Taanakkaran Polisodu Review : వ్యక్తుల కలయికే వ్యవస్థ.. ఆ వ్యవస్థ వ్యక్తులను నిర్దేశిస్తూ ఉంటుంది.. అలా నిర్దేశించుకున్న వాటినే విలువలు అంటారు.. ఆ విలువల ఆధారంగానే సమాజం నడుస్తోంది.. భవిష్యత్తు తరాలకు బాటలు పరుస్తోంది.. ఇవన్నీ సరిగ్గా సాగితే ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదు.. కానీ ఈ వ్యవస్థలో కళ్లకు కనిపించని లోపాలు ఎన్నో ఉన్నాయి..అవే సమాజ నిర్దేశానికి ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి.. ఇలాంటి ప్రతి బంధకాలను ఒడిసి పట్టడంలో తమిళ దర్శకులు సిద్ధహస్తులు.. ఓ విసారణయి, కాక ముట్టయి, వడ చెన్నై, అసురన్, కర్ణన్, పుదు పెట్టై… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత ఉంటుంది. ఇవన్నీ కూడా వ్యవస్థను ప్రశ్నించిన సినిమాలు.. వ్యవస్థలో లోపాలను వెలుగులోకి తీసుకొచ్చిన సినిమాలు.. ఈ జాబితాలోకి చేరుతుంది రక్షకభటుడు.. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది.

ఇప్పటికీ మన సమాజంలో ఖాకి కొలువు అంటే ఎక్కడా లేని క్రేజ్ ఉంటుంది.. సినిమాలో కూడా ఆనంద్ (విక్రమ్ ప్రభు) కు పోలీసు ఉద్యోగం ఉంటే చాలా ఇష్టం.. పైగా తన తండ్రికి ఇచ్చిన చివరి మాటకు కట్టుబడి పోలీస్ కావాలి అనుకుంటాడు.. కానిస్టేబుల్ పరీక్ష పాసై శిక్షణ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్ కు వస్తాడు. అతనితోపాటు, దాదాపు 15 ఏళ్ల కిందట పోలీసు ఉద్యోగానికి ఎంపికై కోర్టు కేసు కారణంగా అప్పుడు హాజరు కాలేకపోయిన కొందరు మధ్య వయస్కులు కూడా శిక్షణకు వస్తారు. పోలీస్ శిక్షణలో బ్రిటిష్ కాలం నాటి పద్ధతులను ఇంకా అనుసరించే పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్లో ముత్తు పాండు ( మధుసూదన్ రావు), ఈశ్వర మూర్తి ( లాల్) దే హవా కొనసాగుతూ ఉంటుంది.. శిక్షణలో వారు చెప్పిందే వేదం. ఎవరైనా ఎదురు తిడితే చావ బాదుతారు.. శిక్షణ పేరుతో కొత్తగా వచ్చిన వారిపట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని ఆనంద్ వ్యతిరేకిస్తాడు.. ఇక్కడే దర్శకుడు వ్యవస్థలో లోపాల పట్ల ఒక సామాన్య మానవుడికి ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించాడు.. దీంతో ముత్తు పాండు, ఈశ్వర మూర్తి ఆనంద్ పై దేశాన్ని పెంచుకుంటారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆనంద్ ఏం చేశాడు? శిక్షణలో అతడికి ఎదురైన అనుభవాలు ఏంటి? వాటిని దాటుకొని ఎలా పోలీస్ శిక్షణ పూర్తి చేశాడు అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే
