Watermelon health tips: వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో పుచ్చకాయ ఎంతో ఉపయోగకరమైన పండు అని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయలో సుమారు 91 నుంచి 93 శాతం వరకు నీరు ఉండటం వల్ల శరీరంలో నీటి లోపాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వేడిలో చెమట ద్వారా కోల్పోయే ద్రవాలను భర్తీ చేయడానికి ఇది సహజమైన, రుచికరమైన మార్గం. అసలు పుచ్చకాయ ను ఏ సమయంలో తీసుకోవాలి? రాత్రి సమయంలో పుచ్చకాయ తినవచ్చా..?
పుచ్చకాయలో నీరు మాత్రమే కాకుండా విటమిన్ A, విటమిన్ C, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే వేసవిలో పుచ్చకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పుచ్చకాయలో ఎన్నో విటమిన్లు ఉన్నా కూడా దీనిని తినడానికి సరైన సమయం కూడా ముఖ్యమే. మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య పుచ్చకాయ తినడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో జీర్ణక్రియ అత్యంత చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి పుచ్చకాయలోని పోషకాలు సులభంగా శరీరానికి అందుతాయి. అలాగే ఇది శరీరాన్ని తక్షణమే చల్లబరచి ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
అయితే రాత్రి సమయంలో పుచ్చకాయ తినడంపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా సాయంత్రం 7 గంటల తర్వాత దీనిని తినకపోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో ఉండే సహజ యాసిడ్లు రాత్రి సమయంలో జీర్ణక్రియను నెమ్మదింపజేయవచ్చు. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
రాత్రి సమయంలో పుచ్చకాయ తినడం వల్ల నిద్రపైనా ప్రభావం పడొచ్చు. శరీరంలో నీటి శాతం ఎక్కువ కావడంతో తరచూ మూత్ర విసర్జన అవసరం రావడం వల్ల నిద్ర మధ్యలో భంగం కలగవచ్చు. అందువల్ల మంచి నిద్ర కోసం కూడా రాత్రి పూట పుచ్చకాయను దూరంగా ఉంచడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయ వేసవిలో శరీరానికి చాలా మేలు చేసే పండు. అయితే సరైన సమయంలో, పరిమితంగా తీసుకుంటేనే దాని పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు. మధ్యాహ్నం సమయంలో తీసుకోవడం ఉత్తమం కాగా, రాత్రి సమయంలో మాత్రం నివారించడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.