Gaami Teaser Talk: వివాదాస్పద కామెంట్లను చిమ్ముకుంటూ స్టార్ల ప్రపంచంలోకి ఎగురుకుంటూ వచ్చాడు విశ్వక్ సేన్. నటుడిగా నిర్మాతగా ఎదిగి హీరోగా మార్కెట్ సాధించి.. మళ్ళీ ప్లాప్ ల వలయంలో చిక్కుకుని.. ప్రస్తుతం హిట్ కొట్టి, ఆ వలయం నుంచి బయట పడటానికి చిన్నపాటి యుద్ధమే చేస్తున్నాడు. విశ్వక్ తాజాగా ఆ యుద్దానికి తగ్గట్టుగానే అదిరిపోయే అప్ డేట్ తో ఎంట్రీ ఇచ్చాడు.

తన నుంచి మరో వైవిధ్యమైన సినిమా రాబోతుందని సడెన్ గా ఒక చిన్న టీజర్ తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో విభిన్నమైన చిత్రాలు చేయడానికి ప్రయత్నం చేసే విశ్వక్ నుంచి ఈ సారి నిజంగానే కొత్తరకం సినిమా రాబోతుంది. ‘గామి’ అంటూ మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్ పేరుతో టీజర్ రిలీజ్ అయింది.
టీజర్ లో అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ ఉన్నాయి. ఆ అద్భుతానికి మించి అత్యున్నతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. పైగా కాన్సెప్ట్ కూడా వినూత్నంగా ఉంది. అందుకే ఈ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పైగా ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ టీజర్ లో మాత్రం విశ్వక్ అఘోర లుక్ రివీల్ కాలేదు.
కాకపోయినా, బ్యాక్ నుంచి 2-3 షాట్స్ లో విశ్వక్ అఘోర లుక్ ఫీల్ ను కలిగించాడు. ఇక ఈ చిత్రాన్ని విద్యాధర్ కాగిట అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన చాందినీ చౌదరి, అభినయ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మరో కీలక పాత్రలో సాయి కుమార్, విలన్ గా మరో యంగ్ హీరో కనిపించబోతున్నాడట.
ఇక ఈ సినిమాను ‘V’ సెల్యులాయిడ్, కార్తీక్ శబరిష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియజేయనున్నారు. దీపావళికి విశ్వక్ సేన్ లుక్ తో పాటు ఒక స్పెషల్ టీజర్ ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.