SS Rajamouli: రాజమౌళి ఆత్మవిశ్వాసం, తన సినిమాపై తనకున్న నమ్మకం ఆస్కార్ తెచ్చిపెట్టాయి. ఒక కమర్షియల్ సినిమాకు ఆస్కార్ రావడం చాలా కష్టం. విజువల్స్, స్టంట్స్, సినిమాటోగ్రఫీ వంటి సాంకేతిక అంశాల్లో మాత్రమే కమర్షియల్ చిత్రాలు ఆస్కార్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో పోల్చుకుంటే మనం ఎక్కడో ఉన్నాం. వాళ్లతో మనం పోటీపడలేమన్నది ఒప్పుకోవాల్సిన నిజం. హాలీవుడ్ లో మూడు దశాబ్దాల క్రితం తెరకెక్కిన చిత్రాల సాంకేతిక, నాణ్యత మనం ఇప్పటికీ సాధించలేకపోయాం.

కాబట్టి ఆస్కార్ పై ఆశలు పెంచుకోవడం, దాని కోసం గుడ్డిగా కోట్లు ఖర్చు పెట్టడం అతిపెద్ద సాహసం. ఆస్కార్ గెలవడం అటుంచితే… నామినేషన్ కూడా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇది ఏ పది మందినో ఇరవై మందినో మెప్పించే విషయం కాదు. వరల్డ్ వైడ్ ఆస్కార్ జ్యూరీ సభ్యులు వేలల్లో ఉంటారు. వారి ఓట్ల ఆధారంగానే ఆస్కార్ నామినేషన్, అవార్డు ఎంపిక జరుగుతుంది. కాబట్టి మనం చేసిన ప్రయత్నానికి ఒక్కోసారి నామినేషన్ కూడా దక్కకపోవచ్చు.
అందులోనూ ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఇండియా నుండి ఆస్కార్ అధికారిక ఎంట్రీ దక్కలేదు. ఇండియన్ జ్యూరీ సభ్యులు తిరస్కరించినప్పటికీ రాజమౌళి మొండిగా ముందుకు వెళ్ళాడు. అధికారిక ఎంట్రీ దక్కపోవడం వలన ఆస్కార్ ఎంట్రీ క్లిష్టమైంది. ఏదేమైనా కానీ ఆస్కార్ బరిలో నిలవాల్సిందే. మన సినిమాకు ఆస్కార్ వస్తుంది. రాకపోయినా పర్లేదు ప్రయత్నం మాత్రం వీడేది లేదని రాజమౌళి పట్టుదల చూపించారు.
రాజమౌళి నమ్మకం వమ్ము కాలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకున్న నాటు నాటు అవార్డు గెలిచి సత్తా చాటింది. ఆ విభాగంలో ఆస్కార్ గెలిచిన ఇండియన్ మూవీగా చరిత్ర లిఖించింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేయనందుకు విమర్శలు వినిపించాయి. రాజకీయ ఒత్తిడులు కారణంగానే ఆర్ ఆర్ ఆర్ ని కాదని చల్లో షో చిత్రానికి అవకాశం ఇచ్చారన్న వాదన వినిపించింది. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలవడం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యులకు చెంప పెట్టు. వారిది ఎంత తప్పుడు నిర్ణయమో తెలియజేసింది. రాజమౌళి తన గురి ఎన్నటికీ తప్పదని నిరూపించాడు.