ముందుగానే చెప్పినట్టు మన వ్యవస్థ రూపొందించిన వాటిల్లో సైన్యం, పోలీస్ శిక్షణ అనేది కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది.. అభ్యర్థులను శిక్షితులుగా తీర్చిదిద్దే క్రమంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తారు.. క్రమశిక్షణ పరమావధిగా పోలీస్ ట్రైనింగ్ ఇస్తారు.. వాస్తవానికి పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? అభ్యర్థులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటారన్న సబ్జెక్టు చాలా చిన్నది.. తెలుగు సినిమాల్లో ఇలాంటి కథలు, ట్రైనింగ్ ఎపిసోడ్లు చాలా తక్కువ.. అప్పట్లో విక్టరీ వెంకటేష్ హీరోగా శత్రువు అనే ఒక సినిమా వచ్చింది.. సినిమాలో పోలీస్ ట్రైనింగ్ ఉంటుంది.. కానీ అది తక్కువ నిడివికే పరిమితమై ఉంటుంది.. ఈ సినిమా మొత్తం పోలీస్ ట్రైనింగ్ చుట్టే ఉంటుంది.. అంటే ఇలా పోలీస్ ట్రైనింగ్ చుట్టూ సాగిన చిత్రాలు దాదాపు లేవనే చెప్పొచ్చు. రెండున్నర గంటల పాటు ఇదే చూపిస్తే డాక్యుమెంటరీ అవుతుంది.. కానీ, సబ్జెక్టును కూడా ఆసక్తికరంగా బిగి సడలని కథనంతో తెరపై ఆవిష్కరించవచ్చని చూపించాడు దర్శకుడు తమిళ. పోలీసోడు చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతోంది అనే ఆసక్తి ప్రేక్షకుడిని వెంటాడుతూనే ఉంటుంది.. స్వాతంత్రానికి ముందు పోలీస్ వ్యవస్థ ఎలా ఏర్పడింది? ఎలా శిక్షణ ఇచ్చేవారన్న కథను చెబుతూ సినిమా మొదలు పెట్టిన దర్శకుడు… తర్వాత తక్కువ సమయంలోనే కథలోకి వెళ్లిపోయాడు.. శిక్షణకు వచ్చే వారిపట్ల ఈశ్వర మూర్తి, ముత్తు పాండు మొదటి సీన్ నుంచే కఠినంగా వ్యవహరించడంతో వంటి ఆరంభ సన్నివేశాలతోనే అసలు కథ ఏమిటో ప్రేక్షకుడికి అర్థం అయిపోతుంది.. అయితే ట్రైనర్స్ ఎలాంటి పరీక్షలు పెడతారు? వాటిని కథానాయకుడు, తోటి వారు ఎలా భరిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుడిలో మొదలవుతుంది.. అందుకు తగినట్లుగానే భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ప్రేక్షకుడి మదిని మెలి పెడతాయి.. ట్రైనర్స్ విధించే కఠిన ఆంక్షలు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకోవడం, మరొకరు పరిగెత్తుతూ చనిపోవడం… కోసం భావోద్వేగ భరితంగా సాగుతుంది. ట్రైనర్స్ కు ఎదురుతిరిగితే శిక్ష తప్పదని తెలిసినా… ఆనంద్ వారిని ప్రశ్నించడానికి వెనుకడుగు వేయక పోవడంతో ముత్తు పాండు, ఈశ్వర మూర్తి, ఆనంద్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సన్నివేశాలు సాగుతూ ఉంటాయి.. ట్రైనర్స్ పెట్టే కఠిన శిక్షలు వాటిని ఆనంద్ అతని టీం ఎలా ఎదుర్కొన్నది అన్నది మాత్రం డిస్నీ హాట్ స్టార్ లో మాత్రమే చూడాలి.
మధ్యలో కథానాయిక ట్రాక్ తో కథ కాస్త పక్కకు వెళ్లినట్లు అనిపించినా సినిమాపై పెద్దగా ప్రభావం పడదు. ఇక పోలీస్ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి గురించి, లంచగొండితనం గురించి దర్శకుడు ప్రశ్నించిన తీరు అద్భుతంగా ఉంది.. వీటి ఆధారంగానే పతాక సన్నివేశాలు దర్శకుడు రాసుకున్నాడు.. అవి ప్రేక్షకుల మధ్యలో రకరకాల ప్రశ్నలను ఉంచుతాయి.. వాటికి పరిష్కారం మార్గం ఏదైతే బాగుంటుందనే ఆలోచన సాగుతుండగానే సినిమా ముగుస్తుంది.. ముందుగానే చెప్పినట్టు కల్ట్ సినిమాలు తీయాలంటే సమాజాన్ని చదవాలి. ఆ సమాజం నుంచి వచ్చే కథలకు తిరుగు ఉండదు.. అలాంటిదే ఈ పోలీసోడు.