Bilwa Leaves: మహాశివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. సాధారణ రోజుల్లో కంటే మహాశివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం వల్ల అనేక ఆ స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే మహా శివరాత్రి రోజున చాలా మంది శివనామస్మరణ చేస్తూ జాగారాలు చేస్తుంటారు. ఈరోజు శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తూ పండ్లు, పూలు సమర్పిస్తారు. అయితే శివుడికి వీటితో పాటు బిల్వార్చన కూడా చేస్తారు. బిల్వ పత్రాలను శివుడికి అందించడం వల్ల అత్యంత ఎక్కువగా సంతోషిస్తాడని కొందరు పండితులు చెబుతుంటారు. మహాశివరాత్రి రోజున మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లోనూ మహాశివుడికి బిల్వార్చన చేస్తుంటారు. అయితే శంకరుడికి బిల్వార్చనే ఎందుకు చేస్తారు? ఈ ఆకులతో పూజలు మాత్రమే కాకుండా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? ఆ వివరాల్లోకి వెళితే..
శివుడికి పూజ చేసే సమయంలో బిల్వార్చణ చేయాలని వేద కాలం నుంచే ఉందని కొన్ని పురాణాల బట్టి తెలుస్తోంది. కొన్ని పురాణాల ప్రకారం పార్వతి తేది చెమట చుక్క ద్వారా బిల్వ వృక్షం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం ఈ ఆకులతో శివుడికి పూజ చేయడం వల్ల ఆ భక్తులకు తొందరగా అనుగ్రహిస్తాడని అంటారు. అయితే కొందరు పెద్దలు చెబుతున్న ప్రకారం.. బిల్వ ఆకులతో పూజలు చేయడం వల్ల శివానుగ్రహం మాత్రమే కాకుండా ఈ ఆకులతో పూజ చేసిన వారికి ఆయురారోగ్యాలు ఉంటాయని అంటున్నారు.
బిల్వ పత్రాల్లో అనేక విటమిన్లు దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, సి, కాల్షియం లభిస్తాయి. అలాగే ఫాస్పరస్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులను వివిధ పద్ధతుల ద్వారా ఆహారంగా లేదా జ్యూస్ గా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. విరేచనాలు, మలబద్ధకం ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆయాసంతో బాధపడేవారికి దీనిని తీసుకోవచ్చు. అయితే బిల్వ ఆకులను పొడి చేసి దానిని నీటిలో కలుపుకోవడం ద్వారా ఈజీగా తసుకోవచ్చు. ఇలా తీసుకునేవారికి ఫైల్స్ సమస్య పరిష్కారం అవుతుంది.
మధుమేహంతో బాధపడేవారు బిల్వ ఆకులను పొడి చేసి రోజూ ఉదయం తీసుకోవాలి. దీంతో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. వేర్లను చూర్ణం చేసి అర చెంచాడు చొప్పున రోజూ తీసుకోవడం వల్ల జలుబు రాకుండా కాపాడుతుంది. బిల్వ పత్రాలతో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు మటుమాయం అవుతాయి. బిల్వ పత్రాన్ని ప్రతిరోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
బిల్వ పత్రాలను ఇంట్లో ఉండడం వల్ల ఆ ప్రదేశం స్వచ్ఛంగా మారుతుంది.దీనిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం బిల్వ చెట్టును వాయువ్య దిశలో నాటుకోవడం వల్ల ఆ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఉన్న పలు దోషాల నుంచి విముక్తి పొందాలనుకునేవారు ఈ చెట్టకు ప్రతి రోజూ నీటిని పోయాలి. పర్వీకుల అనుగ్రహం కోసం కూడా ఈ చెట్టు ఇంట్లో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.