Ambali Benefits: వేసవి కాలం వచ్చిందంటే జొన్నలతో అంబలి చేసేవారు. పూర్వం రోజుల్లో ఉదయం అల్పాహారంగా అంబలి తాగేవారు. దీంతో రోజంతా వారికి దాహం వేసేది కాదు. వడదెబ్బ తగిలేది కాదు. ఇలా వారి ఆహారంలో అంబలికి ప్రత్యేక స్థానం ఉండేది. ధాన్యాల్లో జొన్నలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంది. అందుకే రోజు అంబలి చేసుకుని మట్టిపాత్రలో పోసుకుని తాగేవారు. దీంతో చల్లగా మంచి రుచిగా ఉండేది. అందులో పెరుగు కలుపుకుని నిమ్మరసం పిండుకుంటే దాని రుచే వేరు.
జొన్నల్లో మంచి ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయి. అందుకే బియ్యంకు బదులు జొన్నలతో చేసే రొట్టెలు, రవ్వ కానీ తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ఆరోగ్యానికి జొన్నలు మంచి లాభాలు కలిగిస్తాయి. దీంతో ఇప్పటికి కూడా కొందరు జొన్నలతో చేసిన అంబలి రోజు తాగుతుంటారు. దీని వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
జొన్న అంబలిలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడేందుకు పరోక్షంగా దోహదపడుతుంది. జొన్న అంబలి తయారు చేసుకోవాలంటే ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. దాంట్లో నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అనంతరం స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ కలుపుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి.

ఓ 10-15 నిమిషాల తరువాత అంబలి తయారవుతుంది. అందులో మిరియాల పొడి, నిమ్మరసం, క్యారెట్ ముక్కలు, మొలకెత్తిన పెసలు వేసుకుని తాగితే మంచి రుచి వస్తుంది. దీంతో ఎన్నో లాభాలున్నాయి. ఎండాకాలంలో శరీరం వేడికి తట్టుకోవాలంటే అంబలి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈనేపథ్యంలో జొన్న అంబలి తాగితే మన ఆరోగ్యం బాగుంటుంది.
అంబలి తాగడం వల్ల నీరసం పోతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్య దూరమవుతుంది. అధిక బరువు సమస్యకు పరిష్కారం చూపుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. ఇలా అంబలితో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే రోజు అంబలి తాగి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.