Virataparvam: రానా దగ్గుబాటి హీరోగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాట పర్వం. సురేశ్‌బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇందులో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తెలంగాణ ప్రాంతంలోని నక్సల్స్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ఓటీటీలో విడుదల చేయనున్నట్లు పలు వార్తలు వినిపించాయి. అయితే, చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
కాగా, సురేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన నారప్ప సినిమా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు దృశ్యం2 కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. అయితే, రానా నటించిన భీమ్లా నాయక్ సినమా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలో పలకరించనుంది. ఈ క్రమంలోనే భీమ్లానాయక్ సినిమా విడుదలైన తర్వాత.. విరాట పర్వం సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
భీమ్లనాయక్ సినిమాలో పవన్‌కల్యాణ్- రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. థమన్ స్వరాలు అందించారు. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.