Vijay Raghavendra Wife Passed Away: కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన బ్యాంకాంక్ లో గుండెపోటుతో మరణించారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన స్పందన అక్కడ చనిపోవడంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శాండల్ వుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న స్పందన చనిపోవటం ఆ పరిశ్రమకు తీరని లోటు అనే చెప్పాలి.
ఆదివారం రాత్రి స్పందనకు గుండెపోటు రావడంతో ఆమెను బ్యాంకాంగ్ లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె భర్త విజయ్ రాఘవేంద్ర తన కొత్త సినిమా ‘కడ్డ’ రిలీజ్ కి సిద్ధంగా ఉండటం తో బెంగుళూరు లో ఉన్నాడు. ఆమె మరణ వార్త తెలియగానే బంధువులతో కలిసి బ్యాంకాంగ్ బయలుదేరినట్లు తెలుస్తుంది. మంగళవారం స్పందన భౌతికకాయాన్ని బెంగళూరు తీసుకు వచ్చే అవకాశం ఉంది.
2007 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయ్ రాఘవేంద్ర, స్పందన. ఈ నెలలోనే వీరి వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. ఈ జంటకు శౌర్య అనే కొడుకు ఉన్నాడు. వీరికి కన్నడనాట భారీగా అభిమానులు ఉన్నారు. దాదాపు 50 సినిమాల్లో నటించి, ‘చిన్నారి ముఠా ‘ అనే సినిమాతో జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అలాగే 20 పాటలు పైగా పాడిన విజయ్ కన్నడ లో జరిగే అనేక టీవీ షో లకు జడ్జి వ్యవహరిస్తాడు. స్పందన నిర్మాతగా మారి తన భర్త నటించిన సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది.
స్పందన 2016లో రవిచంద్రన్ ‘అపూర్వ’ చిత్రంలో నటించి మెప్పించింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కు విజయ్ రాఘవేంద్ర దగ్గరి బంధువు అవుతారు. 2021 లో పునీత్ గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు స్పందన కూడా గుండెపోటుతో చనిపోవడం బాధాకరం. తుళు కుటుంబానికి చెందిన స్పందన మాజీ పోలీస్ అధికారి శివరామ్ కుమార్తె . ఇక స్పందన మృతిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఆమె మరణ వార్త మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. స్పందన ను కోల్పోయిన విజయ్ రాఘవేంద్ర, శివరామ్ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాడు