తరుణ్.. ఒకప్పుడు కుర్ర హృదయాలను ఉర్రూతలూగించిన హీరో. యువతుల గుండెల్లో ప్రేమను పండించిన లవర్ బాయ్. బాల నటుడిగా జాతీయ అవార్డ్ సాధించిన స్టార్. చిన్నప్పుడే తెరపై కనువిందు చేసిన హీరో. ‘నువ్వే కావాలి’.. అంటూ అందరితోనూ అనిపించుకుని.. ‘నువ్వే నువ్వే’.. అంటూ ఎందరినో పలకరించిన తరణ్.. ఆ తర్వాత తెర మరుగయ్యారు? ప్రముఖ దర్శకుడి కొడుకై ఉండి.. ఎందరికో ఆత్మీయురాలైన రోజారమణి కుమారుడై ఉండి.. తరుణ్ ఎందుకు ఇండస్ట్రీలో రాణించలేక పోయారు?

చిన్నప్పటి నుంచి సినిమాల్లో పెరిగిన వ్యక్తి తరుణ్. ఆ మాటకొస్తే.. పుట్టక ముందునుంచే సినిమా స్పర్శను చూసేశాడు. స్వతహాగానే సినిమా కుటుంబం నుంచే వచ్చాడు కాబట్టి.. ఆ లక్షణాలు సలక్షణంగా వచ్చాయి. నటి రోజారమణి, హీరో, నిర్మాత, దర్శకుడు చక్రపాణిల తనయుడిగా బాల్యంలోనే తెరంగేట్రం చేసేశాడు. చిన్న వయసులోనే పెద్ద అవార్డులు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ గుర్తుండిపోయే సక్సెస్ లే సాధించాడు. కానీ.. అనుకోకుండా తరుణ్ కెరీర్ స్లంప్ లో పడిపోయింది. ఆ తర్వాత అసలే కనిపించకుండా పోయాడు.
తరుణ్ బాలనటుడిగా తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. పేరెంట్స్ ఇద్దరూ నటులే కావడంతో వారిచ్చిన ప్రోత్సాహంతో 1990లో ఎనిమిదేళ్ల వయసులోనే వెండితెరపై మెరిశాడు. తరుణ్ తొలి సినిమా మనసు మమత. నరేష్ హీరోగా నటించిన ఆ సినిమాలో నటించి ఎవరీ పిల్లాడు.. అని చిత్రపరిశ్రమలు అందరూ ప్రశంసించే స్థాయికి చేరాడు. రెండో సినిమా సైతం నరేష్ హీరోగా నటించిన బుజ్జిగాడి బాబాయ్ అనే చిత్రంలో అవకాశం వచ్చింది. అయితే.. తరుణ్ లోని అసలైన నటుడిని టాలీవుడ్ చూసింది మాత్రం మణిరత్నం డైరెక్ట్ చేసిన అంజలి సినిమాలోనే! కొన్ని సన్నివేశాల్లో రఘువరణ్, రేవతి, ప్రభువంటి హేమాహేమీలను సైతం డామినేట్ చేసేశాడు. ఆ తర్వాత దక్షిణాదిలోనే ద మోస్ట్ టాలెంటెట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా తరుణ్ పదిలమైపోయాడు.
ఉషాకిరణ్ బ్యానర్ తరుణ్ ని హీరోగా పరిచయం చేసింది. అదే నువ్వేకావాలి. ఆ ఏడాది అఖండ విజయం సాధించి.. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది నువ్వే కావాలి. ఆ తర్వాత తరుణ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. అంతేకాదు.. హీరోగా తొలి సినిమాతోనే లవర్ బాయ్ ఇమేజ్ నూ సొంతం చేసుకున్నాడు. ఇంకేం.. తరుణ్ డేట్స్ కోసం సూట్ కేస్ లతో ఎంతో మంది నిర్మాతలు క్యూ కట్టారు…
ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమ్ ఉంది కాబట్టి తమిళ్ లోనూ హీరోగా అవకాశాలు వచ్చాయి. పున్నగైదేశమ్ అనే చిత్రంలో హీరోగా నటించినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నువ్వే కావాలితోనే రైటర్ గా ఫేమ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారిగా మెగాఫోన్ పడుతూ చేస్తున్న సినిమాకు హీరోగా తరుణ్ ను ఎంచుకున్నాడు. అదే నువ్వేనువ్వే. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో తరుణ్ ఖాతాలో మరో హిట్ చేరింది. కానీ ఆ తర్వాత తరుణ్ ఇండస్ట్రీలో హిట్ అనేదే లేకుండా పోయింది. కథలో ఎంపికలో తరుణ్ చేసిన పొరపాట్లే దీనికి కారణమని టాలీవుడ్ పెద్దలు అంటూ ఉంటారు.
సినిమా ఇండస్ట్రీ అనేది వైకుంఠపాళి. జాగ్రత్తగా అడుగులు వేస్తేనే జారిపడతాం.. అలాంటి ఏమరుపాటుగా ఉంటే ఇక అంతే. ఈ విషయం తరుణ్ కెరీర్ కు బాగా సూట్ అవుతుంది. సరైన గైడెన్స్ లేకో లేక, కాన్ఫిడెన్స్ బెడిసికొట్టిందో కానీ.. తరుణ్ తెరుమరుగైపోయాడు. నేటి కుర్రహీరోలు ఎందరికో తరుణ్ జీవితం ఓ చక్కటి గుణపాఠం.