కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రావడం గగనమైన పరిస్థితుల మధ్య, మోహన్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న తాజా సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. కాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ను రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే, రేపు ‘పెదరాయుడు’ విడుదల తేదీ కావడం విశేషం. ఈ సందర్బంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ‘1995లో జూన్ 15న ‘పెదరాయుడు’ విడుదలైంది.
ఇప్పుడు మళ్ళీ 26 సంవత్సరాల తర్వాత, పెదరాయుడు రిలీజ్ అయిన రోజునే ‘సన్ ఆఫ్ ఇండియా’లోని మొదటి లిరికల్ వీడియో విడుదల కానుండటం శుభ సూచికంగా భావిస్తున్నాము. అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నేను నిర్మాత అయితే… ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’కు నా కుమారుడు విష్ణు నిర్మాత కావడం నాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది.
ఇక ఈ సినిమా కోసం 11వ శతాబ్దానికి చెందిన రఘువీర గద్యాన్ని, ఇళయరాజా సంగీత సారధ్యంలో రాహుల్ నంబియార్ స్వరంతో లిరికల్ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ పాటను శ్రీ రామునికి అంకితం ఇస్తున్నాను’ అంటూ మోహన్ బాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం మోహన్ బాబుకి సక్సెస్ లేకపోయినా, ఇప్పటికీ ఆయన నటన, అలాగే ఆయన వాచకం వైవిధ్యమే.
మోహన్ బాబుకి స్టార్ హీరో ఇమేజ్ ఉన్న రోజుల్లో.. ఆయన సినిమాలకు విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ, గత ఇరవై ఏళ్లుగా మోహన్ బాబు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావికం చూపలేకపోతున్నాయి. మరోపక్క పెరిగిన వయసు, పైగా వారసుల వైఫల్యాలు, లాంగ్ గ్యాప్ మొత్తానికి మోహన్ బాబు తన వైభోగాన్ని కోల్పోయారు. మరి ‘సన్ ఆఫ్ ఇండియా’తోనైనా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాడేమో చూడాలి.