
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్) పేరిట చారిటీలను నెలకొల్పాడు. టీడీఎఫ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఉద్యోగులుగా తీర్చనున్నాడు. లక్షమంది ఉద్యోగులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ఈ ఛారిటికీ కోటి రూపాయాలను కేటాయించాడు.
ఎంసీఎఫ్ ద్వారా మిడిల్ క్లాస్ ప్రజలకు సేవలందించనున్నాడు. దీనికి రూ.25లక్షలు కేటాయించాడు. ఎంసీఎఫ్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నాడు. ఇందుకోసం thedeverakondafoundation.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఫౌండేషన్ సభ్యులు స్వయంగా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపాడు. 2వేల కుటుంబాల అవసరాలని తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్మాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ కావడంతో విజయ్ తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో స్టార్ హీరోలంతా విరాళాలు ప్రకటిస్తుండగా విజయ్ దేవరకొండ మౌనం పాటించడంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈనేపథ్యంలో విజయ్ దేవరకొండ తాజాగా రెండు ఛారిటీలు స్థాపించి కోటి 25లక్షల విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.