Cheetahs to prowl India : ఒకప్పుడు రాజులు, రాజ్యాలు ఉండేవి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మేలు జాతి చిరుతలను తెచ్చుకొని రాజులు పెంచుకునేవారు. ఆ చిరుతలతో కలిసి ఆడిపాడేవారు. వేటకు తీసుకెళ్లేవారు. ఇక చిరుతలతో కొట్లాడిన రాజులు కూడా ఉండేవారు. కానీ గతం గత: మానుషుల ప్రాబల్యంతో భూమిపై సమస్త జీవులకు మూడింది. వాటి ఉనికి ప్రశ్నార్థకమైంది. భారత దేశంలో అరుదైన చిరుతలు.. దాదాపు 70 ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. ఇప్పుడు వాటిని మళ్లీ దేశంలో పునరుజ్జీవం చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. 70 ఏళ్ల తర్వాత ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి చిరుతలను తీసుకువస్తోంది.
దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత దేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టేందుకు భారత్ -నమీబియా దేశాలు బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయి. నమీబియాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. భారత్‌కు నాలుగు చొప్పున రెండు బ్యాచ్‌లలో ఎనిమిది చిరుతలు రానున్నాయి. మధ్యప్రదేశ్ లోని ‘కునో’ నేషనల్ పార్క్ లో ఆగస్టు 15 నాటికి చిరుతల మొదటి విడతను ప్రవేశపెట్టబోతున్నారు.
1947లో దేశంలో చివరిసారిగా చిరుతపులి ఆనవాళ్లు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. 1952లో దేశంలో చిరుత పులులు అంతరించిపోయినట్లు సమాచారం. దీంతో వీటిని మొదటి దశంలో రూ.14 కోట్లు వెచ్చించి మరీ కేంద్రం దక్షిణాఫ్రికా నుంచి 14 చిరుతలను భారత్ కు తీసుకువస్తోంది. కోవిడ్-19 కారణంగా చాలా సంవత్సరాల ఆలస్యం తర్వాత ఆగస్టులో దక్షిణాఫ్రికా నుండి మొదటి బ్యాచ్ చిరుతలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకువస్తోంది..
1948 జనవరి 9న భారత్ లో రాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ మూడు మగ చిరుతలను వేటాడి.. వాటి పిల్ల చిరుతలతో దిగిన ఫొటో ఒక టి బయటకు వచ్చింది.ఆయన మూడు చిరుతలను చంపి రైఫిల్ పట్టుకున్న ఫొటో నాటి జర్నల్స్ లో ప్రచురితమైంది. విషాదం ఏంటంటే భారత్ లోని చివరి చిరుతలు ఇవేనని తెలిపారు.
ఓ భారత రాజు వేట కోసం శిక్షణ పొందిన చిరుత; చిత్రం మొట్టమొదట ది ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ 1927 సంచికలో ప్రచురించబడింది.
సొంతల్ పెర్గున్నా (నేడు, తూర్పు జార్ఖండ్‌లోని సంతాల్ పరగణా) బ్రిటిష్ వారు “1857 తిరుగుబాటుదారులను” అణిచివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రెండు భారతీయ చిరుతలు డియోఘర్‌లో అప్పటి అసిస్టెంట్ కమీషనర్ సర్ ఎడ్వర్డ్ బ్రాడన్‌ను వేటాడి వదించారు. ఆ ఫొటోలు ప్రచురితమయ్యాయి.
అటవీ నష్టం.. ఆవాసాల పెరుగుదల మరియు వేట కారణంగా భారతదేశంలో అంతరించిపోయిన ఏకైక పెద్ద మాంసాహార జంతువు చిరుత. చిరుతను మళ్లీ దేశంలో పునరుజ్జీవం చేయాలనే ప్రణాళిక దశాబ్దాలుగా సాగుతోంది. ప్రస్తుత ప్రతిపాదన 2009లో కొలిక్కి వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు క్లియర్ చేసింది.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2010లో రాజస్థాన్‌లోని షేర్‌ఘర్ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం మరియు ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ మరియు కునో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం, నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం మరియు మధ్యప్రదేశ్‌లోని మాధవ్ నేషనల్ పార్క్ వంటి ఆరు ప్రదేశాలను ఈ చిరుతలను ఉంచేందుకు ప్రతిపాదించింది. వణ్యప్రాణులు, వసతులు.. చిరుతల పునరావాసం కోసం అన్ని మెరుగ్గా ఉన్నా ‘కునో’ అభయారణ్యంను చివరకు ఎంపిక చేశారు.
మొదటి బ్యాచ్ చిరుతలు భారతీయ పరిస్థితులకు అలవాటుపడిన తర్వాత రాబోయే దశాబ్దాల్లో 35-40 చిరుతలను భారతదేశంలోని ఇతర అడవుల్లోకి మార్చే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్‌లోని నిపుణులు తెలిపారు.
మొత్తంగా.. స్వాతంత్య్రానికి పూర్వకాలంలో రాజులు, బ్రిటీష్ వారు తమ ప్రతాపాన్ని చూపేందుకు ఈ చిరుతలను వేటాడినట్టు తెలుస్తోంది. ఇక కొందరు చిరుతలను పెంచుకొని మచ్చిక చేసుకున్నారు. ఆ కాలక్రమంలోనే ఇవి అంతరించిపోయాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో అంతరించిన ఈ అరుదైన చిరుతలను ఇప్పుడు ఆఫ్రికా నుంచి దేశానికి తీసుకొస్తున్నారు. మరి ఆ జాతి దేశంలో విస్తరిస్తుందా? లేదా? అన్నది చూడాలి.