https://oktelugu.com/

WHO: జాగ్రత్త.. ఆ కేసులు పెరుగుతున్నాయి.. షాకింగ్ విషయాలు వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పలు సూచనలు చేశారు సైమా వాజెద్. మధుమేహం, గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం అని తెలిపారు. అత్యంత ప్రాణాంతక వ్యాధులుగా మధుమేహం, గుండె జబ్బులు మారుతున్నాయని.. ఇవి భయంకర వ్యాధులుగా మారకముందే..

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 20, 2024 / 06:00 AM IST

    WHO

    Follow us on

    WHO: గతంతో పోలిస్తే ఆహార అలవాట్లు, జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఆహార పద్ధతులు సరిగ్గా లేనందు వల్ల చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత యుగంలో ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు దారుణంగా పెరుగుతున్నాయి. వీటితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు పెరుగుతుండటంతో.. సమతుల్య ఆహారం, శారీరక శ్రమను ప్రోత్సహించాలని.. దీనికి సంబంధించిన విధానాలను త్వరగా రూపొందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అన్ని దేశాలను కోరింది. ఇందులో భాగంగా.. WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్ పలు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ఈ అనారోగ్య సమస్యలను హైలైట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసుకుందాం.

    ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పలు సూచనలు చేశారు సైమా వాజెద్. మధుమేహం, గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం అని తెలిపారు. అత్యంత ప్రాణాంతక వ్యాధులుగా మధుమేహం, గుండె జబ్బులు మారుతున్నాయని.. ఇవి భయంకర వ్యాధులుగా మారకముందే… ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు చర్యలను ప్రారంభించాలని డబ్ల్యూహెచ్ఓ దేశాలను కోరింది. దీంతోపాటు పలు సూచనలు కూడా చేసింది.

    నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు: గుండె జబ్బులు , మధుమేహం, క్యాన్సర్ వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల ప్రభాం కూడా రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఈ వ్యాధులు ఇప్పుడు మూడింట రెండు వంతుల మరణాలకు కారణం అవుతున్నాయన్నారు. గణాంకాల ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 50 లక్షల మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారని వాపోయారు. అయితే 5 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల 3 లక్షల 73 వేల మంది పిల్లలు ఇదే సమస్య భారిన పడుతున్నారని పేర్కొన్నారు వాజెద్.

    జీవనశైలిలో మార్పులు అవసరం: ప్రస్తుతం, అనేక ప్రాంతాలు వేగవంతమైన జనాభా మార్పు, పట్టణీకరణ, ఆర్థిక వృద్ధి, అసమతుల్య ఆహారంతో ఇబ్బంది పడుతుంది. ఇది ప్రజల జీవనశైలిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది అన్నారు ఆయన. కౌమారదశలో ఉన్నవారిలో 74%, యువతలో 50% శారీరకంగా చురుకుగా ఉండటం లేదు. ఈ పెంపుదల ఇలాగే కొనసాగితే 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం కష్టం అని ఆవేదన వ్యక్తం చేశారు.

    అనారోగ్యకరమైన ఆహారాలపై నిషేధం: ఇప్పటికే చాలా దేశాలు ఫుడ్ లేబులింగ్ నిబంధనలను అమలు చేశాయన్నారు. ట్రాన్స్ ఫ్యాట్‌లను నిషేధించాయని.. స్వీట్ డ్రింక్స్‌పై పన్నులు పెంచేందుకు చర్యలు తీసుకున్నాయని కూడా ఆయన తెలిపారు.

    ఆరోగ్యవంతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు చాలా చర్యలు అవసరం అన్నారు. మన ఆహారం, శారీరక కార్యకలాపాలను పునర్నిర్వచించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు సైమా వాజెద్.. తద్వారా మనకు మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించవచ్చన్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.