
దర్శకధీరుడు రాజమౌళి చెక్కే సినిమాలన్నింటికి మాస్టర్ మైండ్ ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ‘బాహుబలి’ సినిమాకు కథను అందించింది కూడా ఇదే విజయేంద్రప్రసాద్ యే.. రాజమౌళి కెరీర్ లో తీసిన అన్ని సినిమాలకు ఆయనే కథను సమకూర్చారు. ఒక్క స్టూడెంట్ నంబర్ 1, మర్యాద రామన్న సినిమాలు తప్ప అన్నింటికి కథను ఇచ్చాడు. ఈ తండ్రీ కొడుకుల ద్వయం చేసే మ్యాజిక్ సినిమాకు కోట్ల రూపాయల కనకవర్షం కురుస్తుంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతుంటాయి.
తాజాగా రాజమౌళి-విజయేంద్రప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై కూడా బోలెడు అంచనాలున్నాయి. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తే దాన్ని 200 శాతం అధికంగా తెరపై చూపించగల సామర్థ్యం రాజమౌళికి ఉంది. తండ్రి విజయేంద్రప్రసాద్ రాసిన కథలు అలాగే అద్భుతంగా చూపించి వెండితెరపై రాజమౌళి మేజిక్ చేశాడు. ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాస్తున్న కథలు ఏంటనేవి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఒక టాప్ న్యూస్ చానెల్ తో మాట్లాడిన విజయేంద్రప్రసాద్ తాను రాస్తున్న కథల గురించి వివరించాడు. ‘మొదట ‘సీతమ్మ’ మీద ఒక కథ రాస్తున్నట్టు విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఈ కథ ఫిక్షన్ కాదని.. నిజజీవిత కథగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ‘రంజీత్ సింగ్ దిశాలే’ అనే ఒక మహారాష్ట్ర టీచర్ కథను రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈయన గత సంవత్సరం 2020లో ప్రపంచంలోనే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నాడు. అది కూడా 126 దేశాల నుంచి 1200 మంది ఉపాధ్యాయులు పోటీపడ్డ కఠిన పోటీ నుంచి తట్టుకొని ఈ అవార్డు సాధించాడు. టాప్ 10లో సెలెక్ట్ అయ్యి ప్రపంచనంబర్ 1 ఉపాధ్యాయుడిగా నిలిచాడు.
విజయేంద్రప్రసాద్ ఆ ఉపాధ్యాయుడి మంచి హృదయం గురించి గొప్పగా చెప్పారు. తనకి వచ్చిన నగదు బహుమతిని కూడా సగం డబ్బులు మిగిలిన 9 మంది ఉపాధ్యాయులకి సమానంగా ఇచ్చాడని.. వాళ్లు కూడా ఏమాత్రం తక్కువ కాదని అన్నాడని.. ఆ టీచర్ చేసిన గొప్ప పనులు తనకు ఈ కథ రాయడానికి స్ఫూర్తినిచ్చిందని విజయేంద్రప్రసాద్ తెలిపారు. టీచర్ రంజీత్ సింగ్ దిశాలే బయోపిక్ కథ రాస్తున్నట్టు విజయేంద్రప్రసాద్ తెలిపారు.
ఇక టైం మిషన్.. టైం ట్రావెల్ మీద ఒక కథ రాస్తున్నానని.. అది హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతుందని విజయేంద్రప్రసాద్ తెలిపారు.అలాగే రాజమౌళి-మహేష్ బాబు సినిమాకు కూడా రాయాలని.. అది వాళ్లకు నచ్చితే తీసుకుంటారు కానీ.. రాసినంత మాత్రాన తీసుకోవాలని లేదు అని అభిప్రాయపడ్డారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కథ కూడా నాది కాదు అని.. రాజమౌళి ఇచ్చిన ఐడియానే డెవలప్ చేశానని విజయేంద్రప్రసాద్ తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు అని అడిగితే విజయేంద్రప్రసాద్ అవన్నీ అబద్దాలేనని కొట్టిపడేశాడు. నేను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కు కథ చెప్పలేదని.. తను ఎప్పుడూ నేను చెప్పిన కథ వినలేదు అని.. సరదాగా చెప్పుకొచ్చారు. అవకాశం వస్తే రాయాలని ఉందని.. పవన్ కళ్యాణ్ కు తాను కూడా ఫ్యాన్ అని విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా తన సినిమా ప్రయాణాన్ని.. తను భవిష్యత్తులో రాస్తున్న కథల గురించి విజయేంద్రప్రసాద్ వివరించారు.