Saindhav Trailer: వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కుతుంది సైంధవ్. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. నేడు విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ గమనిస్తే… తండ్రీ కూతుళ్ళ ఒక అందమైన ఫ్యామిలీ. అనుకోకుండా చిన్నాభిన్నం అవుతుంది. వాళ్లకు ఒకరంటే మరొకరికి ప్రాణం. ఆ పాపకు వాళ్ళ నాన్న సూపర్ హీరో. ఆయన ఉంటే తనకు ఏం కాదనే ధైర్యం. అనూహ్యంగా ఆ పాప అరుదైన వ్యాధి బారిన పడుతుంది. కాపాడుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన మెడిసిన్ కావాలి.
ఇక మిడిల్ క్లాస్ తండ్రి అంత డబ్బు ఎలా తేగలడు? పాపను కాపాడుకునే క్రమంలో మాఫియాతో ఎందుకు తలపడ్డాడు? మాఫియాకు పాప ప్రాణాలకు సంబంధం ఏంటి? అనేది మిగతా కథ. దర్శకుడు శైలేష్ కొలను ఎమోషన్ అండ్ యాక్షన్ కలిగి సైంధవ్ మూవీ తెరకెక్కించాడు. ఈ మధ్య కాలంలో వెంకటేష్ నుండి ఈ రేంజ్ యాక్షన్ చూడలేదు.
వెంకీ మాస్ డైలాగ్స్ సైతం ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్ బ్లాక్స్ సినిమాకు హైలెట్ గా నిలవడం ఖాయం. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక రోల్ చేశాడు. సైంధవ్ చిత్రంలో భారీ క్యాస్ట్ నటించారు. తమిళ నటుడు ఆర్య, జిషు సేన్ గుప్త, ముఖేష్ రిషి లెక్కకు మించిన స్టార్ క్యాస్ట్ ఉంది. శ్రద్దా శ్రీనాథ్ వెంకీకి జంటగా నటించింది.
దర్శకుడు శైలేష్ కొలను హిట్, హిట్ 2 చిత్రాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. సైంధవ్ హిట్ యూనివర్స్ లో భాగమే అని ప్రచారం జరిగింది. ట్రైలర్ చూస్తే ఆ చిత్రాలతో దీనికి సంబంధం లేదని తెలుస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.