MLC Kavitha- Liger: ‘మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి’ ముత్యాల ముగ్గు సినిమాలో విలన్ రావుగోపాలరావు ఫేమస్ డైలాగ్ ఇది. సినిమా పాతదే అయినా సందర్బోచితంగా ఈ డైలాగ్‌ను వాడుతుండడంతో అందరి నోళ్లలో నానుతూనే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గారాలపట్టి.. నిజామాబాద్ స్థానిక సమస్థల ఎమ్మెల్యే ఈ డైలాగ్‌ను నిజం చేస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తన కళానైపుణ్యం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో నాడు ఎంపిగా ఉన్న కవిత అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మంచిర్యాలలోని ఓ కేంద్రంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు రావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె హస్తం ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని కవిత స్వయంగా ఖండించినా ఆమె తండ్రి కేసీఆర్‌గానీ, సోదరుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కె.తారకరామారావుగానీ, ఇతర కుటుంబ సభ్యులెవరూ దీనిని తోసిపుచ్చలేదు. మరోవైపు కేసీఆర్ ఈ విషయంపై కవితకు క్లాస్ తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాగా, లిక్కర్ స్కాంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ రెండు రంగాల్లో కవిత తన కళానైపుణ్యం ప్రదర్శించినట్లు ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఆమె వెండితెర కళాపోషణను బయట పెట్టుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

లైగర్ సినిమా నిర్మాణంలో కవిత బ్లాక్ మనీ…
తాజాగా కవితపై బ్లాక్ మనీ ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన పూరీజగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు సినిమా నిర్మాణానికి పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆధారాలతో ఈడీ, సీబీఐకి తాజాగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తే కవిత గురించి మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని విపక్షాలు పేర్కొంటున్నాయి.
ఆగని అవినీతి ఆరోపణలు..
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అవినీతి ఆరోపణలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితకు వాటాలున్నాయని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. చివరకు కవిత తప్పుడు ప్రచారం ఆపాలని కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కుంభకోణంలో తనపై ఎవరూ ఆరోపణలు చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె సన్నిహితుల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా కవితపై తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ మరో బాంబు పేల్చారు. ‘లైగర్’ సినిమాలో కవిత బ్లాక్‌మనీని పెట్టుబడిగా పెట్టారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
భారీ సినిమా కావడం.. బ్లాక్ వైట్‌గా మారుతుందన్న ఆశతో..
విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ‘లైగర్’ వచ్చింది. ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌తో పాటు భారీ తారాగణం ఉన్నారు. మరోవైపు హిట్లు లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో కవిత తన బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా సినిమాకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

‘తెర’వెనుక పెట్టుబడి..
‘లైగర్’ సినిమాకు కథానాయిక ఛార్మి, బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే నిర్మాతలుగా వ్యవహరించారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కవిత పెట్టుబడి పెట్టిందంటూ ఫిర్యాదుల చేయడంతో ‘తెర’ వెనక ఈ సినిమాపై ఇంకా ఎంతమంది పెట్టుబడి పెట్టివుంటారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈడీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంటే కొందరు పారిశ్రామికవేత్తల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.