Blood Cancer Treatment: అమెరికాను చాలామంది భూతల స్వర్గం అనుకుంటారు కానీ.. అది కేవలం పైసల స్వర్గం. సంపాదన ఎలా ఉంటుందో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే మనదేశంలోని చాలామంది కేవలం సంపాదనకు మాత్రమే అమెరికా వెళుతుంటారు. అక్కడి డాలర్ మారకంతో పోలిస్తే మన ఇండియన్ కరెన్సీ విలువ తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అమెరికాలో ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. ఉండే ఇంటి నుంచి ఆరోగ్య బీమా వరకు అన్ని పిరమే. ఆరోగ్య రంగం విషయానికొస్తే ఎన్నోరెట్లు అమెరికా ముందంజలో ఉందని అనుకుంటాం కానీ.. నేటికీ చాలా విషయాల్లో అమెరికా మనకంటే వెనుకబడే ఉంది. కరోనా వ్యాక్సిన్ ప్రపంచ దేశాలన్నిటికంటే ముందుగా భారతదేశమే తయారు చేసింది. 100 పై చిలుకు కోట్ల జనాభా ఉన్న దేశానికి ఉచితంగా వ్యాక్సిన్ వేసింది. ఇప్పుడు బూస్టర్ డోస్ ను కూడా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. కానీ అమెరికాలో నేటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముక్కుతూ మూలుగుతూ ఉంది.
బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో సరికొత్త అధ్యాయం
దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించే దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు వంటి మహానగరాలు హెల్త్ హబ్ లుగా ఆవిర్భవించాయి. హైదరాబాదులోని ఏషియన్ గ్యాస్ట్రో హాస్పిటల్ ఆసియాలోనే అతిపెద్ద గ్యాస్ట్రో హాస్పిటల్ గా రికార్డులకు ఎక్కింది. ఇతర దేశాల నుంచి ఎక్కువగా రోగులు హైదరాబాద్ కు వస్తుంటారు. ఆరోగ్య రక్షణకు వెచ్చించే నగదుతో పోలిస్తే భారతదేశంలో చికిత్సకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. వైద్యరంగంలో ఎంతో పరిణతి చెందిన భారతదేశ వైద్యులు బ్లడ్ క్యాన్సర్ చికిత్స విధానాల్లోనూ కొత్త మైలురాయిని చేరుకున్నారు. ప్రస్తుతం క్యాన్సర్ నివారణకు టీ – సెల్ థెరపీ అనే చికిత్స విధానం అందుబాటులో ఉంది. కీమోథెరపీ వంటి చికిత్సలో జుట్టు ఊడటం, బరువు తగ్గటం వంటి దుష్ప్రభావాలు ఈ విధానంలో అసలు ఉండవు. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సామాన్యులు ఏమాత్రం భరించలేరు. ఈ విధానాన్ని తక్కువకే అందించే యోచనలో ఉన్నామని ఫార్మా, స్టార్టఫ్ కంపెనీలు చెబుతున్నాయి. క్యాన్సర్ నివారణలో సెల్ థెరపీ ఆధారిత చికిత్సకు అమెరికాలో అయ్యే ఖర్చుతో పోలిస్తే మనదేశంలో 10 శాతానికి మాత్రమే చేస్తామని పేర్కొంటున్నాయి. ఈ పద్ధతిని వచ్చే రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇస్తున్నాయి. కైమెరిక్ యాంటీ జెన్ రిసెప్టార్ టీ- సెల్( సీఏఆర్ టీ – సెల్) థెరపీ అని పిలిచే ఈ చికిత్సకు అమెరికాలో 6 నుంచి 7 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే మనదేశంలో అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ అద్భుతమైన చికిత్స అమెరికాలో వెచ్చించే వాటితో పోలిస్తే అందులో 10 శాతానికే అందుబాటులోకి వస్తుంది.
అసలు ఏంటి ఈ కణాలు
సెల్లులార్ ఇమ్యునో థెరపీ వంటి చికిత్స విధానంలో ముందుగా రోగికి సంబంధించిన వ్యాధి నిరోధక కణాలను సేకరిస్తారు. తర్వాత ఏదైనా వ్యాధిపై పోరాడేలా కణాల్లో జన్యుపరమైన ఉత్పరిమాణాలతో మార్పులు చేస్తారు. అప్పుడు వాటిని తిరిగి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. వారం తర్వాత ఆ కణాలు వాటి పని ప్రారంభిస్తాయి. చాలా ఏళ్ల పాటు చైతన్య శీలంగా మానవ శరీరంలో ఉంటాయి.
ఈ క్రతువులో ఎవరెవరు ఉన్నారంటే
బ్లడ్ క్యాన్సర్ చికిత్స విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే చేయి కలిపాయి. బెంగళూరు కేంద్రంగా మధుమేహ ఇంజక్షన్ తయారు చేస్తున్న బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా ఈ విధానానికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇమ్యూనెల్ తెరప్యూటిక్స్, అమెరికాలో పేరొందిన క్యాన్సర్ నిపుణుడు సిద్ధార్థ మహంతి, రెడ్డీస్ లేబరేటరీ, ఐఐటి ముంబైకి చెందిన స్పిన్ ఆఫ్, శెంజన్ ప్రీజిన్ బయో ఫార్మా(చైనా), ఇమ్యునో యాక్ట్ సంస్థలు ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోనున్నాయి.
ఈ విధానం ఎలా ఉంటుందంటే
రోగి రక్తంలోని తెల్ల రక్త కణాలలో టీ సెల్స్ ను సేకరిస్తారు. క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని చంపే విధంగా ఈ టీ సెల్స్ లో జన్యుపరమైన మార్పులు ( జెనటికల్ ఇంజనీరింగ్) చేస్తారు. ఈ రి ఇంజనీరింగ్ చేసిన కణాలను క్యాన్సర్ కణాలపై దాడి చేసేందుకు సరిపడా లక్షల సంఖ్యలో వృద్ధి చేస్తారు. లక్షల కొద్ది టీ కణాలను తిరిగి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు. దీంతో రోగి లోపల ఉన్న క్యాన్సర్ కణాలను ఈ కణాలు గుర్తించి అన్నింటిని చంపేస్తాయి. దీని వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. పైగా దుష్పరిణామాలు ఉండవు. ఖర్చు కూడా తక్కువే. ఎటువంటి కీమో థెరపీలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. రోగి శరీరంలో టీ కణాలను చొప్పించేటప్పుడు మాత్రం పత్రిలో అధునాతనమైన పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన గదిలో ఉండాల్సి ఉంటుంది.