Smart Phone: ఉదయం లేస్తే చాలు ఫోన్ ముఖం చూడంది చాలామందికి రోజే మొదలు కాదు. పొద్దున మెలకువ వచ్చిన నాటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలామందికి స్మార్ట్ ఫోన్ తోనే సహవాసం. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన స్మార్ట్ ఫోన్ మనుషుల జీవితాల్లో ఒక విడదీయలేని భాగం అయిపోయింది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే రోజు గడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఒకప్పుడు కేవలం కాల్స్ కోసమే ఫోన్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అది మన జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.
బ్యాంకు చెల్లింపుల నుంచి ఇంట్లో కుటుంబ సభ్యులతో మాటల వరకు.. ఇలా ప్రతిపనికి స్మార్ట్ ఫోన్ వాడకం తప్పనిసరి అయిపోయింది.. పెద్దల నుంచి పిల్లల దాకా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కు బానిసలైపోయారు. ఫలితంగా పది నిమిషాలు కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఇలా స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతం అయితే అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని లోగడ అనేక పరిశోధనల్లో తేలింది. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుందట. వారానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు.. ఫోన్ మాట్లాడేవారికి రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుందని ఇటీవల ఒక అధ్యయనంలో వెళ్లడైంది..
ఇందుకు సంబంధించిన వివరాలను యూరోపియన్ హార్ట్ జర్నల్ డిజిటల్ హెల్త్ లో ప్రకటించారు. స్మార్ట్ ఫోన్ నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో తరంగ ధైర్ఘ్యం రక్త పోటు పెరిగేందుకు కారణంగా మారుతుందట. చైనాలోని గ్వాంగ్ జౌ లోని మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం రక్తపోటు బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని వారు ప్రకటించారు. భారతదేశంలో 120 కోట్లకు మందికి పైగా స్మార్ట్ లేదా వివిధ రకాల ఫోన్లను వాడుతున్నారు. వీరిలో 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్ల మంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వీరిలో 82 శాతం మంది తక్కువ లేదా మధ్య ఆదాయం ఉన్న దేశాలకు చెందినవారు.
అధిక రక్తపోటు వల్ల గుండెపోటు సంభవిస్తుంది. అది అకాల మరణానికి దారితీస్తుంది. వారంలో 30 నిమిషాల కంటే ఎక్కువగా ఫోన్ మాట్లాడే వారిలో ఇతరులతో పోల్చితే రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక వారానికి 6 గంటలకు పైగా ఫోన్ మాట్లాడే వారిలో రక్తపోటు ప్రమాదం 25% ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఫోన్ తక్కువ మాట్లాడాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే ఫోన్ దూరంగా ఉంచి స్పీకర్ లో మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.