Ponniyin Selvan: నేను చూసొచ్చిన ఐటమ్ సాంగులో ఐటమ్ లా నువ్వెందుకు లేవని ఇంట్లో ఇల్లాలిని ఇరగ్గొట్టినట్టుగా ఉంది కొందరి సంస్కారం. పొన్నియన్ లోతు తెలియని లేత మేధావులు కొందరు బాహుబలితో పోల్చడం చూస్తున్నాక… మనమేంటో మన చరిత్రేంటో, మన వర్తమానం ఏంటో, మనకి అసలు అవమానం అంటే ఏంటో … చెప్పక తప్పదనిపించింది. మనోభావాలు మడతెట్టి లోపలెట్టి, అరవోళ్లు అంతే – లాంటి మాటలు కాసేపు కట్టిపెట్టి అద్దంలో చూసుకున్నట్టు యదార్థం మాట్లాడుకుందాం !

ఫక్తు పైసా వసూల్ కోసం పుట్టిన కమర్షియల్ పిట్టకథ బాహుబలి. చరిత్ర కాదు కదా కనీసం జాగ్రఫీ కూడా లేదు అందులో ! అగంతకులతో పోరాటం చేసుకుంటూ హీరో మంచుకొండల్లోకి చొచ్చుకుపోతాడు ఓ చోట. అప్పటి వరకూ దక్షిణ భారతంలో జరుగుతోందేమో ఆ సినిమా అనుకునేవాళ్లు కాస్తా ఉలిక్కిపడి సర్దుకుంటారు. ఎందుకంటే మాహిష్మతి ఉటోపియన్ క్రియేషన్ కాబట్టి. అది దర్శకుడు తీసుకున్న కంఫర్ట్ అది. మరో సందర్భంలో, కాలకేయుల సైన్యం వంద వేలు అని రమ్యక్రిష్ణ అండ్ కో కంగారు పడతారు. అదేంటి మాహిష్మతి మహా సామ్రాజ్యం అన్నారు కదా, వీళ్ల సైన్యం లక్ష కూడా లేదా అనే లాజిక్ మనకి తట్టదు. ఎందుకంటే దర్శకుడు తీసుకున్న ఎలివేషన్ మెథడ్ అట్లాంటిది. సామ్రాజ్యం మాట వచ్చినప్పుడేమో మహా… అని సాగదీసి తాను వేయించిన సెట్ ఎంత గొప్పదో గ్రాండియర్ లుక్ ఇస్తాడు. సైన్యం పదివేలే అయినా హీరోలు లక్షమందిని మడత పెట్టేశారు అని గొప్పగా చెప్పేందుకు అక్కడ నంబర్ తగ్గిస్తాడు. అక్కడ బేలన్స్ కాదు… కమర్షియల్ కొలతలే ముఖ్యం. ఎందుకంటే అది కమర్షియల్ కాన్వాస్ మీద గీసిన ఓ ఊహా చిత్రం. బాహుబలిని తక్కువ చేయడానికో, రాజమౌళి ఆలోచనలకు లోతు లేదు, వసూళ్ల యావ తప్ప అనడమో ఇక్కడ ఉద్దేశం కానే కాదు. బలికి, పొన్నికి పోలిక ఎందుకు ఉండదో వివరించడం మాత్రమే ఉద్దేశం.
చోళుల నిర్మాణ శైలి గొప్పది
చోళుల కోట అలాంటిదా, అంత దిగనాసిగా చూపించాడు మణి అంటారు ఇంకొందరు. నిజానికి చోళ నిర్మాణాలు పిరమిడ్లను తలదన్నే అద్భుతాలు. 900 టన్నుల రాయిని ఆకాశాన్ని తాకే ఎత్తులో గాలి గోపురంగా నిలిపిన ఘనత తంజాఊరుది. వెయ్యేళ్లు దాటి వందల ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెదరకపోవడానికి కారణం నిర్మాణ నైపుణ్యమే ! అదే ధీమ్ సినిమాలో అక్షరాలా కనిపించింది. నున్నని రోడ్లు, సిమెంటుతో వేశారో ఇంకేదైనా పూశారో తెలియని చోట్ల పుల్లలు ఏరే పులిహోర సన్నివేశాలు ఉండవ్ అందుకే ! పొన్నియన్ కథ వాస్తవాల పిల్లర్లపై నిలిచిన కల్పనాత్మక కథనం. అంటే జరిగింది అక్షరాలా నిజం. కథ ఉన్నదే. కానీ కథనం మాత్రం దర్శకుడు రాసుకున్నది. చోళ పాండ్యుల పోరాటం కాస్త అయినా తెలిసి ఉంటే సులువు. లేదూ, ప్రపంచంలో అతి ఎక్కువ కాలం పాటు నిలిచిన సామ్రాజ్యాల్లో చోళ సింహాసనం కూడా ఒకటన్న ముచ్చట చూచాయగా తెలిసినా, రాజనీతి, ఎత్తుగడలు, కుంత్రకుతంత్రాలూ ఎంజాయ్ చేయగలం. మణిరత్నం ప్రయత్నం కచ్చితంగా అందుకోసమే !
