ఉపదేశాలు మినహా చర్యలు కనిపించని ప్రధాని ప్రసంగం

ప్రపంచ ప్రజలు అందరు ప్రాణాంతక కరోనా వైరస్ తో భయకంపితులై ఉన్న సమయంలో, మొత్తం ఆర్ధిక వ్యవస్థ చెల్లాచెదురైన పరిస్థితులలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ప్రసంగిస్తున్నారంటే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఆరోగ్యపరంగా ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితులలో ప్రజలకు చేదోడుగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా ఆయన అనేక చర్యలు ప్రకటిస్తారని ఎదురు చూసారు. అయితే ఆయన ప్రసంగం […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 1:26 pm
Follow us on

ప్రపంచ ప్రజలు అందరు ప్రాణాంతక కరోనా వైరస్ తో భయకంపితులై ఉన్న సమయంలో, మొత్తం ఆర్ధిక వ్యవస్థ చెల్లాచెదురైన పరిస్థితులలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ప్రసంగిస్తున్నారంటే ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఆరోగ్యపరంగా ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితులలో ప్రజలకు చేదోడుగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా ఆయన అనేక చర్యలు ప్రకటిస్తారని ఎదురు చూసారు.

అయితే ఆయన ప్రసంగం అన్ని ఉపదేశాలు పరిమితమై పోయింది. ఎవ్వరికి వారు జాగ్రత్త వహించి, స్వయం క్రమశిక్షణ ప్రదర్శించి ఈ ఉపద్రవం నుండి బైట పడాలని సూచించారు. అందుకు ఎన్నో హిత వచనాలు పలికారు.

ఒక పీఠాధిపతిగా చేసిన ఉపవచనాలు వలే ఉన్నాయి గాని, దేశాధినేతగా ఏమి చేయబోతున్నారో మాత్రం మాట్లాడక పోవడం గమనార్హం. ప్రపంచం అంతా ఖంగారు పడుతున్నా చైనా పక్కనే ఉన్న చిన్న దేశం తైవాన్ ఏ విధంగా విజయవంతంగా ఎదుర్కొందో వంటి అనుభవాలను చెప్పినా బాగుండేది.

ముఖ్యంగా అంతా బంద్ పాటిస్తూ ఉండడంతో ఆదాయ వనరులు కోల్పోతున్న పేదలు, అణగారిన వర్గాలు, ముఖ్యంగా రోజువారీ వేతనాలపై ఆధారపడి ఉండేవారికి ప్రభుత్వ పక్షాన కొంత సహాయం అందించడం వంటి ప్రకటనలు అయినా చేయక పోవడం గమనార్హం. సాధారణంగా ఆయన ప్రసంగాలలో కనిపించే ఆవేశం, ప్రత్యర్థులను దూషించే దూకుడు కూడా కనిపించలేదు.

ఈ సవాల్ ను తన ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోబోతున్నదో వివరించి ఉంటె సముచితంగా ఉండేది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే బాధ్యతను మొత్తం ప్రజలపై నెట్టివేసి ధోరణిలో ప్రధాని ప్రసంగం ఉన్నదని సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఒకరి వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలు చేసిన ప్రకటనలను ఆమె గుర్తు చేశారు. ఫ్రాన్స్ గృహ వినియోగ బిల్లుల చెల్లింపును రద్దు చేయగా, స్పెయిన్ జాతీయ ఆరోగ్య సదుపాయం కల్పించింది. ఇటలీ, చైనా ఇంటివద్దే పలు సేవలు అందించే ఏర్పాట్లు చేశాయి. ఆర్ధికంగా అణగారిన వర్గాలను ఆదుకోవడంతో పాటు, అందరికి ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చి ఉండవలసింది.

ఈ సందర్భంగా పలు దేశాలు ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీలు గమనార్హం. యుకె 39 బిల్లియన్, అమెరికా 1.2 ట్రిలియన్, ఫ్రాన్స్ 45 బిలియన్, న్యూజీలాండ్ 8 బిల్లియన్, ఇటలీ 28 బిలియన్, కెనడా 56 బిలియన్, దక్షిణ కొరియా 10 బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి.

భారత దేశంలో ఇప్పటికే పలు ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటించాయి. కానీ ప్రధాని మోదీ ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ, ప్రజల తమ ఇళ్ల బాల్కనీల నుండి సాయంత్రం చప్పట్లు కొట్టడం మాత్రమే చేస్తున్నారు. అందరికన్నా ఎక్కువగా కేరళ ప్రభుత్వం రూ 20,000 కోట్ల ప్యాకేజి ప్రకటించింది.

ప్రభుత్వం వివిధ పథకాలకింద అందించే పింఛన్లు ఏమీ పొందని వారికి ఏప్రిల్‌ నెలకు వెయ్యి రూపాయల చొప్పున సామాజిక భద్రతా పింఛను అందించేందుకు రూ.1320 కోట్లను ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కేటాయించారు. పేదలకు ఉచితంగానే ఆహార పదార్థాలను అందజేస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు.

ఉచిత ఆహార ధాన్యాలను అందజేసేందుకు వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధి హామీ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు.. ప్రయాణ వాహనాలకు పన్ను రాయితీ కల్పించనున్నారు.

ఆరు నెలలకు సరిపడిన రేషన్ లను ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించారు. అయితే రోజువారీ ఆదాయాలు కోల్పోయిన ప్రజలు ఆరు నెలల రేషన్ ను ఒకే సారి కొనుగోలు చేయగలరా?