https://oktelugu.com/

ఒక రాష్ట్రం.. ఆరుగురు సీఎం అభ్యర్థులు

బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి అమీతుమీగా సాగేలా ఉన్నాయి. సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆరుగురు సీఎం అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ఈసారి సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌ అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది. Also Read: అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ పై సంచలన నిర్ణయం? ఎన్డీయే తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్, ఆర్జేడీ తరఫున తేజస్వి యాదవ్, గ్రాండ్ డెమోక్రాటిక్ సెక్యులర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 15, 2020 / 12:33 PM IST
    Follow us on

    బీహార్‌‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి అమీతుమీగా సాగేలా ఉన్నాయి. సీఎం అభ్యర్థుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆరుగురు సీఎం అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా ఈసారి సీనియర్స్‌ వర్సెస్‌ జూనియర్స్‌ అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది.

    Also Read: అప్పుడు వాజ్ పేయి.. ఇప్పుడు మోడీ.. పెట్రోల్ పై సంచలన నిర్ణయం?

    ఎన్డీయే తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్, ఆర్జేడీ తరఫున తేజస్వి యాదవ్, గ్రాండ్ డెమోక్రాటిక్ సెక్యులర్ అలయన్స్ తరఫున కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా, ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ అలయన్స్ తరఫున పప్పు యాదవ్, లోక్ జనశక్తి పార్టీ తరఫున చిరాగ్ పాశ్వాన్ సీఎం అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. వీరితోపాటే ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగుతున్న పుష్పం ప్రియ చౌదరి కూడా తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ ఆరుగురిలో నితీశ్,ఉపేంద్ర, పప్పు యాదవ్ సీనియర్లు కాగా… తేజస్వి,చిరాగ్, ప్రియ చౌదరి యువ నేతలు.

    గత బీహార్ ఎన్నికల్లో జేడీయూ,ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన నితీశ్ కుమార్ యాదవ్.. ఈ ఎన్నికల్లో  ఎన్డీయే కూటమి తరఫున బరిలో దిగడం గమనార్హం. 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నితీశ్.. 1989లో మొదటిసారి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 1991,1996,1998,1999,2004లలో వరుసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా, 1998, -1999లో కేంద్ర రైల్వే మంత్రిగా,2000లో మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా,2004లో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. మార్చి 3,2000లో మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం 7 రోజులు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2005 నుంచి ఇప్పటివరకూ నాలుగుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు.

    ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మహాకూటమి తరఫున తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్నాడు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఆరితేరుతున్న తేజస్వి… ఆరంభంలోనే నితీశ్ లాంటి దిగ్గజ నేతను ఢీకొడుతున్నాడు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మహాకూటమి సర్కార్‌లో మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత కూటమి విచ్చిన్నమవడం,తండ్రి జైలుకెళ్లడంతో పార్టీ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీహార్ నిరుద్యోగ సమస్యను హైలైట్ చేస్తూ తేజస్వి యువతను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

    ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్న మరో నేత ఉపేంద్ర కుష్వాహా. ఈయన 20 ఏళ్ల క్రితం తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మొదట్లో జేడీయూలో ఉన్న ఉపేంద్ర ఆ తర్వాత 2013లో ఆర్ఎల్‌ఎస్పీలో చేరారు. 2000 సంవత్సరంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం గ్రాండ్ డెమోక్రాటిక్ సెక్యులర్ అలయన్స్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.

    లోక్‌ జనశక్తి పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్న చిరాగ్ పాశ్వాన్ కూడా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఇమేజ్‌నే నమ్ముకున్నారు. 2014లో బీహార్‌లోని జముయ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు. 2019లో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నిన్న,మొన్నటివరకు ఎన్డీయేలో కొనసాగిన ఎల్‌జేపీ… ప్రస్తుతం బీహార్‌లో ఒంటరి పోరుకు సిద్ధమైంది.

    Also Read: ట్రంప్ vs జోబైడెన్.. ఎవరికి విరాళాలు ఎక్కువొచ్చాయంటే?

    ఇక ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ అలయన్స్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతున్న పప్పు యాదవ్ 1990లో తొలిసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991 నుంచి 2015 వరకు ఆరుసార్లు ఎంపీగా పనిచేశారు. బీహార్ వరదల సమయంలోనూ,ఇతర సందర్భాల్లోనూ తాను చేపట్టిన సామాజిక కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    మరో నేత జేడీయూ మాజీ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కుమార్తె పుష్పం ప్రియ చౌదరి. లండన్‌లో విద్యాభ్యాసం చేసిన వినోద్ చౌదరి… ఈ ఏడాది మార్చిలోనే సొంత పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ ప్లురల్స్ పార్టీని గెలిపిస్తే 2030 కల్లా బీహార్‌ను యూకేలా మారుస్తానని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా.. బలమైన బ్రాహ్మణ సామాజిక వర్గ నేపథ్యం కలిగి ఉండటం ఆమెకు ఎంతో కొంత కలిసొస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈసారి బీహార్‌‌ ఎన్నికలను చూస్తుంటే హోరాహోరీ పోరు తప్పేలా లేదు.

    -శ్రీనివాస్. బి