
‘బాహుబలి’ దెబ్బకు ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత తీసిన ‘సాహో’ సినిమా అంతగా తెలుగులో ఆడకున్నా బాలీవుడ్ లో బాగానే కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రభాస్ తను తదుపరి చిత్రంగా ప్రేమకథను ఎంచుకున్నారు. ‘రాధేశ్యామ్’తో ప్యాన్ ఇండియా లెవల్లో వస్తున్నారు.
ఇక రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు వెంటనే ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలను ప్రభాస్ పట్టాలెక్కించాడు. ఆ సినిమాలు లైన్లో ఉండగా.. తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్-కే’ను మొదలుపెట్టాడు. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొణేలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికకీ స్థానం ఉందని.. ఆమెది డీ గ్లామర్ పాత్ర అని అంటున్నారు.ఆ పాత్రలో సమంత నటించబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలకు పాత్రలుంటాయని.. ఈ మేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ కథ రెడీ చేశారని సమాచారం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి ఇద్దరు హీరోలు కొద్దిసేపు కనిపిస్తారని.. ఆ పాత్రల్లో దక్షిణాది ఇతర హీరోలు కానీ..లేదంటే ఇదివరకు నాగ్ అశ్విన్ సినిమాల్లో నటించిన నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లను చిన్న పాత్రలకు తీసుకోవాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడట.. మరి చివరకు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.