Victory Venkatesh: అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ నేటితో హీరోగా 36 ఏళ్లు కంప్లీట్ చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నట ప్రస్థానం గురించి, ఆయన జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కారంచేడులో వెంకటేష్ జన్మించారు. సోదరుడు సురేష్ బాబుతో పాటు సోదరి లక్ష్మితో కలిసి వెంకీ తన విద్యాభ్యాసాన్ని చెన్నైలో పూర్తి చేశారు. చెన్నై లయోలా కాలేజ్‌లో వెంకటేష్ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎస్‌లో మాంటెస్సోరిలోని మిడిల్‌బరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు.
స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత హీరోగా మారారు. అయితే, చిన్న తనంలోనే వెంకీ ఓ సినిమాలో నటించాడు. తన కుటుంబ నేపథ్యమే ఓ సినీ లోకం. దాంతో మూవీ మొగల్ రామానాయుడు కుమారుడిగా వెంకటేష్ కి చిన్న తనంలోనే సినీ ఎంట్రీ దొరికింది. 1971లో వచ్చిన ‘ప్రేమ్ నగర్’లో బాలనటుడిగా వెంకటేష్ నటించారు. అయితే, వెంకటేష్ తల్లి గారు రాజేశ్వరికి ఇది నచ్చలేదు. వెంకటేష్ బాగా చదువుకోవాలి అని ఆమె కోరుకున్నారు. తల్లి మాట ప్రకారం వెంకటేష్ ఆ తర్వాత మళ్లీ బాలనటుడిగా మరో సినిమాలో నటించలేదు. ఇక 1986లో వచ్చిన ‘కలియుగ పాండవులు’ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా వెంకటేష్ పరిచయమయ్యారు.
వెంకీ హీరో కాకముందే 1985లో వెంకటేష్, నీరజల వివాహమైంది. వీరికి హయవాహిని, ఆశ్రిత, భావన ముగ్గురు అమ్మాయిలు, అర్జున్ రామంత్ అనే కుమారుడు ఉన్నాడు. ఫ్యామిలీ లైఫ్ ను వెంకీ బాగా ఇష్ట పడతారు. వెంకీ సినీ జర్నీ విషయానికి వస్తే వెంకీకి సక్సెస్ అంత ఈజీగా ఏమీ రాలేదు. మొదటి సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. రెండో సినిమాని భారీగా చేయాలని ప్లాన్ చేశారు రామానాయుడు. ఈ క్రమంలోనే కె.విశ్వనాథ్ దగ్గరకు వెళ్ళి బ్లాంక్ చెక్ ఇచ్చి.. తన కుమారుడికి హిట్ సినిమా చేయాల్సిందిగా నాయుడుగారు కోరారు.
దాంతో రెండో సినిమాకే వెంకీకి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. వీరి కలయికలో ‘స్వర్ణకమలం’ సినిమా వచ్చింది. వెంకటేష్ కు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. కాకపోతే.. ఈ చిత్రాన్ని 1989 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. ఇది అప్పట్లో సంచలనం అన్నట్టు మాట్లాడుకున్నారు. కానీ నిర్మాత నాయుడు గారికి మాత్రం భారీ నష్టాలను మిగిల్చింది ఈ సినిమా.
ఆ తర్వాత 1988లో వచ్చిన మ్యూజికల్ రొమాంటిక్ చిత్రం ‘ప్రేమ’లో వెంకటేష్ నటించారు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక సినిమాలు చేయకూడదు అని వెంకటేష్ నిర్ణయించుకున్నారు. అప్పుడే, ‘బ్రహ్మ పుత్రుడు’ సినిమా బలవంతం మీద చేయాల్సి వచ్చింది. వెంకీ అయిష్టంగానే ఈ చిత్రంలో నటించాడు. ఈ సారి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. ఆ తర్వాత.. ‘బొబ్బిలి రాజా’ సినిమా పడింది. ఇక అంతే.. వెంకీ స్టార్ అయిపోయాడు. మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్‌గా వెంకీ నటించిన ‘క్షణ క్షణం’ సినిమా కూడా మంచి లాభాలను అందించింది. ముఖ్యంగా సెకండ్ రన్‌లో బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ట్రెండ్ సెట్టర్‌గా కూడా నిలిచింది.
అయితే, వెంకీ కెరీర్ కే కీలకం అయిన సినిమా మాత్రం చంటి. 1991లో వచ్చిన ఈ ఫ్యామిలీ డ్రామాతో నే వెంకటేష్ కి ఫ్యామిలీ హీరో అనే ఇమేజ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి నేటి వరకూ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా సెటిల్ అయిపోయారు. మధ్యలో హిందీలో ‘అనారి’ అనే చిత్రంలో కూడా వెంకటేష్ నటించారు. ఇందులో వెంకటేష్ హీరోగా.. హీరోయిన్‌గా కరిష్మా కపూర్ నటించారు.. ఈమె అప్పట్లో వెంకీ కి మంచి జోడీ అని అన్నారు. అయితే, ఆ తర్వాత సౌందర్య, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్.. అత్యంత విజయవంతమైన కాంబినేషన్లలో ఒకటి. వీరిద్దరూ ఏడు సినిమాల్లో నటించగా ఆరు సినిమాలు విజయవంతమయ్యాయి. తెరపై వెంకటేష్, సౌందర్యల కెమిస్ట్రీ, నటనకు కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా బాగా అందాయి.
మొత్తానికి ప్రేమ సినిమాల హీరోగా వెంకీ నిలిచిపోయారు. ‘ప్రేమించుకుందాం రా’లాంటి విజయవంతమైన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలలో ఆయన నటించారు, అలరించారు, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ ఖాతాలో ‘ప్రేమతో రా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి రొమాంటిక్ సినిమాలు కూడా చేరాయి. మధ్యలో 2005లో యాక్షన్ ఫిల్మ్ ‘ఘర్షణ’ లాంటి చిత్రాలను కూడా వెంకీ చేశారు. లాస్ట్ సినిమా ఎఫ్ 3 వరకూ వెంకీ తన ఫ్యామిలీ ఇమేజ్ ను అలాగే పెంచుకుంటూ రావడం విశేషం.
వెంకీ గురించి మరో ఆసక్తికరమైన అంశం. ఆయన చేసే యాడ్స్ కూడా ప్రత్యేకం. వెంకీ రెగ్యులర్ యాడ్స్ లో ఎప్పుడూ నటించలేదు. ప్రస్తుతం వెంకటేష్ ఓ ఫైనాన్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారు. అలాగే రూమ్ క్లీనర్ యాడ్, కాటన్ పంచెల వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపిస్తున్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ఏడు నంది పురస్కారాలు వెంకటేష్‌ను ఏకంగా ఏడుసార్లు వరించాయి. ‘కలియుగ పాండవులు’కు బెస్ట్ మేల్ డెబ్యూగా, ‘స్వర్ణ కమలం’ సినిమాకు బెస్ట్ యాక్టర్ స్పెషల్ జ్యూరీగా, ‘ప్రేమ’, ‘ధర్మ చక్రం’, ‘గణేష్’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలను వెంకటేష్ అందుకున్నారు. వెంకీ ఇలాగే మనల్ని అలరించాలని ఆశిద్దాం.
Also Read:Mahesh-Trivikram Movie: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా ప్రముఖ స్టార్ హీరో..షాక్ లో ఫాన్స్