Cervical Cancer: ఆ మధ్య పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్టుగా నాటకమాడింది. ఆమె బతికే ఉన్నట్టు తెలియడంతో చాలామంది విమర్శించారు. అయితే తాను సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు అలా చేయాల్సి వచ్చిందని పూనం పాండే వివరణ ఇచ్చింది. వాస్తవానికి పూనం పాండే చెప్పినట్టు మనదేశంలో సర్వైకల్ క్యాన్సర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. సైలెంట్ గా అటాక్ అవుతున్న ఈ వ్యాధి మహిళల పాలిట శత్రువుగా మారింది. ఎన్ని రకాల వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ను శరీరం దరి చేరకుండా కాపాడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అయితే సరైన సమయంలో టీకా వేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు.
ఇతర క్యాన్సర్ల కన్నా సర్వైకల్ క్యాన్సర్ ను సులభంగా నివారించవచ్చు. అయితే మనదేశంలో ఈ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నది. ఏటా లక్షన్నర వరకు సర్వైకల్ క్యాన్సర్ కేసులో మనదేశంలో నమోదవుతున్నాయి. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు రెండున్నర లక్షలకు చేరవచ్చని తెలుస్తోంది. ఈ క్యాన్సర్ వల్ల ఏటా మనదేశంలో వేలాది సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ వ్యాధి నివారణ కోసం టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలామంది.. అవగాహన లేకపోవడం వల్ల తీసుకోవడం లేదు.
సాధారణంగా 50 సంవత్సరాలు నిండిన మహిళల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడం ద్వారా ఈ వ్యాధి నిర్ధారించే అవకాశం ఉంది. 21 సంవత్సరాలు నిండిన యువతులు, వైవాహిక జీవితాన్ని ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన మహిళలు ఈ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించుకోవాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ గుర్తించి, వెంటనే సత్వర చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఇది శృంగారం ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. అయితే ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ రావాలని లేదు. వారిలో కొంతమందికి మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం ఉంటుంది. అయితే శృంగారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కాకపోతే తక్కువ వయసులో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనడం, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొనడం, లేదా అటువంటి వ్యక్తులతో లైంగికంగా కలవడం వల్ల హ్యూమన్ పాపిలోమా వైరస్ సోకే అవకాశాలుంటాయి. ఈ వైరస్ లో మొదటి రకం హైరిస్క్, రెండవది తక్కువ రిస్క్, మూడవది సాధారణం.
వాస్తవానికి హ్యూమన్ పాపిలోమా వైరస్ దానంతట అదే తగ్గిపోతుంది. దీన్ని సాధారణ వైరస్ అంటారు. వైరస్ తగ్గకుండా అలా కొంత కాలం పాటు ఉంటే.. అది క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశాలుంటాయి. ఈ విధంగా తీవ్రమైన సర్వైకల్ క్యాన్సర్ కు దారి తీసే పరిస్థితులను హైరిస్క్ గా పరిగణిస్తారు. ఇవే కాకుండా హ్యూమన్ పాపిలోమా వైరస్ 31, 33, 45, 52, 58 రకాలు అత్యంత తీవ్రమైనవి. ఇవి 70% సర్వైకల్ క్యాన్సర్ కు కారణం అవుతాయి. ఈ మాత్రమే కాదు ధూమపానం, హెచ్ఐవీ, ఐదు లేదా అంతకంటే ఎక్కువ కాలం గర్భ నిరోధక మాత్రలు వాడటం, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందికి జన్మనివ్వడం..వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
21 సంవత్సరాలు నిండిన లేదా శృంగారంలో పాల్గొనడం ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచిన ప్రతి మహిళ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి. 9 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న బాలికలు హెచ్ పీ వీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. కేవలం భాగస్వామితో మాత్రమే లైంగిక జీవితాన్ని కొనసాగించాలి. ధూమ, మద్యపానానికి దూరంగా ఉండాలి.