మీడియా మితిమీరిపోతోందా..? ప్రభుత్వం అడ్డుకోలేదా!

దేశంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల మీడియాపై చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి టీవీ చానెళ్లపై. . బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుట్ మరణం తర్వాత మీడియా ట్రయల్స్ పై జనాలు, మేధావుల్లో చర్చ నడుస్తుందనడంలో సందేహం లేదు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులపై మీడియా వ్యాఖ్యలు చేస్తోంది. నిందితుల ఇంటర్వ్యూలను చూస్తే కోర్టుల పని చానెళ్లే చేస్తున్నాయా అనిపిస్తోందని రాజ్యాంగ నిపుణలు చెబుతున్నారు. మీడియాను కట్టడి చేయాలని, పర్యవేక్షణకు స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొందరు అంటుంటే.. […]

Written By: NARESH, Updated On : October 18, 2020 10:17 am
Follow us on

దేశంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల మీడియాపై చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి టీవీ చానెళ్లపై. . బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుట్ మరణం తర్వాత మీడియా ట్రయల్స్ పై జనాలు, మేధావుల్లో చర్చ నడుస్తుందనడంలో సందేహం లేదు. కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులపై మీడియా వ్యాఖ్యలు చేస్తోంది. నిందితుల ఇంటర్వ్యూలను చూస్తే కోర్టుల పని చానెళ్లే చేస్తున్నాయా అనిపిస్తోందని రాజ్యాంగ నిపుణలు చెబుతున్నారు. మీడియాను కట్టడి చేయాలని, పర్యవేక్షణకు స్వతంత్ర్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొందరు అంటుంటే.. మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిందేనని కొందరు వాదిస్తున్నారు.

Also Reed: ప్రాజెక్టుల్లో వరుస ప్రమాదాలు.. కేసీఆర్ ను వదలడం లేదే?

*అటార్నీ జనరల్ ఆందోళన..
టీవీ చానెల్స్ లో జరుగుతున్న మీడియా ట్రయల్స్ పై  భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై మీడియా చేస్తున్న వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని నర్మగర్భంగా వెల్లడించారు. “పెండింగ్ కేసులపై ఇటీవల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు నిస్సంకోచంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి. న్యాయమూర్తులతో పాటు ప్రజల ఆలోచనా విధానాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇది దేశానికి మంచిది కాదు”అని ఆవేదన వ్యక్తం చేశారు.

*సుశాంత్ కేసు పై పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ…
ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన సుశాంత్ సింగ్ రాజ్ పుట్, రియా చక్రవర్తి కేసుల నేపథ్యంలో..“కేసుల విచారణ జరుగుతున్నప్పుడు నిందితుల సంభాషణ లను చానెల్స్ ప్రచారం చేస్తున్నాయి. దీంతో నిందితులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.”అని అటార్నీ జనరల్ చెప్పారు. అయితే ఈ కేసుల విచారణ టైంలో చాలా టీవీ చానెళ్లు సుశాంత్, రియా వాట్సాప్ సంభాషణలపై వార్తలు ప్రసారం చేయడం గమనార్హం. ఈ విషయాన్నే వేణుగోపాల్ ప్రస్తావించినట్లు భావిస్తున్నారు. అదే విధంగా రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “రఫేల్ వివాదానికి సంబంధించిన కేసు విచారణ సమయంలోనే ఓ పత్రిక ఒక కథనం ప్రచురించింది. కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాల్లోని వివరాలను అందులో ప్రస్తావించారు. ఇలాంటివి జరుగకూడదు..”అని అటార్నీ జనరల్ వ్యాఖ్యానించారు.

*అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై పలువురి ప్రశ్నలు..
అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదనతో సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ విభేదించారు. మీడియాపై నియంత్రణ ఉంచాలని చెప్పడం సరికాదని.. కొన్ని విదేశీ కోర్టుల కేసులను ఈసందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈయనే కాదు పలువురు న్యాయ నిపుణులు, మేధావి వర్గం పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వారు చెబుతున్న ప్రకారం.. ‘‘కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరలే అత్యున్నత న్యాయాధికారి.. ఆయన ఏమైనా చెబితే ప్రభుత్వం చెప్పినట్టే.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది..” అనే చర్చ జరుగుతోంది.

Also Read: జగన్‌ స్థానిక సంస్థల ఎన్నికల జోలికి ఎందుకు పోవడం లేదు..?

*ప్రభుత్వ వైఖరిపై విశ్లేషకుల అభిప్రాయం…
నిబంధనలు ఉన్నప్పటికీ టీవీ చానెళ్లపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కోర్టులో ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తోంది? అనే అంశంపై నేడు చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టు న్యాయవాది విరాగ్ గుప్తా మాట్లాడుతూ టీవీ చానెళ్ల కు లైసెన్స్ లు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, మీడియా నియంత్రణకు కొన్ని చట్టాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇదే విషయంపై మీడియా విశ్లేషకుడు ముఖేశ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ.. తాము తీసుకోవాల్సిన చర్యలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిస్సహాయతను వ్యక్తం చేస్తోందన్నారు. కొన్ని మీడియా చానెళ్లు ట్రయల్స్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి రాజకీయ ఎజెండాలే కారణమని జర్నలిస్టు మనీష్ పాండే ఆరోపించారు.

