Thyroid : థైరాయిడ్ గ్రంధి సీతాకోకచిలుక ఆకారంలో మెడ స్వరపేటికకు దిగువన ఉంటుంది. ఇది ఎండోక్రైన్ వ్యవస్థలో ఒక భాగం. ఇది T3, T4 వంటి హార్మోన్లను రక్తప్రవాహంలోకి స్రవించేలా చేస్తుంది. THS, T3, T4 హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నా లేదంటే చాలా తక్కువ ఉన్నా సరే థైరాయిడ్ సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. సంతానోత్పత్తి రేటుపై చాలా దారుణమైన ప్రభావాన్ని చూపుతుందట. థైరాయిడ్ అసమతుల్యత వలన క్రమరహిత పీరియడ్స్ వస్తుంటాయి. అండోత్సర్గ రుగ్మతలు, గర్భధారణ నష్టం పెరగడం, ముందస్తు జననం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉన్న శిశువులలో తక్కువ IQలు ఉంటాయట కూడా.
హైపర్ థైరాయిడిజం అంటే అతిగా పనిచేసే థైరాయిడ్ గ్రంధి వల్ల ఈ సమస్య వస్తుంది. ఇది 5% మంది స్త్రీలను ప్రభావితం చేస్తుందట. బరువు తగ్గడం లేదంటే ఆకలి పెరిగడం వంటివి సంభవిస్తుంటాయి. తక్కువ లేదా తేలికైన పీరియడ్స్ వస్తాయి. చెమట వస్తుంది. వేడిని తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
హైపర్ థైరాయిడిజంకు చికిత్స వీలైనంత త్వరగా తీసుకోవాలి. లేదంటే గర్బం ధరించి చివరి దశలలో అంటే ఎనిమిది తొమ్మిదొవ నెలలో ఉన్నప్పుడు రక్తపోటు పెరగడం, అలాగే నెలలు నిండకుండానే డెలివరీ అవడం వంటి సమస్యలు వస్తాయి. లేదా పుట్టిన పిల్లలు బరువు తక్కువగా పుట్టడం, గర్భస్రావం వంటి గర్భధారణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న వారు గర్భం దాలుస్తారా? లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ ఎలాంటి సమస్య లేకుండా గర్భం దాల్చవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ గర్భధారణ సమయంలో తల్లీ బిడ్డ ఇద్దరినీ రక్షించడానికి తల్లి థైరాయిడ్ పరిస్థితిని డాక్టర్ పూర్తిగా తెలుసుకొని చికిత్స అందించాల్సి ఉంటుంది.
హైపోథైరాయిడిజం (తక్కువ థైరాయిడ్ గ్రంధి కారణంగా ఏర్పడే తక్కువ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు) 2-4% మంది స్త్రీలను ప్రభావితం చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఇది హైపర్ థైరాయిడిజం కంటే ఎక్కువగా ఉంటుందట. బరువు పెరుగడం, అలసట రావడం, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఈ హైపోథైరాయిడిజం వల్ల వస్తుంటాయి. అయితే హైపోథైరాయిడిజం వల్ల అండాశయాలపై తిత్తులు ఏర్పడతాయి. ఇది ప్రొలాక్టిన్ ఉత్పత్తిలో పెరుగుదలను కూడా ప్రేరేపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్, లేదా చనుబాలివ్వడానిసి సహాయపడే హార్మోన్లపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాగ్రత్త చాలా అవసరం.