Nagoba Jatara: గిరి జన జాతరకు వేళయింది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం అవుతుంది. ఇందుకు ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం ముస్తాబైంది. తమ ఆరాధ్యదైవం నాగోబాకు అంగరంగ వైభవంగా మహాపూజ నిర్వహించేందుకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి 10.30 గంటలకు పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకిస్తారు. అనంతరం మహాపూజతో జాతర ప్రారంభమవుతుంది. అధికారికంగా నిర్వహించే ఈ జాతర ఫిబ్రవరి 15వ తేదీ వరకు కొనసాగనుంది. మహాపూజకు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన దర్బార్ నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, ఇతర అధికారులు ఇందులో పాల్గొంటారు.
సంప్రదాయ పూజలివే..
జన్నారం మండలం గోదావరి హస్తిన మడుగు నుంచి సేకరించిన పవిత్ర గంగాజలంతోపాటు నాగోబా ప్రతిమలు, పూజసామగ్రితో వచ్చి మర్రిచెట్టు వద్ద మెస్రం వంశీయులు బస చేశారు. ఫిబ్రవరి 9న ఉదయం వీరు కేస్లాపూర్‌లోని నాగోబా మురాడి వద్దకు డోలు, పెప్రే, కాలికోమ్ వాయిద్యాల మధ్య శోభాయాత్రగా చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రధాన్ కితకు చెందిన మెస్రం వంశీయులు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తారు. మహాపూజకు అవసరమయ్యే సిరికొండ నుంచి తీసుకువచ్చిన మట్టి కుండలను 22 కితల మెస్రం వంశం మహిళలకు అందిస్తారు. మెస్రం మహిళలు ఈ సందర్భంగా వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. కొత్త కుండలతో మర్రి చెట్టు వద్ద గల కోనేరు నుంచి పవిత్ర జలం తీసుకువచ్చాక నాగోబా ఆలయం పక్కనే ఉన్న పాత పుట్టను వంశ అల్లుళ్లు తొలగిస్తారు. వంశ మహిళలు, ఆడపడుచులు కొత్త పుట్టలు తయారు చేస్తారు. అనంతరం కొత్త పుట్టల మట్టితో ఉండలు చేసి నాగోబా ఆలయం పక్కనే గల సతి దేవత ఆలయంలో బౌలను తయారు చేస్తారు. ఈ పూజ శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. అనంతరం మర్రిచెట్టు వద్ద బస చేసిన మెస్రం వంశీయులు నాగోబా ఆలయం పక్కనే గల ప్రత్యేక కట్టడం గోవడ్ వద్దకు చేరి కితల వారీగా బస చేయనున్నారు. అక్కడి నుంచే నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు.
మహాపూజ ఇలా..
సంప్రదాయ పూజలు ముగించాక మెస్రం వంశీయులు పుష్యమాసం అమావాస్యను పురస్కరించుకుని హస్తిన మడుగు నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయం, విగ్రహానికి అభిషేకం చేస్తారు. రాత్రి 10.30 గంటలకు మహాపూజ ప్రారంభిస్తారు. ఇందులో వంశంలోని పెద్దలు మినహా ఇతరులను అనుమతించరు. మహాపూజ అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులకు మహాపూజ హారతి అందించి ఆహ్వానిస్తారు. మహాపూజతో జాతర ప్రారంభమైనట్లు మెస్రం వంశీయులు ప్రకటిస్తారు.
కొత్త కోడళ్ల బేటింగ్
మహాపూజ అనంతరం రాత్రి ఒంటిగంట తర్వాత గోవడ్ నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయానికి చేరుకుని బేటింగ్ (నాగోబా దేవత పరిచయం) ప్రారంభిస్తారు. నాగోబా సన్నిధికి కొత్త కోడళ్లు తెల్లటి దుస్తులు ధరించి వస్తారు. బేటింగ్‌కు వచ్చిన కోడళ్లతో నాగోబా ఆలయం పక్కనే ఉన్న సతి దేవత ఆలయంతో ప్రత్యేక పూజలు చేయిస్తారు. అనంతరం కొత్త కోడళ్లు వంశ పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ప్రక్రియ అనంతరం కొత్త కోడళ్లు పూర్తిగా తమ వంశంలో చేరినట్లు మెస్రం పెద్దలు భావిస్తారు. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది.
పెర్సపేన్, బాన్ దేవతలకు పూజలు
మహాపూజ అనంతరం మెస్రం వంశీయులు ఆలయం వెనుక పెర్సపేన్ (పెద్ద దేవుడు), బాన్ దేవతలకు పూజలు నిర్వహించనున్నారు. వంశంలోని పురుషులు పెర్సపేన్ (పెద్ద దేవుడు)కు పూజలు చేసి నైవేద్యం సమర్పించనున్నారు. ఈ పూజల్లో వంశంలోని పురుషులు మాత్రమే పాల్గొంటారు. ఇదే సమయంలో పక్కనే మెస్రం మహిళలు, బేటింగ్ అయిన కొత్త కోడళ్లు బాన్ దేవతకు పూజలు చేస్తారు. మర్రిచెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి పవిత్ర జలం తీసుకువచ్చి పాత బాన్ దేవతలను తొలగించి కొత్త బాన్ దేవతలను తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
గోవడ్ ముందు బేతల్ పూజలు
మహాపూజతోపాటు సంప్రదాయ పూజలు ముగించాక మెస్రం వంశీయులు ప్రత్యేక కట్టడమైన గోవడ్ ముందు బేతల్ పూజలు నిర్వహించనున్నారు. బేతల్ పూజలో ప్రధాన్ కితకు చెందిన మెస్రం వంశీయులు, కొత్తగా బేటింగ్ అయిన కొత్త కోడళ్లు, వంశ మహిళలు కానుకలు అందిస్తారు. అనంతరం వంశం పెద్దలు వెదురు కర్ర పట్టుకుని బేతల్ నృత్యాలు చేస్తారు. బేతల్ నృత్యాలతో నాగోబా పూజలు ముగించి ఉట్నూర్ శ్యామ్‌పూర్ బుడుందేవ్ ఆలయానికి బయల్దేరి వెళ్తారు.