ఇక ఈ ఉప ఎన్నికలో అధికార వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, విపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ–జనసేన కూటమి తరఫున రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బరిలో నిలిచారు. వీరిలో గురుమూర్తి రాజకీయాలకు కొత్త. ఇంతవరకు ఆయన రాజకీయాల్లో లేరు. అంతేకాదు.. ఇప్పుడున్న క్యాండిడేట్లలో అతి చిన్న వయస్కుడు కూడా ఆయనే. ఆర్థికంగానూ అందరితో పోల్చితే అతి సామాన్యుడు.
తిరుపతి లోక్‌సభ స్థానం ముందు నుంచీ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీనే గెలుపొందింది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. అయితే.. ఇప్పుడు కూడా తమ గెలుపు నల్లేరు మీద నడకలాగే భావిస్తున్న వైసీపీ.. భారీ మెజార్టీపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. మరోవైపు.. విపక్షాలు మాత్రం వైసీపీ ఆశయాన్ని భారీగా దెబ్బతీయాలని పోరాడుతున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,28,576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. ఆరు నియోజకవర్గాల్లోనూ దుర్గాప్రసాద్ తన సత్తా చాటారు. ఒక్క తిరుపతిలో మాత్రం పనబాక లక్ష్మి పోటీ ఇవ్వగలిగారు. ఈసారి రెండో స్థానంలో నిలుస్తామంటున్న బీజేపీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బొమ్మి శ్రీహరిరావుకు మొత్తం 16,125 ఓట్లు మాత్రమే లభించాయి. ఆ ఎన్నికల్లో జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావుకు 20,971 ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలో జనసేన బీజేపీని బలపరుస్తోంది. ఈ క్రమంలో ఈ కూటమి అభ్యర్థి రత్నప్రభకు ఎన్ని ఓట్లు వస్తాయా అని ఆసక్తి నెలకొంది. ఇక టీడీపీ సంగతి పెద్దగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఆ పార్టీకి ఆర్థిక బలం లేకుండా పోయింది. ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు.. భారీ మెజార్టీతో గురుమూర్తిని గెలిపించి తమ అధినేతకు గిఫ్ట్ ఇవ్వాలని ఇక్కడి ఎమ్మెల్యేలు తాపత్రయపడుతున్నారు.