
చెప్పుకోదగిన ప్రాధాన్యత గల ఎటువంటి ఒప్పందం లేకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన జరపడం, అదీ కూడా భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో గత సెప్టెంబర్ లో ద్వైపాక్షిక సంప్రదింపులు జరిపిన ఐదు నెలలకే రావడం వెనుక రహస్య అజెండా ఉన్నట్లు తెలుస్తున్నది. రాజకీయ ప్రయోజనాలకోసమే ప్రధాని మోదీని మారే దేశాధినేత చేయని విధంగా పొగడ్తలతో ముంచెత్తిన్నట్లు కనిపిస్తున్నది.
నేడు అమెరికాను తీవ్రంగా వేధిస్తున్న సమస్య ఆఫ్గనిస్తాన్. అక్కడ 19 ఏళ్ళ పాటు స్థావరం ఏర్పరచుకొని భారీగా సైనికులను కోల్పోవడం, పెద్ద ఎత్తున నిధులను నీళ్లపాలు చేయడం మినహా ఏమీ సాధించుకోలేక పోయారు. తమ సైనికులను వెనుకకు తీసుకు రావాలని అమెరికా ప్రజల నుండి తీవ్రమైన వత్తిడి ఏర్పడుతున్నది.
ఆఫ్ఘానిస్తాన్ లో తమ సేనలను మోహరింప చేయడం “పూర్తిగా వృధా” అంటూ 2012 లోనే ట్రంప్ ప్రకటించారు.
తాలిబన్లతో శాంతి ఒప్పందాన్ని ఈ నెల 29న సంతో ఒప్పందం చేసుకోవడానికి నాలుగు రోజుల ముందు భారత్ కు రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకోండి. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు విడతల వారీగా వైదొలగాలి. ప్రస్తుతం 12,000 మంది సైనికులు ఉన్నారు. జులై నాటికి నాలుగోవంతు తొలిగితే, క్రమంగా ఈ సంవత్సరం చివరకు మొత్తం సైన్య ఉపసంహరణ పూర్తి కావాలని భావిస్తున్నారు.
అయితే ఒకసారి ఆఫ్ఘానిస్తాన్ నుండి అమెరికా సేనలు వైదొలిగితే అక్కడ ఏమి జరుగుతుంది? ఆల్ ఖైదా స్థావరాలను ధ్వసం చేయడం మినహా అక్కడ అమెరికా వారేమి చేయలేకపోయారు. ఇప్పుడు ప్రాబల్యం వహిస్తున్న తాలిబన్ లను నడిపిస్తున్నది పాకిస్తాన్ ఐ ఎస్ ఐ అని అందరికి తెలుసు. అమెరికా సేనలు వైదొలగితే, ప్రస్తుతం అమెరికా మద్దతుతో అక్కడున్న ప్రభుత్వం బలహీనమై, తాలిబన్లు అధికారంలోకి రావడం ఖాయం.
అప్పుడు అక్కడ ప్రభుత్వం పాకిస్తాన్ పర్యవేక్షణలో, అంటే చైనా ఆధిపత్యంలో ఉంటుంది. ఆఫ్గనిస్తాన్ వంటి కీలక ప్రాంతంలో పాకిస్తాన్, చైనా ఆధిపత్యం వహిస్తే, ఉగ్రవాద శిబిరాలు ఇక బహిరంగంగా అక్కడ కొనసాగుతాయి.
పలు సంవత్సరాలుగా ఆఫ్ఘానిస్తాన్ రక్షణ బాధ్యతను భారత్ కు అప్పచెప్పి తమ సేనలను ఉపసంహరింపచేసు కోవాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వస్తున్నది. అయితే గతంలో శ్రీలంకలో ఎల్ టి టి ఇ ని తుదముట్టించే ప్రయత్నంలో ఆ దేశం వెళ్లిన భారత్ సేనలు తీవ్రమైన మూల్యం చెల్లింపవలసి వచ్చింది. ఆ అనుభవంతో భారత్ ఆఫ్గనిస్తాన్ విషయంలో తలదూర్చడానికి మొదటినుండి వెనుకడుగు వేస్తున్నది.
ఆఫ్గనిస్తాన్ లో శాంతి నెలకొనడం భారత్ కు కూడా ఎక్కువ మేలు చేస్తుందని భారత్ పర్యటన సందర్భంగా ట్రంప్ చెప్పడం గమనార్హం. ఇదే సందర్భంగా గత ఏడాది కాలంగా పాకిస్తాన్ విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు కీలకమైనది.
మొన్నటి వరకు కాశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, దానిపై భారత్ – పాకిస్తాన్ లు మాత్రమే చర్చలు జరుపుకోవాలని, మూడో దేశం జోక్యం తగదని భారత్ చెబుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కాశ్మీర్ భారత్ ఆంతరంగిక విషయమని, ఆ విషయమై పాకిస్థాన్ తో చర్చల ప్రసక్తి లేదని మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే అని చెప్పడం గమనార్హం.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత తమ తదుపరి లక్ష్యం ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం అని హోమ్ మంత్రి అమిత్ షా కూడా ప్రకటించారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలకు ఈ ప్రాంతమే కేంద్రంగా ఉంటూ వస్తున్నది. ఆక్రమిత కాశ్మీర్ భారత్ ఆధీనంలోకి రావడం వ్యూహాత్మకంగా అమెరికాకు కూడా ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. చైనా ప్రతిష్టాకరంగా చేపట్టిన వాణిజ్య కారిడార్ ఈ ప్రాంతం నుండే వెడుతున్నది.
అందుకనే ఆఫ్ఘానిస్తాన్ కు నేరుగా భారత్ భూమార్గం ఏర్పాటు చేసేందుకు ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ కు `అప్పచెప్పేందుకు’ అమెరికా సిద్దపడుతున్నదా? చూడాలి.