https://oktelugu.com/

BP and Diabetes : ప్రతి ఇద్దరిలో రక్తపోటు.. ముగ్గురిలో చక్కెర వ్యాధి లక్షణాలు..

ఈ పరిశోధకులు చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది ముఖ్యంగా యువతలో ఊబకాయం బాగా పెరిగిపోయింది. నిత్యం ఏసీ గదిలో పనిచేయటం, కంప్యూటర్ ముందు కూర్చోవడం అలవాటుగా మారడం,

Written By:
  • NARESH
  • , Updated On : June 10, 2023 / 07:26 PM IST
    Follow us on

    BP and Diabetes : ఊసూరుమని జనం ఉంటే దేశం ఏ గతిన బాగుపడుతుంది? వెనుకటికి ఓ కవి మహాశయుడు ఎక్కుపెట్టిన కవితా బాణం అది. అప్పుడెప్పుడో ఆయన రాస్తే.. ఇప్పటి పరిస్థితికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పటిలాగా శారీరక శ్రమ లేదు. నాలుగు అడుగులు వేసే ఓపిక లేదు. సంప్రదాయమైన తిండి లేదు. నీసు లేనిదే ముద్ద దిగడం లేదు. వీకెండ్లలో పార్టీ లేకుండా జీవితం ముందుకు సాగడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే రోగాలు ముమ్మరిస్తున్నాయి. ఇది ఎంతకు దారి తీసింది అంటే.. జనాభాలో ప్రతి ఇద్దరిలో ఒకరికి హైబీపీ లక్షణాలు ఉన్నాయి.. ప్రతి ముగ్గురిలో ఒకరికి చక్కెర వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే ప్రపంచ జనాభా సంఖ్యలో నెంబర్ వన్ మాత్రమే కాదు.. రోగాల్లోనూ నెంబర్ వన్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది.

    11.4 శాతం మధుమేహంతో..

    భారత జనాభాలో 11.4శాతంమంది ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇక మరో 35.5 శాతం మంది హైపర్‌టెన్షన్‌తో, 15.3శాతం మంది ప్రీడయాబెటిస్(మధుమేహానికి ముందు స్థాయి)తో బాధపడుతున్నారని మద్రాస్‌ డయాబెటిస్‌ రిసెర్చి ఫౌండేషన్‌(ఎండీఆర్‌ఎ్‌ఫ), ఐసీఎంఆర్‌ పరిశోధకులు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. భారత ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన నిధులతో ఈ అధ్యయనాన్ని నిర్వహించడం గమనార్హం. తమ పరిశోధన వివరాలను వారు ది లాన్సెట్‌ డయాబెటిస్-ఎండోక్రినోలజీ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘2021లో మేం నిర్వహించిన అధ్యయనంలో భారత్‌లో మొత్తం 10 కోట్లమంది డయాబెటిస్ తో, 13.6 కోట్లమంది ప్రీడయాబెటిస్ తో 31.5 కోట్లమంది అధిక రక్తపోటు(బీపీ)తో బాధపడుతున్నట్లు గుర్తించాం. దేశంలో 25.4 కోట్లమంది ఊబకాయ బాధితులు ఉన్నారు. 2017లో భారత్‌లో మధుమేహం 7.5శాతంగా ఉండగా.. అప్పటి నుంచీ ఏకంగా 50శాతం మేర పెరిగింది. వచ్చే ఐదేళ్లలో ఈ రోగాలు ఉచ్ఛదశకు చేరుకునే అవకాశం ఉంది. అనంతరం తిరిగి తగ్గుముఖం పడతాయి. అధ్యయనంలో భాగంగా 2008 నుంచి 2020 మధ్యకాలంలో 1.1 లక్షలమందిపై సర్వే నిర్వహించాం. ఏకంగా 81.2శాతంమందిలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసెరైడ్స్‌ వంటి వాటి అసమతుల్యత(డైస్లిపిడేమియా) కనిపించింది’’ అని పరిశోధకులు వెల్లడించారు.

    ఉబకాయం ప్రధాన సమస్య

    ఇక ఈ పరిశోధకులు చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలామంది ముఖ్యంగా యువతలో ఊబకాయం బాగా పెరిగిపోయింది. నిత్యం ఏసీ గదిలో పనిచేయటం, కంప్యూటర్ ముందు కూర్చోవడం అలవాటుగా మారడం, నాలుగు అడుగులు వేసే అంత శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారిపోతున్నారు. దీనికి తోడు ఆహారంలో మాంసం ఎక్కువగా తీసుకోవడంతో వారి శరీరంలో కొవ్వులు పెరిగిపోతున్నాయి. అంతిమంగా ఇది మధుమేహానికి, రక్తపోటుకు దారితీస్తోంది. ఇక వెలుగు చూస్తున్న డయాబెటిక్ కేసుల్లో టైప్ వన్ రకం కనిపిస్తుండడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తుంది. దీనివల్ల శరీరం తొందర నీరసానికి గురవుతుందని, దీర్ఘకాలం మందులు వాడటం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

    ఏమిటి పరిష్కార మార్గం

    ప్రతి వ్యాధి కి ఒక పరిష్కార మార్గం ఉంటుంది. అది మన చేతిలోనే ఉంటుంది. మనం తినే తిండే మన ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా మనిషి శరీరానికి శ్రమ లేకుంటే దేహంలో కొవ్వులు పేరుకు పోతాయి. ఇవి అంతిమంగా దేహానికి చేటు తెస్తాయి. ఇలాంటి సమస్యలను ముందుగానే ఎదుర్కోవాలంటే మాంసాహారాన్ని తగ్గించాలి. ఉప్పు వాడకాన్ని నియంత్రించాలి. శారీరక శ్రమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రోజు సుమారు ఐదు నుంచి ఏడు కిలోమీటర్ల వరకు నడవాలి. స్వచ్ఛమైన నీటిని తాగాలి. తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు అయితే శరీరానికి ఇంకా మంచిది.