Best drink for better sleep: ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు రకరకాల ఆహారం తింటూ ఉన్నారు. దీంతో ఇవి సరైన పద్ధతిలో డైజేషన్ కాకపోవడంతో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకొంత మంది కార్యాలయాల్లో పనిచేసేవారు కెఫిన్ కలిగిన ద్రవాలు తాగడంతో ఇది ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఫలితంగా సరైన నిద్ర పోవడం లేదు. అయితే ఇలాంటి వారు రాత్రి పడుకునే ముందు ఇది తాగడం వల్ల ఎలాంటి అలజడి లేకుండా హాయిగా నిద్రపట్టే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణుల అంటున్నారు. అదేంటంటే?
చాలా మంది రాత్రి పడుకునే ముందు పాలు తాగడం అలవాటు. కానీ కేవలం పాలు మాత్రమే కాకుండా ఇందులో చిటికెడు యాలకుల పొడి కలిపి తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు వేడి పాలలో అర టీస్పూన్ యాలకుల పొడి కలిపి బాగా మరిగించాలి. కావాలంటే కొద్దిగా తేనె లేదా బెల్లం కలిపి తాగవచ్చు. పడుకునే 30 నిమిషాల ముందు ఈ పానీయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ సహజ పానీయం శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ (Tryptophan) అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరొటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ హార్మోన్లు మెదడును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి. యాలకుల సువాసన కూడా మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. దీంతో రాత్రి వేళల్లో హాయిగా, గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
సాధారణంగా పాలు తొందరగా జీర్ణం కావు. అయితే ఇందులో యాలకులు వేసి కలిపి తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. కడుపులో గ్యాస్, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి భోజనం తర్వాత యాలకుల పాలు తాగితే ఆహారం సులభంగా జీర్ణమై కడుపులో భారంగా అనిపించకుండా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను వేగవంతం చేస్తూ కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
యాలకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాలను రక్షిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు, చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది. యాలకులకు సహజసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులు, కండరాల అలసట వంటి సమస్యలు ఉన్నవారికి కూడా యాలకుల పాలు కొంత ఉపశమనాన్ని అందించగలవని నిపుణులు సూచిస్తున్నారు.
యాలకుల్లో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా మితంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగుపడే అవకాశం ఉంటుంది. యాలకులలో సహజ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నోటిలోని హానికర బ్యాక్టీరియాను తగ్గించి నోటి దుర్వాసనను నియంత్రిస్తాయి. అందుకే భోజనం తర్వాత యాలకులు నమిలే అలవాటు పూర్వం నుంచే ఉంది.
