Veera Simha Reddy- Waltair Veerayya: సంక్రాంతి చిత్రాల ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. గట్టి పోటీ నెలకొనగా ఎవరూ తగ్గడం లేదు. ఒకరికి మించి మరొకరు జనాల్లోకి తమ చిత్రాన్ని తీసుకెళుతున్నారు. మూవీపై హైప్ తెచ్చి సంక్రాంతికి ప్రేక్షకులు తమ చిత్రం చూసేలా మోటివేట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత సంక్రాంతి పోటీ రసవత్తరంగా ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, విజయ్, అజిత్ పోటీపడుతున్నారు. కోలీవుడ్ హీరోల డబ్బింగ్ చిత్రాలు పక్కన పెడితే ప్రధాన పోటీ వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాల మధ్యే. 2017 అనంతరం మరోసారి బాలకృష్ణ-చిరంజీవి సంక్రాంతికి నువ్వా నేనా అంటున్నారు.

ఈ రెండు చిత్రాల నిర్మాతలు ఒకరే కావడం విశేషం. ఈ క్రమంలో ప్రమోషన్స్ బాధ్యత దర్శకుల మీద పడింది. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ సంగీతం ఇవ్వగా… వీరసింహారెడ్డికి థమన్ అందించారు. పోటాపోటీగా పాటలు విడుదల చేస్తున్నారు. రెండు చిత్రాల పాటలు విశేష ఆదరణ దక్కించుకుంటున్నాయి. యూఎస్ లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల ప్రీమియర్ బుకింగ్స్ మొదలయ్యాయి. సీనియర్ హీరోలిద్దరూ అక్కడ జోరు చూపిస్తున్నారు.
ఇక అతి ముఖ్యమైన ప్రీరిలీజ్ వేడుకలకు వేదికలు సిద్ధమయ్యాయి. దీని కోసం బాలయ్య ఒంగోలు ఎంచుకున్నారు. చిరంజీవి వైజాగ్ కోరుకున్నారు. జనవరి 6న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఒంగోలులో జరగనుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని ఒంగోలుకు చెందినవాడు. సినిమా నేపథ్యం కూడా ఒంగోలు పరిసర ప్రాంతాలతో సంబంధం ఉండే ఆస్కారం కలదు. ఆయన గత చిత్రం క్రాక్ ఒంగోలు నేపథ్యంలో సాగుతుంది.

ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే… మూవీ పూర్తిగా వైజాగ్ నేపథ్యంలో సాగనుంది. టైటిల్ లో వాల్తేరు వైజాగ్ నగరంలో బీచ్ ఏరియా అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకకు వైజాగ్ బెస్ట్ ప్లేస్ గా మేకర్స్ భావిస్తున్నారు. బీచ్ సిటీ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకకు వేదిక కానుంది. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని దర్శకుడు కె ఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి హీరోయిన్ గా శృతి చిరు,బాలయ్యలతో జతకట్టారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.