Hairfall: ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం పెద్ద సమస్యగా మారింది. నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇరవై ఏళ్లలోనే అరవై ఏళ్లుగా కనిపిస్తున్నారు. మనం తినే ఆహారాలే మనకు ఈ తిప్పలు రావడానికి కారణం. పూర్వం రోజుల్లో డెబ్బయి ఏళ్లకు కూడా వారికి జుట్టు నెరిసేది కాదు. వారు వాడే నూనెలు అలాంటివి. తలకు ఆముదం రాసుకునే వారు. కుంకుడు కాయలతో స్నానం చేసేవారు. ఇప్పుడు షాంపూలు, సబ్బులు వాడుతూ జుట్టును నిర్వీర్యం చేసుకుంటున్నారు.
జుట్టు రాలడం సమస్య రాకుండా చేసే ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని తీసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. పోషకాలు ఉండే ఆహారాలు తీసుకుంటే జుట్టు రాలడం సమస్య ఉండదు. ఒత్తిడి, ఆందోళన, వాతావరణ కాలుష్యం వంటివి కూడా జుట్టు రాలడానికి కారణంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
జుట్టు ఒత్తుగా పెరగాలంటే తీసుకునే ఆహారాల్లో కొబ్బరి ముఖ్యమైనది. కొబ్బరితో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇందులో ఉండే పోషకాలతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా నువ్వులు కూడా మంచి ఆహారమే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా ఎదిగేందుకు దోహదపడతాయి.
బాదం పప్పు జుట్టు పెరిగేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే మెగ్నిషియం జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. మెంతులు కూడా జుట్టు రాలడాన్ని అరికడతాయి. మెంతి కూర రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జనపనార, పొద్దుతిరుగుడు, గుమ్మడి, అవిసె గింజలు కూడా జుట్టుకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. రోజు వీటిని తీసుకోవడం వల్ల మనకు జుట్టు సంబంధిత సమస్యలు రావు.