
తెలుగులో టాప్ డైరెక్టర్ అంటే అందరూ రాజమౌళి వైపే వేలు చూపిస్తారు. టాప్ స్టోరీ రైటర్ ఎవరంటే.. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పేరు చెబుతారు. అవును మరి, ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నింటికీ కథలు అందించింది ఆయనే. ఇవి చూస్తేనే తెలిసిపోతుంది.. ఆయన పెన్ పవర్ ఎలాంటిదో అనే విషయం. మూడు దశాబ్దాలకు పైగానే ఇండస్ట్రీలో ఉన్న విజయేంద్ర ప్రసాద్.. తెలుగులోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలకు సైతం కథలు అందించారు. అలాంటి వాటిల్లో ఒకటి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘భజరంగీ భాయిజాన్’.
2015లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ మూవీతో చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ పేరు మారుమోగింది. అయితే.. ఈ చిత్రానికన్నా ముందే ఆయన పాపులర్. భజరంగీ భాయీజాన్ తర్వాత నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నారు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ ను సైతం ఈ మూవీ మరో స్థాయిలో నిలబెట్టింది.
యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేసిన సల్మాన్.. అందుకు భిన్నంగా చేసిన ఈ సినిమాను యావత్ సినీ ప్రేక్షకులు ఆదరించారు. దీంతో.. బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. అప్పట్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 970 కోట్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలోనే సరికొత్త చరిత్ర నమోదు చేసింది. సల్మాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్ 90 కోట్లు మాత్రమే.
అయితే.. ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి కథను సిద్ధం చేస్తున్నట్టు రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటికే స్టోరీ ఐడియాను సల్మాన్ కు వినిపించాడట. ఈ పాయింట్ సల్మాన్ కు నచ్చడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూర్తికథను సిద్దం చేయమని కూడా చెప్పాడట. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ అదే పనిలో ఉన్నట్టు చెప్పారు. మొత్తానికి.. అద్బుతమైన చిత్రానికి సీక్వెల్ రావడం దాదాపుగా ఖాయమైపోయింది. మరి, ఈ సారి ఎలాంటి ట్విస్టులతో స్టోరీని రన్ చేస్తారనేది చూడాలి.