ఈ క్రమంలో కొండపల్లి సీతారామయ్య వర్గానికి చెందిన యువకులు గ్రామగ్రామాన తిరుగుతూ అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్య వంతుల్ని చేశారు. గ్రామగ్రామాన రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేశారు. వెట్టిచాకిరి నిర్మూలన, పాలేరులకు జీతాలు పెంచడం, పశువుల కాపరులకు జీతాలు చెల్లించడం, దున్నేవాడిదే భూమి అంటూ వారిలో చైతన్యం రగిలించారు. గ్రామ పెద్దల ఇళ్లలో కూడా ఉచితంగా సేవ చేయడం బంద్ పెట్టించారు. రైతు కూలీ సంఘాల ఐకమత్య ప్రదర్శన కోసం జగిత్యాల పట్టణంలో పాత బస్టాండ్ సమీపాన గల ప్రభుత్వ కాలేజీ మైదానంలో కొండపల్లి సీతారామయ్య వర్గం 1978 సెప్టెంబర్ 9న బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో కొంత భాగం రైతు కూలీ సంఘాలను సభ్యుల సభ్యులు, ప్రజలను తరలించడానికి పక్కాగా కార్యాచరణ సిద్ధం చేశారు.
Also Read: సామాజిక, మతపరమైన విద్యా అసమానతలు
భూమి కోసం, భుక్తి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం, దున్నేవాడిదే భూమి, వ్యవసాయ కూలీలు, ధరలు పెంచాలని, తదితర డిమాండ్లను సాధించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. దీనికి అనుగుణంగానే గ్రామాల్లో ప్రచారం చేశారు. దాదాపు మూడు లక్షలకు పైగా రైతుకూలీలు ఈ సభకు తరలివచ్చారు. ఎలాంటి వాహన సౌకర్యాలు, రహదారులు, వసతులు, సమాచార వ్యవస్థ లేని ఆ సమయంలో జరిగిన ఈ బహిరంగ సభకు ‘జగిత్యాల జైత్రయాత్ర’గా నామకరణం చేశారు. మల్లోజుల కోటేశ్వర రావు, శీలం నరేష్, నల్లా ఆదిరెడ్డి, ముంజల రత్నయ్య, ఖైరి గంగారాం, మాదాసు వేణుగోపాల్, బద్దం శంకర్ రెడ్డి, సాయిని ప్రభాకర్, ముప్పాళ లక్ష్మణ రావు, తుషార్ భట్టాచార్య, విశ్వేశ్వర రావు, కల్లూరి నారాయణ, చిరంజీవి, డాక్టర్ రవీంద్రనాథ్, పోశెట్టి, లంక పాపిరెడ్డి, మల్ల రాజిరెడ్డి, తదితరులు గ్రామగ్రామాన తిరుగుతూ జనసమీకరణ చేపట్టారని నాటి ప్రముఖులు చెబుతుంటారు. ముక్కు సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రజా యుద్ధనౌక గద్దర్ గజ్జ కట్టి వేదికపై ఆడిపాడి సభికులను ఉర్రూతలూగించారు.
రైతు కూలీల సమీకరణతో.. సభ నిర్వహణతో అణగారిన వర్గాల్లో ప్రశ్నించే దమ్ము ధైర్యం వచ్చాయి. అది నేటికీ కొనసాగుతున్న చర్చ. దీంతో ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మార్చిన జైత్రయాత్రగా విశిష్ట స్థానం ఉంది. ఇదే సమయంలో జిల్లాలో మానవ హక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాలు, దళిత సాహిత్యం, పురుడు పోసుకున్నాయి. అన్ని రంగాలలో అణిచివేతకు గురైన ఈ ప్రాంతం పల్లె ప్రజలు తమపై జరుగుతున్న దాడులను చేసిన పనికి కూలీ చెల్లించండి అని ప్రశ్నించే దమ్ము, ధైర్యం జైత్రయాత్ర ప్రసాదించిందని విషయం జగమెరిగిన సత్యం.
Also Read: అక్బరుద్దీన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్
ఈ నేపథ్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1978–79 సంవత్సరంలో ఈ ప్రాంతంలో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీసు బలగాలను గ్రామాల్లోకి దించింది. క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రైతు కూలీ సంఘం సభ్యులు గెరిల్లా దళాలను ఏర్పాటు చేశాయి. గ్రామాల్లో మిలిటెంట్ వ్యవస్థను రూపొందించాయి. గ్రామ బహిష్కరణ, భూములు దున్నకపోవడం, పాలేరులను బంధు పెట్టించడం, ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటూ, 1980 లో కొండపల్లి సీతారామయ్య వర్గం ఈ ఉద్యమానికి ‘పీపుల్స్ వార్’గా నామకరణం చేసింది. ఉద్యమాన్ని విస్తరించింది. ఛత్తీస్‌గఢ్, బీహార్, బెంగాల్, ఒరిస్సా, మిడ్నాపూర్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పట్టు సాధించిన పీపుల్స్ వార్.. నాటి జైత్రయాత్ర నిర్వాహకులే 2004 సెప్టెంబర్‌లో బీహార్ మావోయిస్టు పార్టీతో ఒప్పందం చేసుకుని ‘మావోయిస్టు పార్టీ’గా రూపాంతరం చెందారు. ప్రస్తుతం ఆ పార్టీ అగ్రనేతలుగా కొనసాగుతున్నారు. అనేక సందర్భాల్లో తాము అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికకు జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తి అని, తమ ఉద్యమానికి ఓ పాఠశాల అని, అదే ఉద్యమ ఉద్ధృతికి ప్రయోగశాల అని చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. నాటి ఈ జైత్రయాత్రను జనజీవన స్రవంతిలో కలిసిన పలువురు మాజీ మావోయిస్టులూ నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నారు.