తు చేస్తున్నామని ఈవో వెల్లడించారు. ఇప్పుడు నిర్ణయం దిశగా కసరత్తు జరుగుతోంది. టోకెన్లు, టికెట్లు లేకుండా కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య ఎంత శాతం ఉందనే అంశంపై నెల రోజుల నుంచి సర్వే చేసి 40–50 శాతం టికెట్లు, టోకెన్లు ఉన్న వారు వస్తున్నట్టు గుర్తించింది. ఈ క్రమంలో ఎలాంటి టికెట్లు లేనివారికే నడకమార్గాల్లో టైంస్లాట్‌ టోకెన్లు జారీ చేసేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

నిమిషాల్లో గదులు..
ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఏప్రిల్‌ 1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో తిరుమలకు వచ్చే భక్తులు 5 నుంచి 10 నిమిషాల్లోనే గదులు పొందుతున్నట్టు ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో తిరుమలలో 60 ఏళ్ల నాటి వసతి నివాసాలను ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో దాదాపు 7,500 వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. అందులో సిఫార్సు లేఖలపైన వచ్చే వారికి ఎక్కవ మొత్తంలో చెల్లించే గదులను కేటాయిస్తారు. సాధారణ భక్తులకు కేటాయించే గదులకు సంబంధించి పలుమార్లు మరమత్తులు అవసరం అవుతోంది. దీంతో, భక్తులకు కావాల్సిన సౌకర్యాలతో వీటిని పూర్తిగా ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియ కొనసాగుతోంది.

ఆ రెండు రోజులు బ్రేక్‌ దర్శనాలు రద్దు
ఈ నెల 22న తిరుమలలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇదే సమయంలో ఉగాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కూడా రద్దు చేసింది. ఇక, ఈ నెల 30న తిరుమలలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. 31న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది. ఈ రెండు రోజులు కూడా బ్రేక్‌ దర్శనాలు ఉండవు.

మొత్తంగా కాలినడక భక్తులకు టైంస్లాట్‌ టోకెన్ల జారీతో ప్రయోజనం కలుగుతుంది. ఫేస్‌ రికగ్నేషన్‌తోనూ గదుల విషయంలో భక్తులకు ఊరట కలుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular