NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలైన విషయం తెలిసిందే. 100 రూపాయల ముఖ విలువ కలిగిన ఈ నాణాన్ని సొంతం చేసుకోవడానికి తెలుగు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఎలా సొంతం చేసుకోవాలి? దానికోసం ఏం చేయాలి? అన్న విషయం చాలామందికి తెలియదు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రించిన ఈ నాణాన్ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన మింట్ వెబ్ సైట్ లో ఆర్డర్ చేయడం ద్వారా గానీ.. లేకుంటే మింట్ కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేసే అవకాశముంది.
ఇప్పటికే హైదరాబాదులో నాణాల విక్రయం ప్రారంభమైంది. సైఫాబాద్, చర్లపల్లి లోని మింట్ విక్రయకౌంటర్ల వద్దకు వెళ్లి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రారంభ ధర రూ. 3,500. 50 శాతం వెండితో, 40 శాతం రాగితో, ఐదు శాతం జింకుతో, మరో ఐదు శాతం నికెల్ తో దీనిని రూపొందించారు. చెక్క డబ్బాతో ఉన్న నాణాన్ని కొనుగోలు చేయాలంటే రూ. 4850, ప్రూఫ్ ఫోల్డర్ ప్యాబ హక్ తో అయితే రూ. 4850, ఈఎంసి ఫోల్డర్ ప్యాక్ అయితే రూ. 4057గా ధర నిర్ణయించారు.
నేరుగా నాణాన్ని కొనుగోలు చేయాలంటే రూ. 3500 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 12,615 నాణేలు తయారు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ బట్టి తయారీకి చర్యలు చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నాణెం బహిరంగ మార్కెట్లో చెల్లుబాటు కాదు. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ ప్రత్యేక నాణేలకు గిరాకీ ఉండే అవకాశాలు ఉంటాయి.