Diabetes: మధుమేహం చాలా మందికి కామన్ గా వచ్చేస్తుంది. ఈ వ్యాధి రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలితో షుగర్ వ్యాధి బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. అయితే షుగర్ వ్యాధి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆహారం, రోజు వారి కార్యకలాపాలు ఇలా చాలా కారణాలు ఈ వ్యాధికి దారితీస్తాయి. అయితే నిద్ర కూడా ఈ వ్యాధికి దోహదపడుతుందట. నిజానికి జీవక్రియకు సంబంధించిన అనేక శారీరక విధులను నిర్వహించడానికి నిద్ర ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మంచి నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ నిద్రపోవడానికి కూడా ఒక సమయం, సందర్భం ఉంటుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఇది అన్ని విషయాల్లోనూ పాటించాల్సిందే. నిద్ర విషయంలో కూడా అతి పనికిరాదు. లేదంటే ఎన్నో సమస్యల బారిన పడకతప్పదు. అతిగా నిద్రపోవడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు. నిద్ర పోయే సమయాన్ని తరచూ మార్చుకుంటే కూడా షుగర్ బారిన పడతారట. ఈ విషయాన్ని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఒకసారి వివరంగా నిద్ర వల్ల డయాబెటీస్ ఎలా వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.
నిజానికి షుగర్ వ్యాధిగ్రస్తులు తమ జీవనశైలి విషయంలో చాలా విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వ్యాధిని ఆహారం, జీవనశైలిలో మార్పులు, వ్యాయామం ద్వారా మాత్రమే నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే నిద్ర కూడా మధుమేహ వ్యాధి గ్రస్తుల జీవితంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి మధుమేహంతో బాధపడుతుంటే నిద్ర విధానం ప్రభావం అవుతుందట. డయాబెటిక్ పేషెంట్ తన షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవాలంటే కనీసం ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం అంటున్నారు నిపుణులు.
నిద్ర వ్యవధిని 31 నుంచి 45 నిముషాల పాటు మార్చుకోవడం వల్ల డయాబెటీస్ రిస్క్ పెరుగుతుందని తెలుపుతున్నాయి తాజా పరిశోధనలు. పడుకునే సమయం పెరిగినా తగ్గినా కూడా 15 శాతం డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందట. ఇదే వ్యవధి గంటకు మించి మార్చితే ఈ ప్రమాదం 59 శాతం పెరుగుతుందట. అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా మధుమేహానికి కారణం అవుతాయి అన్నమాట. నిద్ర లేకపోవటం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని వల్ల తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
రక్తంలో గ్లూకోజు స్థాయులు మరీ తక్కువస్థాయికి పడిపోతే..పోగ్లైసీమియా అంటారు.. ఇది తీవ్రమైతే స్పృహ కోల్పోవడం, గుండెపోటు, మరణం సంభవించడం వంటివి పెరుగుతాయట. అంతేకాదు.. మధుమేహ చికిత్సలో వాడే కొన్ని మందులు కూడా దీనికి దారి తీస్తాయట. అదేవిధంగా భోజనం మానెయ్యటం, ఉపవాసం, తీవ్రమైన వ్యాయామం, కిడ్నీ వైఫల్యం, వృద్ధాప్యం వంటివీ రక్తంలో గ్లూకోజ్ బాగా పడిపోయేలా చేస్తాయట. అందుకే రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రస్తుతం ఎక్కువ మంది స్క్రీన్ కు అంకితం అవుతున్నారు. ముఖ్యంగా యువత సెల్ ఫోన్, ల్యాప్, కంప్యూటర్ లకు బానిసలు అవుతున్నారు. సోషల్ మీడియా వీడియోలు, వెబ్ సిరీస్‌లు అంటూ నిద్రకు కూడా సమయాన్ని కేటాయించడం లేదు. వీటి వల్ల కొందరు రెండు మూడు గంటలు కూడా పడుకోవడం లేదు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. తిన్న ఆహారం కూడా అరగదు. ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం అవుతుంది. దీంతో రక్త ప్రసరణపై ఒత్తిడి పడుతుంది.. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా పెరుగుతాయి. అంటే అటోమెటిక్ గా యాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు.