తెలంగాణలో కేసీఆర్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడో తెలుసా?

‘‘తెలంగాణ ప్రజలకు ఉద్యమం చేసుడు కొత్తేం కాదు.. ఒక్కసారి తెగాయించిన్రు అంటే దేనికీ వెనుకాడబోరనేది అందరికీ తెలుసు. ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ పీఠాన్ని షేక్‌ చేసిన ఉద్యమకారులు వీరంతా. సమస్య వచ్చిందంటే ఐక్యంగా గళం విప్పే సమర్థులు. సమష్టి ఉద్యమం చేసి.. కొట్లాడి సాధించుకునే తెగువ ఉన్న వారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి యావత్‌ భారతావనికి కూడా తెలుసు.’’ ‘‘మరి ఇవన్ని తెలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రజలపై ఎందుకు ప్రయోగాలకు దిగుతున్నారు..? ప్రజలకు […]

Written By: NARESH, Updated On : December 20, 2020 7:09 pm
Follow us on

‘‘తెలంగాణ ప్రజలకు ఉద్యమం చేసుడు కొత్తేం కాదు.. ఒక్కసారి తెగాయించిన్రు అంటే దేనికీ వెనుకాడబోరనేది అందరికీ తెలుసు. ఒక్క తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ పీఠాన్ని షేక్‌ చేసిన ఉద్యమకారులు వీరంతా. సమస్య వచ్చిందంటే ఐక్యంగా గళం విప్పే సమర్థులు. సమష్టి ఉద్యమం చేసి.. కొట్లాడి సాధించుకునే తెగువ ఉన్న వారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి యావత్‌ భారతావనికి కూడా తెలుసు.’’

‘‘మరి ఇవన్ని తెలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ప్రజలపై ఎందుకు ప్రయోగాలకు దిగుతున్నారు..? ప్రజలకు నచ్చిన విధంగా పాలన అందించకుండా.. తనకు నచ్చినట్లుగా ప్రయోగాలు చేస్తూ ఎందుకు గోస పెడుతున్నట్లు..? లేనిపోని పాలసీలు తీసుకొచ్చి వాటిని ఎందుకు రివర్స్‌ తీసుకుంటున్నారు..?’’

Also Read: రిజిస్ట్రేషన్లు ఇకపై పాత పద్ధతిలోనే..!

‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్‌‌ చేసిందే చట్టం.. తీసుకుందే నిర్ణయం. ఆరేడు ఏళ్లుగా ఏకఛత్రాధిపతిగా రాష్ట్రాన్ని ఏలారు కేసీఆర్‌‌. ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని తన ఇష్టారాజ్యంగా నడిచారు. నీళ్లు.. నిధులు.. నియామకలు అంటూ పోరాడి తెలంగాణ సాధించుకున్న ప్రజల్లో ఇప్పుడిప్పుడే అసహనం మొదలైంది. తెలంగాణ సాధించి కేసీఆర్‌‌ చేతిలో పెడితే.. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు.. నిధులు లేక ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తూనే ఉన్నారు. అందుకే.. ఇన్నాళ్లు భరిస్తూ వస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా అసహనం కనిపిస్తోంది. అందుకే.. తీసుకున్న నిర్ణయాల నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నారు. యూటర్న్‌ తీసుకుంటూ పాత పద్ధతిలోకి వెళ్తున్నారు.’’

*అటు కోర్టు మొట్టికాయలు.. ఇటు ప్రజల నుంచి నిరసనలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. కొత్తగా అమల్లోకి తెస్తున్న విధానాలు వరుసగా ఫెయిల్‌ అవుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్‌‌ చేసిన కొన్ని చట్టాలు వివాదాల్లో చిక్కుకుంటే.. మరికొన్నింటిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వచ్చింది. ఇంకొన్నింటిపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. ముందూ వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం.. సాధ్యాసాధ్యాలపై సమీక్షించకపోవడం.. మంత్రులు, సీనియర్‌‌ ఆఫీసర్ల ప్రమేయం లేకుండా నేరుగా ప్రగతిభవన్‌ నుంచి ఓకే చేయడం.. ఆగమాగం జీవోలు పాస్‌ చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందనేది వాస్తవం. కరోనా టెస్టులు, వీఆర్వోల వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ చట్టం, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, షరతుల సాగు, ఎల్‌ఆర్‌‌ఎస్‌, రిజిస్ట్రేషన్లు, ఆస్తుల సర్వే, ధరణి పోర్టల్.. ఈ దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు కేసీఆర్‌‌.

*షరతుల సాగుపై వెనక్కి
తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌ కొత్తగా షరతుల సాగు అని తీసుకొచ్చింది. దీంతో తాము చెప్పిన పంట వేసిన వారికే రైతుబంధు డబ్బులు ఇస్తామని ముందుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. తర్వాత సన్న వడ్లు మాత్రమే సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకురాగా.. కేసీఆర్‌‌ మాటలు నమ్మిన చాలా మంది రైతులు సన్నరకాలు పండించారు. సన్న రకాలతో దిగుబడి తక్కువగా వచ్చింది. దీనికితోడు వానలతో పంట పూర్తిగా దెబ్బతింది. ఉన్న కాస్త పంటను కూడా కొనే దిక్కు లేకుండా పోయింది. దీంతో రైతులు అరిగోస పడ్డారు. చివరకు సన్నాలకు ఎంతో కొంత ఎక్కువ ఇచ్చి కొంటామని సీఎం కేసీఆర్‌‌ దుబ్బాక ఎన్నికల వేళ ప్రకటించారు. కానీ.. ఎక్కడా అమలు చేయలేదు. ఇక వానాకాలంలో మక్కలు కొనేది లేదని సీఎం చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చింది. మక్కలను కొంటామని ప్రకటించింది.

*వరద సాయంలోనూ బోల్తా పడ్డ సర్కార్‌‌
మరోవైపు.. ఇటీవల భారీగా వరదల వచ్చి హైదరాబాద్‌ మహానగరాన్ని ముంచెత్తాయి. ఆ సమయంలో సీఎం కేసీఆర్‌‌ కానీ ఇతర లీడర్లు కానీ కనీస సహాయక చర్యలు చేపట్టలేదని అపవాదు ఉంది. తరువాత నింపాదిగా తేరుకున్న ముఖ్యమంత్రి వరద బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం ప్రకటించారు. కానీ.. ఈ సాయం కాస్త పెద్ద దుమారం అయింది. టీఆర్‌‌ఎస్‌ లీడర్లే పైసలు పంచుకుతిన్నారని, తమకు సాయం అందలేదని పెద్ద ఎత్తున బాధితులు రోడ్లెక్కారు. దీంతో మీ సేవా ద్వారా అప్లై చేసుకోవాలని మరోసారి సూచించింది. దీంతో మీసేవ సెంటర్ల ముందు బాధితులు పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు. అప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ కావడంతో.. ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇస్తామని ఎల్‌బీ స్టేడియం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌‌ స్వయానా ప్రకటించారు. కానీ.. రిజల్ట్‌ వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆ సాయం ఊసే ఎత్తడం లేదు.

Also Read: కేసీఆర్ ఫౌంహౌస్ పై ‘బండి’ సంచలన కామెంట్స్..!

*ధరణితో ఎన్నో అవస్థలు
ధరణి పోర్టల్‌ ద్వారానే అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. ఇందుకోసం ఏకంగా కొత్త చట్టాన్నే తెచ్చింది. కానీ.. ఈ పోర్టల్‌పై పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు కూడా చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ధరణి పోర్టల్‌ను వ్యవసాయ భూములకే పరిమితం చేసింది. నాన్‌ అగ్రికల్చర్‌‌ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే చేస్తామని ప్రకటించినా.. బుద్ధి మార్చుకోలేదు. ధరణి ప్రాసెస్‌లోనే చేసేందుకు సిద్ధం కాగా.. హైకోర్టు మొట్టి కాయలు వేసింది. ముందుగా ధరణి పోర్టల్‌ తయారీ కోసం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో ప్రభుత్వం విమర్శల సుడిగుండంలో చిక్కుకుంది. ముందుగా పోర్టల్‌ రూపొందించి.. ఆ పోర్టల్‌ ఆపరేషన్‌లో టెక్నికల్‌, ఇంప్లిమెంటేషన్‌లో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలో స్టడీ చేయాల్సింది పోయి.. ముందుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేసి.. ఆపై పోర్టల్‌ తయారీకి పూనుకుంది. హఠాత్తుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌, ఇతర రంగాలు కుదేలయ్యాయి. బ్యాంకింగ్‌ రంగంపైనా ఆ ప్రభావం పడింది. మూడు నెలల తర్వాత తిరిగి నాన్‌ అగ్రికల్చర్‌‌ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. దీంతో చాలా మంది ఆనంద పడ్డా.. పోర్టల్‌లో టెక్నికల్‌ సమస్యలు, అనుమానాలు తలెత్తాయి. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా రియల్టర్లు, ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే చేస్తామంటూ తాజాగా శనివారం ప్రభుత్వం ప్రకటించింది.

*ఆస్తుల నమోదు తప్పనిసరి అని..
ధరణి పోర్టల్‌లో ముందుగా ఆస్తుల నమోదు తప్పనిసరి అంటూ నిబంధన పెట్టింది. నిర్ణీత గడువులోగా వివరాలు ఇవ్వని వారు తమ ఆస్తులను అమ్ముకోవడం సాధ్యం కాదని ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రజలు ఆందోళన చెందారు. ఆస్తుల వివరాల సేకరణ, పోర్టల్‌ భద్రతపై కొందరు కోర్టుకు సైతం వెళ్లారు. ‘వివరాలు నమోదు చేసుకోకుంటే ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయరా..? ఆస్తుల వివరాల సేకరణ ఏ చట్టం ప్రకారం చేస్తున్నారు’ అని కోర్టు ప్రశ్నించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

*వీఆర్వో వ్యవస్థకు మంగళం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి.. రెవెన్యూలో భాగమైన వీఆర్వో వ్యవస్థకు స్వస్తి పలికింది. మూడు నెలల క్రితమే ఆ వ్యవస్థను రద్దు చేసినా.. ఇంకా వీఆర్వోలకు ప్రత్యామ్నాయం మాత్రం చూపలేదు. ఇప్పటివరకు ఏ డిపార్ట్‌మెంట్‌కూ కేటాయించలేదు. 5 వేల మందికి పైగా వీఆర్వోలు రోజూ తహసీల్దార్ల ఆఫీసులకు వెళ్లి హాజరు వేయించుకుంటున్నారు. తహసీల్దార్లు చెప్పిన పనిని చేస్తూ పోతున్నారు. వారిని ఏదో ఒక డిపార్ట్‌మెంట్‌లో అటాచ్‌చేస్తామని గతంలో చెప్పినా.. ఇంకా పట్టించుకోవడం లేదు.

* కరోనా టెస్టులపై విమర్శలు
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా.. చివరకు రాష్ట్రంలోకి కూడా అడుగుపెట్టింది. ఆ సమయంలో కరోనా టెస్టులు అందరికీ అవసరం లేదంటూ.. ఐసీఎంఆర్‌‌ నిబంధనల ప్రకారం టెస్టులు చేస్తామని ప్రభుత్వం వాదించింది. ‘ఎక్కువ టెస్టులు చేస్తే గిఫ్టులు, అవార్డులు ఇస్తారా’ అంటూ మంత్రి కేటీఆర్‌‌ వెటకారంగా మాట్లాడారు. మరోవైపు టెస్టుల సంఖ్య ఎందుకు పెంచడం లేదంటూ హైకోర్టు ఎప్పటికప్పుడు నిలదీసింది కూడా. ఆ రెండు నెలల తర్వాత టెస్టుల సంఖ్య పెంచింది. కానీ.. కరోనా కట్టడిలో మాత్రం విఫలమైందనే అపవాదును సర్కార్‌‌ మూటగట్టుకుంది. అంతేకాదు.. తోటి తెలుగు రాష్ట్రంలో ఊహించని స్థాయిలో టెస్టులు చేసి దేశంలోనే రికార్డులు సృష్టించారు. ఇంకా.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి రికార్డు బ్రేక్‌ చేశారు. ఇక్కడ ఎందుకు చేర్చరంటూ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీలో చేర్చుతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా ఇంతవరకు చేర్చనేలేదు.

* ఎల్‌ఆర్‌‌ఎస్‌ ఎటూ తేల్చని సర్కార్‌‌
మరోవైపు రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం కొత్తగా ఎల్‌ఆర్‌‌ఎస్‌ స్కీంను ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేయాలని తలచింది. ఎల్‌ఆర్ఎస్‌ లేని ఇండ్ల జాగలను రిజిస్ట్రేషన్‌ చేయబోమని కండీషన్‌ పెట్టింది. దీంతో ప్లాట్లు కొనుగోలుదారులు ఎల్‌ఆర్‌‌ఎస్‌ కోసం అప్లై చేసుకున్నారు. దీనిపైనా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అంతెందుకు సొంత పార్టీ నేతల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చినా సర్కార్‌‌ లెక్కచేయలేదు. ఇక ఇప్పుడు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటమితో పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

* సెక్రటేరియట్‌పై మేధోమథనం
కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణం కోసం పాత దానిని కూల్చివేశారు. దీంతో ఓ వైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే.. కేసీఆర్‌‌ కొత్త బిల్డింగులకు పూనుకోవడం ఏంటంటూ నిరసనలు వచ్చాయి. మంచిగా ఉన్న బిల్డింగ్‌ను ఎందుకు కూల్చివేశారంటూ ప్రజాప్రతినిధులు, ప్రజలు నిలదీశారు. అందుకే.. ఇప్పుడు కేసీఆర్‌‌ సర్కార్‌‌ మేధోమథనంలో పడినట్లుగా సమాచారం. సెక్రటేరియట్‌ను అనవసరంగా కూల్చామా అని కుమిలిపోతోందట.

* పాలన మారకుంటే ప్రతిఫలం తప్పదేమో..
ఇన్నాళ్లు తను అనుకున్నట్లే పాలిస్తూ వచ్చిన కేసీఆర్‌‌కు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి దెబ్బపడుతోంది. ముఖ్యంగా ప్రజలు ఓట్ల ద్వారా సమాధానాలు చెప్పేందుకు రెడీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన దుబ్బాక బైపోల్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతతోనే ఆ చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చిందనేది వాస్తవం. మున్ముందు గ్రేటర్‌‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పటికైనా చట్టాలు చేస్తూ యూటర్న్‌లు తీసుకోకుండా.. ప్రజల కోసం ఉపయోగపడే చట్టాలు చేయాలని అందరూ కోరుకుంటున్నారు.

-శ్రీనివాస్.బి