*కేసుల విచారణ వార్తలు.. పలు కోణాలు..
కోర్టుల్లో కేసుల విచారణకు సంబంధించిన వార్తలు రాసేటప్పుడు, ప్రసారం చేసేటప్పుడు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది విరాగ్ గుప్తా చెబుతున్నారు.
1. ‘‘మొదట ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే.. కోర్టు అంశాల్లో జోక్యం చేసుకున్నట్లే’’.
పెండింగ్ కేసుల్లో మీడియా జోక్యంపై ఇప్పటికే పలుసార్లు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మీడియా కవరేజీ వల్ల విచారణ ప్రభావితం అవుతుందని భావిస్తే.. తాత్కాలికంగా కవరేజీపై నియంత్రణ విధించొచ్చని 2012లో సుప్రీం వ్యాఖ్యానించింది.
మీడియా స్వేచ్ఛ కోసం భారత్ లో ప్రత్యేక చట్టాలు లేవు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, భావ ప్రకటన స్వేచ్ఛ కింద సామాన్య పౌరులకు ఉండే హక్కులే మీడియాకు ఉంటాయి. అయితే ఈ నిబంధన కింద సహేతకమైన ఆంక్షలు పెట్టొచ్చు.

2. నిందితుడు ఇంకా నిందితుడే.. అతడు ఇంకా దోషిగా నిర్ధారణ జరుగలేదు.
3. బాధితుల అంశాలనూ పరిగణలోకి తీసుకోవాలి.
4. క్రిమినల్ నేరాలు.
పై మూడింటిలో విచారణ ఎలాంటి ప్రభావాలకూ లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది.
సివిల్ కేసులు ఇద్దరు వ్యక్తులు మధ్య నమోదవుతాయి. క్రిమినల్ కేసులు ప్రభుత్వాలు, నిందితుల మధ్య ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వమంటే రాష్ట్ర ప్రభుత్వం. ఒక వేళ కేసు సీబీఐ పరిధిలో ఉంటే బాధ్యత కేంద్రానిది. అందుకే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అందరికీ ఈ కేసులతో సంబంధముంటుందని విరాగ్ గుప్తా వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: దుబ్బాక ప్రచారంలో బీజేపీ ముందుందా..? టీఆర్‌ఎస్‌కు హరీశ్ యేనా?

*స్వత్రంత్ర నియంత్రణ వ్యవస్థ..
‘‘ప్రభుత్వం ఈ విషయంలో కొద్దిగా ఉదాసీనతతో వ్యవహరిస్తోంది. మరో వైపు న్యాయ వ్యవస్థ కూడా నిస్సహాయంగా ఉంటోంది. నిబంధనలు ఎప్పటికీ నిబంధనల్లానే ఉండిపోతున్నాయి. ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు పెరుగుతూనే ఉన్నాయి.”అని ముఖేశ్ కుమార్ చెబుతున్నారు. మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తూ, నియంత్రణలు విధించే ఒక సంస్థ ఉండాలనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే భారత్లో 350నుంచి 400వరకు న్యూస్ చానెల్స్ ఉన్నాయి. వీటిపై రోజంతా నిఘా పెడుతూ, ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు. అందుకే స్వతంత్రంగా పనిచేసే ఒక సంస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నాయి. ప్రింట్ మీడియా నియంత్రణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నా.. టీవీల విషయంలో పటిష్ట నియంత్రణ వ్యవస్థ లేదు. చాలా వరకు టీవీ చానెళ్లు స్వీయ నియంత్రణ వ్యవస్థకే కట్టుబడి ఉన్నాయి. స్వేచ్ఛగా పనిచేసే మీడియా.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాంటిందంటారు. ఈమేరకు సదరు సంస్థలే నిష్పాక్షికంగా ఉండేందుకు స్వీయ నియంత్రణ పాటించేలా అడుగులు వేయాలి.

*చర్యలు తీసుకోవడం కష్టమే..
మీడియాను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే… మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా అణచివేత తదితర ఆరోపణలు వస్తాయి. ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి కింది విభాగాలుగా పనిచేస్తున్నాయని ముఖేశ్ కుమార్ వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని చానెళ్లతో ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. కాగా, ఈ సంక్షోభం ప్రభుత్వానిదో లేదా కోర్టులతో లేదా మీడియాదో కాదు.. ప్రజలకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు ఎలా తప్పుదారి పడుతున్నాయో ఈ చర్చలన్నింటినీ చూస్తే అర్థమవుతుంది.

– శ్రీనివాస్ యాదవ్. బి