ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కొత్త కేసులు తగ్గుతుండగా ఇదే సమయంలో కొత్త వైరస్ లు వెలుగులోకి వస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. మార్బర్గ్ వైరస్ పేరుతో పిలవబడే ఈ వైరస్ వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆగష్టు 2వ తేదీన గినియాలో మరణించిన వ్యక్తి శరీరంలో శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను గుర్తించారు.
ఈ వైరస్ గబ్బిలాల ద్వారా సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. ఈ వైరస్ బారిన బారిన వాళ్లలో 88 శాతం వరకు మరణాల రేటు ఉంటుందని తెలుస్తోంది. మార్బర్గ్ వైరస్ రక్తస్రావ జ్వరానికి కారణం కాగా ఈ వైరస్ లక్షణాలు ఎబోలా వైరస్ లక్షణాలను పోలి ఉంటాయని తెలుస్తోంది. ఆఫ్రికా డబ్ల్యూహెచ్‌ఓ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ మత్షిడిసో మోయిటి ఈ వైరస్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.
ఎబోలా వైరస్ వల్ల 2020 సంవత్సరంలో 12 మంది మృతి చెందడం గమనార్హం. ఎబోలా వైరస్ ను కట్టడి చేసిన కొన్ని రోజుల్లోనే కొత్త వైరస్ వెలుగులోకి రావడం గమనార్హం. గినియా ప్రభుత్వం కూడా ఈ వైరస్ కేసును ధృవీకరించింది. గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందే ఈ వైరస్ కరోనా మాదిరిగా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు అయితే ఉంటాయి. పశ్చిమ ఆఫ్రికాలో వైరస్ ను కనిపెట్టడం తొలిసారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఎవరైతే ఈ వైరస్ బారిన పడతారో వాళ్లలో అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఇతర లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి. కొత్తకొత్త వైరస్ లు వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.