Manchu Vishnu: ‘మా` అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక మంచు విష్ణు తనదైన ఆలోచనలతో ముందుకు పోతున్నాడు. ‘మా’ సంస్థలో అలాగే తెలుగు సినిమా పరిశ్రమలో తన మార్క్ ని చూపించాలని, ముఖ్యంగా తాను ఇచ్చిన హామీలను అమలుపరచాలని మంచు విష్ణు తెగ తాపత్రయపడుతున్నాడు. అయితే, `మా` బై లాస్ లో కొన్ని అంశాలను, అలాగే కొన్ని పద్దతులను పూర్తిగా మార్చాలని విష్ణు ప్లాన్ చేస్తున్నాడు.

ఈ క్రమంలో అసలు బై లాస్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయి…? అలాగే ఆ అంశాలలో ఏ అంశం ఎలా దుర్వినియోగపడుతుంది ? అని విష్ణు తన టీమ్ తో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక మరోపక్క `మా` సభ్యులకు మేలు చేసేలా కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే నటీనటుల పై అనవసరమైన పుకార్లను పుట్టిస్తోన్న యూ ట్యూబ్ ఛానల్స్ పై దృష్టి సారించి.. వాటి పై చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నాడు.
నిజానికి కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం అనవసరమైన అవాస్తవమైన విషయాలను పుట్టిస్తూ వైరల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఛానెల్స్ అడ్డదారులు కూడా తొక్కుతున్నాయి. ముఖ్యంగా లోపల కంటెంట్ ఒక్కటి ఉంటే.. పైన హెడ్డింగ్ మరొకటి ఉంటుంది. దీనికితోడు కొన్ని ఛానల్స్ అయితే.. డైరెక్ట్ గానే పేర్లు పెట్టేస్తూ విచ్చలవిడిగా రూమర్స్ ను ప్రచారం చేస్తున్నాయి.
దాంతో నటీనటుల ప్రతిష్టకు, వాళ్ల గౌరవానికి భంగం కలుగుతుంది. ఆ కారణంగానే అన్నిటికి మించి ముందుగా ఈ విచ్చల విడి పుకార్ల రాయుళ్లను పట్టుకుని, వారిని అదుపులో ఉంచడానికి విష్ణు బృందం బాగా కసరత్తులు చేస్తోంది. అయినా ఓ వార్త పై ఎలాంటి ఆధారాలు లేకుండా.. అసలు అందులో నిజాలు లేవు అని తెలిసి కూడా కేవలం వ్యూస్ కోసమే పుకార్లని ప్రచారం చేయడం కచ్చితంగా తప్పే.
ఇక తన కమిటీ గుర్తించిన కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పై కేసు వేయడానికి విష్ణు రెడీ అయ్యాడు. ఇప్పటికే యూ ట్యూబ్ ఛానళ్ల పై ఫిర్యాదుల్ని స్వీకరించి, న్యాయవాదుల ద్వారా కోర్టులో పిటీషన్ వేయడానికి కూడా డేట్ ఖరారు చేసుకున్నాడు. విష్ణు ఆలోచన బాగుంది. కాకపోతే.. యూ ట్యూబ్ ఛానళ్లపై నియంత్రణ అనేది సాధ్యమేనా ? వాస్తవానికి ఇదే విషయంలో గతంలో చాలామంది కోర్టు మెట్లు ఎక్కారు. అయితే వాళ్లకు ఆశాజనంగా ఫలితాలు రాలేదు. మరి ఇప్పుడు విష్ణు ఆలోచన ఆచరణలో సాధ్యమేనా ?