ముసలానికి కారణం అది
“నీ అందం నా ఆలోచనల్ని ఆక్రమించి నీ తెలివిని మసకబారేలా చేస్తోంది, నన్నెం చేయమంటావ్” అంటాడు పెరియ పళువెట్టరాయుడు. అదీ అసలు ముసలానికి కారణం. నందిని కారెక్టర్ అది. రియల్ గా కూడా, వాస్తవం మాట్లాడితే ఐశ్వర్యారాయ్ ది అందం కాదని, ఆమె రూపు రేఖలను సౌందర్యం అనాలనీ మణిరత్నం ఫ్రేమింగ్ మళ్లీ మళ్లీ చెబుతుంది మనకి. వెచ్చటి సూర్యోదయంలా, పచ్చటి ప్రకృతిలా నిరంతరం అనుభూతిని పంచి – ఆర్చర్యపరిచేది సౌందర్యమే! అందం కాదు. సౌందర్యంలో నటన, నిపుణత, ప్రజన్స్, గాఢత, మాగ్నానిమిటీ లాంటివెన్నో ఉంటాయ్. ఆ వన్నెలకు అధినేత్రి ఐశ్వర్యే అని మణి ఇచ్చిన మరో స్టేట్ మెంట్ … నందిని కేరెక్టర్. యువరాణి త్రిష ఎదురుపడినప్పుడు, కనిపించే డ్యూయెల్ క్లోజప్ ఒక్కటి చాలు మణిరత్నం ఎందుకు స్పెషలో ఈ జనరేషన్ తెలుసుకోడానికి ! అర్థం చేసుకునే ఆర్టిస్టిక్ ఐ ఉండాలంతే !
కార్తీ కేరెక్టర్ కి తనికెళ్ల భరణి రాసిన తెలుగు డైలాగుల్లో మార్మికత, లంక సింహాసనాన్ని అధీష్టించమని బౌద్ధ భిక్షువులు కోరినప్పుడు పొన్నియన్ చెప్పే సమాధానంలో కనిపించే అక్కర, తమ్ముడు పొన్ని పరాక్రమం మీద నమ్మకంతోనే ఆదిత్యుడు తనదైన ధోరణిలోకి వెళ్లిపోయిన మహా వీరుడని దర్శకుడు చెప్పిన తీరులో మెచ్యురిటీ మెస్పరైజ్ చేస్తుంది. త్రిష చేసిన కుందవి పాత్ర చూస్తే మనకి లోలోపల అర్థమవుతూ ఉంటుంది, జయ లాంటి నాయకురాళ్లు తమిళనాడులోనే ఎందుకు ఉంటారో, కనిమొళి లాంటి వాళ్లకి బహుముఖ చాతుర్యం ఎలా వచ్చిందో అని !

వారసత్వ విశిష్టతను, చరిత్ర మీదున్న మమకారాన్ని మణిరత్నం మూవీగా మలిచాడంతే ! తమిళుల అభిరుచి మీద నమ్మకం, భారీ సినిమాలు చేస్తున్న వసూళ్లు ఇన్నాళ్లకు ధైర్యమిచ్చాయ్. అందుకే నిర్మాణ బాధ్యతలు కూడా పంచుకొని రంగంలోకి దిగాడు.
ఇక మన విషయానికొద్దాం ! చరిత్ర మీద అభిమానం, అభినివేశం కానీ, మన ప్రత్యేకతను ప్రపంచానికి చాటాలన్న తపన కానీ తక్కువ మనకి. అందుకే, పశ్చిమాన నేటి రాజస్థాన్ ప్రాంతాన్ని కూడా ఓ తెలుగు రాజు గెలిచాడు అని సినిమాలో చూపిస్తే… బాలక్రిష్ణ ఫిట్నెస్ గురించి కామెంట్లు చేసి… అసలు విషయం వదిలేసిన వాళ్ళం మనం. మనకి పార్టీలు కావాలి. కులాలు ఉండాలి. సమర్థత లేకపోయినా వారసుల్ని నెత్తిన మోయాలి. నత్తి పత్తిత్తుల పెత్తనంలో పరవశించాలి. ఏ పార్టీ అయినా ఏ భావజాలం అయినా దీనికి అతీతం కాదు. మనం అంత డెలికేట్ కాబట్టే రాజధానికి కూడా దిక్కులేని జాతిగా మిగిలాం. ఈ పరిణామ క్రమం ఇప్పటిది కాదు.
మనం విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాం. మనకి హంపితో సంబంధం లేదు ఇప్పుడు. దేశ భాషలందు తెలుగు లెస్స .. లాంటి పడిగట్టు ఉదాహరణలు మాత్రమే పోగేసుకున్నాం. అంతకు ముందెప్పుడో చోళ సామ్రాజ్యంలోనూ మనం భాగం అయ్యుంటాం. కళింగను కూడా జయిస్తా అంటాడు అందుకే ఆదిత్యుడు ఈ సినిమాలో ! అంటే ఇది మన కథ కూడా చాలా వరకూ ! కానీ ఓన్ చేసుకునే కనెక్ట్ లేదు. అంతెందుకు, 1600 సంవత్సరం తర్వాత నిర్మాణమైన మద్రాసు పట్టణానికి మూలం మనమే ! ఆ విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ సంబంధాలూ లేవు. ఎందుకంటే ప్రతీ చోట నుంచి తరిమేస్తే కొత్త పొద్దులు వెదుక్కున్నాం మనం. మన మూలాలు, వాస్తవాలు, ప్రాసస్త్యం , ప్రస్థానం లాంటి వాటిపై మనకి మక్కువ తక్కువ. కులాలు , కుమ్ములాటలు , బొక్కలు వెదికే నక్క బుద్ధి మన సొంతం. అందుకే కసి ఉండదు మనకి. మసిగా మారుతుంటాం – వందేళ్లకో, యాభైయ్యేళ్లకో ! ఇంతెందుకు, మన చరిత్ర, మన నగరం అనుకున్న అమరావతినే ప్రేమించలేదు మనం. అఫ్ కోర్స్ ఆ నమ్మకం , మానసిక హక్కు కల్గించలేకపోయిన రాజకీయ అసమర్థత ఎవరిది అనేది పూర్తిగా పొలిటికల్ చర్చ. అదిక్కడ అప్రస్తుతం. అలాంటి మనకి ఆ చోళ ధూళి విశిష్టత ఏం తెలుస్తుంది? నిజమే కదా !
రహెమాన్ బీజీఎం తేలిపోవడం, పాటలు మళ్లీ పాడుకునేంత రిథమిక్ గా లేకపోవడం లాంటివి పక్కన పెడితే పొన్నియన్ అద్భుతం. తమిళులకు తమ చరిత్ర భాష సంస్కృతి మీద అంత ప్రేమ ఎందుకో, రాజకీయాలు ఎంత దిగజార్చాలని చూసినా వారెందుకు అగ్రస్థానంలో కొనసాగుతున్నారో, అన్ని ప్రాంతాల మధ్య అంతటి సమన్వయం ఎందుకుందో – పొన్నియన్ చరిత్రను వర్తమానానికి అప్లై చేసుకుంటే అర్థం అవుతుంది. ఇది చరిత్ర నుంచి ఊడిపడిన సెల్యులాయిడ్ ఘట్టం.
రెండో పార్టు ప్రత్యేకత ఏంటో ఆఖరి 10 సెకన్లలో చూపించాడు. సున్నితత్వం ఉంటే అర్థమైపోతుంది. ఇంత చెప్పుకున్నాక ఇక ఆఫ్టర్ ఆల్ బాహుబలితో పోల్చకండి. ఇది వసూళ్ల కోసం వచ్చిన ఊతకొట్టుడు కానేకాదు.