Lal Salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ‘జైలర్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాల్ సలామ్’ సినిమాలో రజినీకాంత్ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారన్న సంగతి తెలిసిందే.
భారీ చిత్రాలను రూపొందిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘లాల్ సలామ్’ సినిమా వస్తోంది. రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో విక్రాంత్,విష్ణు విశాల్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. సాలిడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి చిత్రం వస్తుండగా ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అలాగే విష్ణు రంగస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నప్పటికీ ఎటువంటి హైప్ లేదని తెలుస్తోంది.
లాల్ సలామ్ సినిమా ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ క్రమంలో వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 9) తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
అయితే జైలర్ వంటి సూపర్ హిట్ మూవీ తరువాత రజనీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో లాల్ సలామ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ముంబై బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మూవీ కావడం కూడా విశేషమని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ గా ఉంటున్న హిందూ ముస్లిం యువకులు వారు అమితంగా ఇష్టపడే క్రికెట్ ఆటలో మతం పేరుతో గొడవలు చెలరేగితే ఓ వ్యక్తి ఎలా సర్దుబాటు చేశారనే కథాంశంతో రూపొందిందని తెలుస్తోంది.