Homeగెస్ట్ కాలమ్అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా?

అవినీతిపై మోడీ యుద్ధం చేస్తారా?

స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లు దాటింది.. అభివృద్ధి అంతంత మాత్రమే.. కూడు, గుడ్డ, గూడు లేనివారు ఇప్పటికీ లక్షల్లో ఉన్నారు. ప్రభుత్వాలు మారాయి.. పార్టీలు మారాయి తప్ప పేదల పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్లు విడుదల చేస్తుంటాయి. వేసిన రోడ్లు వేస్తునే ఉంటారు.. డ్రైనేజీలు తవ్వుతూనే ఉంటారు.. విద్య, వైద్యం అంటూ కోట్లు ఖర్చు చేస్తుంటారు. తీరా చూస్తే  ఒక్క పని  సరిగ్గా జరుగదు. ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మరీ ఆ పైసలన్నీ ఎటు పోయినట్టు.. ఏండ్ల తరబడిగా పేదరిక నిర్మూలనకు ఫండ్స్ వస్తూనే ఉన్నాయి.. మరీ అవి ఏమైపోయినట్టు.. పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు. ధనికుడు మరింత ధనికుడు అయిపోతున్నాడు.  దీనంతటికీ ప్రధాన కారణం అవినీతి.. కుంభకోణాలు.  ప్రజాప్రతినిధులు, ఆధికారులు ఎవరికిష్టం వచ్చినంత  వారు దోచుకుంటుండడంతో  ప్రజల సొమ్ము  పక్కదారి పడుతోంది.

Also Read: బీహార్‌‌ పోలింగ్ లో అనూహ్యం: ఓటర్లకు ప్రధాని కీలక సూచన

దేశంలో అవినీతిపై ప్రధాని మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ప్రారంభమైన ‘‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ”సదస్సును ఉద్దేశించి మాట్లాడారు.  దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న భారీ అవినీతి దేశానికి పెను సవాల్ విసురుతోందని, చెదపురుగులా పట్టి తొలిచివేస్తోందని  చెప్పారు. వారసత్వంగా మారిన కుంభకోణాలు కొన్ని రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమై పోయాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడకపోతే, ఆ తర్వాత వచ్చే తరం మరింతగా రెచ్చిపోతుందని హెచ్చరించారు. నల్లధనం కూడబెట్టే వారిపై ఎలాంటి చర్యలు లేకపోయినా, చిన్న శిక్షతో సరిపెట్టినా చుట్టుపక్కలున్న వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు. అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక్క కేసుకే పరిమితం కాదు.. అది ఒక చైన్ ను తయారు చేస్తుందని, భవిష్యత్ కుంభకోణాలకు అది పునాది రాయిలా మారుతుందన్నారు. అక్రమార్కులపై తగిన చర్య తీసుకోకపోతే సమాజంలో నేరాలకు పాల్పడడం సాధారణమైన వ్యవహారంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని  మోడీ వ్యాఖ్యలను దేశమంతా  విన్నది.  ప్రధాని చెప్పిన మాటలను చప్పట్లు కొట్టి మరీ ఆదరించారు.  అవినీతి కట్టడిపై ఆయన చేసిన  అనర్ఘలమైన  ప్రసంగం అందరినీ కట్టిపడేసింది. ఆయన మాట్లాడిన మాటలు, అభిప్రాయాలు నిజానికి కొత్తవి కావు. ప్రధాని కాకముందే.. రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తానని ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాది లోపు తేల్చేస్తామని ప్రకటించారు. మోడీ ప్రధాని పదవిని  అధిష్ఠించి ఏడేళ్లు అవుతోంది. మళ్లీ ఆమాటను ఆయన గుర్తుచేసుకోలేదు.

ఇటీవల సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధుల  కేసులను ఏడాది లోపు తేల్చేయాలని కార్యచరణ సిద్ధం చేసుకోగానే.. అవనీతి పరులు న్యాయవ్యవస్థపై భీకరంగా దాడి చేస్తున్నారు.  కోర్టుల విశ్వసనీయతను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఈక్రమంలో మోడీ, అమిత్ షా పేర్లను సైతం యథేచ్ఛగా ప్రచారంలోకి పెట్టేస్తున్నారు. మోడీ, అమిత్ షాను కలిసిన తర్వాతే.. న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేస్తూ కొంత మంది లేఖ రాయడంతో.. వారి మద్దతుతోనే లేఖ రాసినట్లుగా చెబుతున్నారు. అలా చెప్పడమే కాదు.. వారికి సంబంధించిన  ఓ న్యాయమూర్తి ఉన్నారని.. ఆయనను చీఫ్ జస్టిస్ చేయడానికే ఇలా చేస్తున్నారని పుకార్లు కూడా  పుట్టించారు.

Also Read: హాట్ టాపిక్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు?

ఇలాంటి టైంలో అవినీతిపరులపై మోడీ వ్యాఖ్యలు బాగానే ఉన్నా.. ఆచరణలో ఎలా ఉంటుందోనని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే  రాజకీయ అవసరాల కోసం.. భారీ కుంభకోణాలకు పాల్పడిన వారిని రాజకీయంగా ప్రోత్సహిస్తూ.. అండగా ఉంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మోడీ దేశ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలనుకుంటే.. అవినీతి పరులను తరిమివేయాలనుకుంటే అడ్డుకునే వారు లేరు. అయితే బీజేపీ కి రాజ్యసభ అవసరాల కోసమో.. తన ప్రత్యర్థుల్ని ఎదుగకుండా చేయాలన్న లక్ష్యంతోనే అవినీతి పరులకు రాజకీయ అండ కల్పిస్తే.. ఆయన చెప్పినట్లుగా చిన్న చిన్న అవినీతి.. భారీ కుంభకోణాల దిశగా వెళ్తుందని విశ్లేషకులు అంటున్నారు. అది అంతిమంగా దేశానికి నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు.

ఇలాంటివి రాకుండా ఆయన మాటల్లో కనిపించిన పట్టుదల.. చేతల్లో చూపించి అవినీతి పరులకు శిక్ష పడేలా చేయాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular