https://oktelugu.com/

బండి సంజయ్ ఎంపికలో కిషన్ రెడ్డి ఎత్తుగడ!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అంశాన్ని రెండు నెలలకు పైగా తేల్చకుండా చివరకు కరీంగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను ఎంపిక చేశారు. కేవలం కరీంగర్ నగరంకే పరిమితంగా రాజకీయ కార్యకలాపాలకు పరిమితమైన సంజయ్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ చతికల పడడంతో, కేసీఆర్ కు బంధువైన అప్పటి ఎంపీ వినోద్ కుమార్ ను ఓడించడం కోసం టి ఆర్ ఎస్ వ్యతిరేకులు అందరు ఒక్కటి కావడంతో అనూహ్యంగా ఎంపీగా ఎన్నిక కాగలిగారు. ఎంపీగా ఉండి […]

Written By: , Updated On : March 12, 2020 / 11:12 AM IST
Follow us on

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక అంశాన్ని రెండు నెలలకు పైగా తేల్చకుండా చివరకు కరీంగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను ఎంపిక చేశారు. కేవలం కరీంగర్ నగరంకే పరిమితంగా రాజకీయ కార్యకలాపాలకు పరిమితమైన సంజయ్ లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ చతికల పడడంతో, కేసీఆర్ కు బంధువైన అప్పటి ఎంపీ వినోద్ కుమార్ ను ఓడించడం కోసం టి ఆర్ ఎస్ వ్యతిరేకులు అందరు ఒక్కటి కావడంతో అనూహ్యంగా ఎంపీగా ఎన్నిక కాగలిగారు.

ఎంపీగా ఉండి ఆ జిల్లాల్లో ఒక మునిసిపాలిటీల్లో గాని, మండలంలో గాని పార్టీని గెలుపించలేక పోయారు. మొన్నటి మునిసిపల్ ఎన్నికలలో కరీంగర్ లో గట్టి పోటీ ఇచ్చినా తగిన ఆర్ధిక వనరులను సమీకరించడంలో వెనుకబడ్డారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, నిజాయతీగా వ్యవహరించే పేరున్నప్పటికీ ఒక విధంగా `బలహీన’మైన నేతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎత్తుగడ ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు.

బలమైన రాజకీయ వారసత్వం గల డీకే అరుణ, పుష్కలంగా వనరులు గల జితేందర్‌రెడ్డి వంటి వారు ఈ పదవికి పోటీ పడినా వారిని కాదని బండి సంజయ్ ను ఎంపిక చేయడం భవిష్యత్ లో రాజకీయంగా తనకు పోటీగా మారే వారెవ్వరూ రాకుండా కిషన్ రెడ్డి జాగ్రత్త పడటమే కారణం అని తెలుస్తున్నది. ముఖ్యంగా తన సామాజిక వర్గంలో మరొకరు బలమైన నాయకుడిగా ఎదగడాన్ని ఆయన సహించలేరు.

కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా `సహాయ నిరాకరణ’ ధోరణి అవలంభించడం, చివరకు ప్రెస్ మీట్ లు పెట్టుకోవడానికి కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అనుమతులు ఇవ్వక పోవడంతో మాజీ టిడిపి మంత్రి నాగం జనార్ధనరెడ్డి అవమాన భారంతో పార్టీ నుండి వైదొలిగి, తర్వాత కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే.

తెలంగాణలో బిజెపి రాజకీయాలు ఇప్పటి వరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నాయకుల చేతులలోనే నలుగుతూ వస్తున్నాయి. వారంతా ఎక్కువగా మీడియా ముందుకు రావడానికి తప్పా ప్రజలలోకి వెళ్లడం పట్ల ఆసక్తి చూపేవారు కాదు. జిల్లాల్లో మొక్కుబడిగా మాత్రమే పర్యటనలు జరుపుతూ వచ్చారు. గాలిలో గెలుస్తూ రావడం మినహా సొంత బలంపై ఎన్నికలలో గెలుపొందే సమర్ధం వారెవ్వరికి లేదు.

పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి సొంతంగా రెండు సార్లు గెలుస్తూ వస్తున్న ఏకైక ఎమ్యెల్యే రాజా సింగ్ ను ఒక విధంగా మిగిలిన నాయకులు అందరు `ఏకాకి’గా చేస్తూ వస్తున్నారు. 2018 ఎన్నికలలో ఆయనకు సీట్ ఇవ్వరాదని పట్టుబడితే, స్వయంగా అమిత్ షా జోక్యం చేసుకొని ఇచ్చారు. సీట్ ఇచ్చినా ఆయన నియోజకవర్గంలో ఎవ్వరు ప్రచారంకు వెళ్లకుండా కట్టడి చేశారు.

జితేందర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఆయన పార్టీ పార్లమెంటు పక్షనేతగా పని చేసినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర మంత్రులు, ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి పార్టీ నాయకులతో ఆయన పరిచయాలు మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. వాజపేయి హయాంలో బిజెపి ఎంపీగా ఉన్నారు. అందుకనే అటువంటి నేతకు పార్టీ నాయకత్వం అప్పజెబితే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని కిషన్ రెడ్డి అడ్డు పడిన్నట్లు చెబుతున్నారు.

అదే విధంగా సుదీర్ఘ రాజకీయ నేపధ్యం గల డీకే అరుణకు తెలంగాణ అంతటా పరిచయాలు ఉన్నాయి. ఆమెకు నాయకత్వం అప్పచెప్పినా తానెక్కడ `జీరో’ అవుననే భావనతో `ఇద్దరం ఒకే సామజిక వర్గం’కు చెందిన వారం అవుతామంటూ అడ్డుపుల్ల వేశారని తెలుస్తున్నది.

వాస్తవానికి ప్రస్తుత అధ్యక్షుడు డా కె లక్ష్మణ్ నే కొనసాగించాలని కిషన్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే ఆయన సారధ్యంలో తిరోగమనంలో పడటం, ఆయన పనితీరుపై అనేక విమర్శలు రావడంతో పార్టీ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయక పోవడంతో, గత్యంతరం లేక ఆర్ ఎస్ ఎస్ సూచించిన సంజయ్ వైపు కిషన్ రెడ్డి మొగ్గిన్నట్లు కనిపిస్తున్నది.