రోజూ కరోనా వైరస్ వార్తలు చూస్తూ,వింటూ ప్రజలు ఒక భయానకమైన మానసిక పరిస్థితిలోకి దిగజారారు. రేపు ఏమవుతుందో, నాకే వైరస్ సోకితే పరిస్థితి ఏమిటి? ఏ హాస్పిటల్ కు వెళ్ళాలి? ఎవరు తీసుకపోతారు? తీసుకపోయినా నేను వైరస్ ను తట్టుకొని బతుకతానా? బతికి వస్తే ఇంట్లో, వాడలో మళ్ళీ యథాతథంగా సామాన్య జీవితం గడిపే అవకాశం ఉంటుందా అని ఆలోచిస్తూ చాలా ఆందోళన కరమైన పరిస్థితిలో అందరం జీవిస్తున్నాము. ఇంట్లో ఒక్కరికీ జ్వరం వచ్చింది అని తెలిసినా వాడకట్టుకు వాడకట్టు ఖాళీ జెసి వెళ్లిపోవడమో లేదా ఆ కుటుంబాన్ని వెలివేయడమో జరుగుతున్నది. చనిపోతే శవానికి అంత్యక్రియలు చేయడం కూడా చాలా కష్టం అవుతున్న పరిస్థితిని చూస్తున్నాం.
Also Read: మందుబాబులకు జగన్ సర్కార్ భారీ షాక్..?
ఇలాంటి స్థితిలో నిజానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా చొరవతీసుకొని ప్రజల్లోకి వెళ్ళి వైరస్ సోకినా భయపడాల్సిన పనిలేదు, అందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం కల్పిస్తామని భరోసా ఇచ్చే బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భయ ఆందోళనలను గాలికి వదిలేసి ఫుల్లుగా వానలు పడుతున్న కృష్ణా నది జలాల గురించి.. ప్రజల నుంచి పిండుకునే ఎల్.ఆర్.ఎస్ గురించి.. సెక్రటేరియట్ కూల్చివేత, ఆచరణకు నోచుకోని అరణ్యాల పెంపకం, అంటూ ఏవేవో ప్రస్తుతం ప్రజల భయాందోళనతో సంబంధం లేని కార్యక్రమాలలో బిజీ గా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఏమి చేస్తున్నదో నా లాంటి సామాన్యమానవునికి అర్థంకాని విషయం.
ఇలాంటి మహమ్మారులు గతంలో కూడా వచ్చాయి. అప్పుడు , ఇప్పుడున్నంతటి ఆధునిక వైద్య సదుపాయాలు లేవు. రవాణా కూడా లేదు. అయినా వాళ్ళు ధైర్యంగా ఆ పరిస్తితిని ఎదుర్కొని బతికారు. కనుకనే ఇప్పుడు మనం ఉన్నాం. మా నాయిన చెప్పేవాడు, తన చిన్నతనం లో గత్తర , కూర్కుల గాయి అని రెండు మహమ్మారులు తాను చూశానని చెప్పాడు. ఒగరిని దహనం చేసి వచ్చేటప్పడికి మరో శవం రెడీ గా ఉండేదట . అందుకని ఇనుపరేకుతో పాడే కట్టిమోసుక పొదురట . దానికి యువకులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తయారుగా ఉండేవారట.
కానీ ఇప్పుడు ఇంత భయం దేనికి అని మనం ఆలోచిస్తే? మొదటి కారణం, ప్రభుత్వమే భయాన్ని సృష్టించింది. భయపడనివాళ్లను తన్నీ,కొట్టీ, మరీ భయపెట్టింది. ఇక భద్రజీవులు, ఎవడు ఎట్లా చస్తే మనకేమిటి మనం సుఖంగా ఉంటే అయిపాయే అన్న ధోరణిని ప్రచారం చేశారు. ఇప్పుడు ఏ తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. అయితే పాలక వర్గాలకు, సంపన్న వర్గాలకు , సదుపాయాలు, సంపద ఉంది అన్న భరోసా ఉంది. కానీ సామాన్య ప్రజలకే ఎలాంటి భరోసా లేకుండా పోయింది.
Also Read: రైతులకు దన్నుగా జగన్ సర్కార్.. 16 నుంచి పంటల కొనుగోళ్లు..?
* ఈ పరిస్థితిలో మరి పౌరసమాజం ఏమి చేయవచ్చునో ఒక సారి ఆలోచిద్దాం.
1). ప్రతి గ్రామం,లేదా పట్టణం అయితే ప్రతి వాడలో, ఒక వాలెంటీర్ ఆర్గనైజేషన్ ను ప్రారంభించుకోవాలి. అందుకు బాధ్యత కలిగిన ఆ వాడకట్టు పెద్దమనుషులు, ప్రజాప్రతినిధి , పలుకుబడి కలిగిన వారు, లేదా బాధ్యత తెలిసిన ప్రజా ప్రతినిధి ఎవరైనా ముందుకు రావాలి.
2). మొన్న గాంధీ హాస్పిటల్ లో చూసినమ్, సిబ్బంది మేము పనిజేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు సరిపడా వేతనాలు, రక్షణ సాధనాలు కల్పించండి అని అడిగినారు. వైరస్ సోకే అవకాశం ఉండే డాక్టర్లు గాని , నర్సులు గాని మేము పనిచేయము అని అన లేదు. పనిచేస్తాం అని ముందుకు వస్తున్నారు. మొన్నటికి మొన్న వలసకూలీలకు అన్నవసతి, రవాణా సదుపాయం కల్పించిన ఎన్నో స్వచ్ఛంద సంస్తలు తోటివారికి సహాయం చేయాలనే ఒక మానవీయ దృక్పథం తో ముందుకు వచ్చి వేలాది మంది వలసకూలీలను వారి వారి స్వస్తలాలకు పంపించినారు. అంటే, నిస్సహాయకులకు, బాధితులకు సహకరించడానికి ముందుకు వచ్చే చైతన్యం మన దేశ సంస్కృతి మనకు నేర్పించింది. ఇప్పుడు పౌరసమాజ పెద్దలు చేయవలసింది అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించి ఒక సమూహంగా ఏర్పాటు చేయడం .
3). ఆ వాలెంటీర్ గ్రూప్ కు అవసరం అయిన సానిటేషన్, రిఫ్రెష్మెంట్ , అవసరాలకోసం ఆ ఆవాసం నుండి నిధులు సేకరించడం చేయాలి. పూనుకుంటే ఇది పెద్దవిషయం కాదు.
4). ఇలాంటి వాలెంటీర్ సభ్యులు మన మన ఇంటి పక్కవాళ్లే అయి ఉంటారు కనుక వాళ్లు చెప్పే ధైర్య వచనాల పైన బాధితులకు విశ్వాసం ఉంటుంది.
5). అవసరం అయిన పక్షం లో బాధితులను ఆ వాలెంటీర్లు హాస్పిటలకు తీసుకొని వెళ్ళడం, లేదా అవసరమైన అన్నపానాదులను, మందులను తెప్పించి బాధితులకు అండగా నిలువడం వారి మానవీయ బాధ్యత గా ఉండాలి.
6). నా వాడ, నా ఊరు, నాకు రక్షణగా నిలుస్తుంది అన్న ధైర్యం రోగికి పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది. ఇవాళ ముఖ్యంగా రోగికి, మేము ఉన్నాం మీకేమీ కాదు , భయపాడాల్సిన అవసరం లేదు అని ధైర్యం ఇచ్చే ఒక మనిషి లేదా ఒక వ్యవస్త కావాలి. అది సర్కారు చేయడం లేదు, కనుక పౌరసమాజం ముందుకు రావాలి.
7). ఇలా ముందుకు వచ్చి పనిజేసిన వాలెంటీర్ కు ఒక పురస్కారం, ఒక ప్రోత్సాహకం, ఒక గుర్తింపు ఇవ్వాలి.
8). ప్రభుత్వం ఆ వాలెంటీర్ కుటుంబం మొత్తానికి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించే హామీ ఇవ్వాలి. లేదంటే పౌరసమాజమే ఆ ఏర్పాటు చేయాలీ.
9). ఇంకా, ఇప్పటికైనా ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది అని నిరూపించుకోవడానికి ఇలాంటి విధానం ఒక మంచి అవకాశం. ఈ వాలెంటీర్లు, యువకులు అయితే రానున్న స్టానిక ఉద్యోగాలల్లో వారికి ప్రాధాన్యత ఇస్తామన్న హామే ఇవ్వాలి.
10). కొన్ని చోట్ల అయినా ఇలాంటి ప్రయత్నాలు జరిగి అర్థవంతమైన ఫలితాలు వచ్చినట్లైతే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి తానే ముందుకు వచ్చే పరిస్తితి ఉంటుంది.
11). ఇప్పటికైనా ప్రభుత్వం కాకమ్మ కథలు చెప్పడం ఆపేసి ప్రభుత్వ వైద్య వ్యవస్త, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నది అని భరోసా కల్పించాలి అంటూ , పౌర సమాజం నుండి బలమైన డిమాండి వెళ్ళాలి.
12). ప్రతిపక్షం చేస్టలు ఉడిగి చేతులు ముడుచుకొని సామాన్య జనులకంటే అధ్వాన్నంగా నిష్క్రియా శూన్యులై ఉన్న సందర్భం లో పౌరసమాజం అయినా ముందుకు వచ్చి తమ బాగోగులు తామే చూసుకుంటాం అన్న సవాలు విసిరినప్పుడన్నా , పాలక , ప్రతిపక్షాలకు ఏమన్నా సోయి కలుగుతుందేమో చూద్దాం.
13). అధికార, ప్రతిపక్ష, అన్న తేడా లేకుండా ఒక ఎమ్మెల్యే గానీ, ఒక కార్పొరేటర్ గాని, ఒక కౌన్సిలర్, లేదా ఎంపీటీసీ, లేదా ఒక సర్పంచ్ ,లేదా ఒక బాధ్యత కలిగిన పౌరుడు , ఏ ఒక్కరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే ప్రస్తుత పరిస్థితిలో ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్లు అవుతారు.
-వీరగోని పెంటయ్య